బాకా పూలు భలే...!

హృదయాకారపు ఆకులు, ట్రంఫెట్‌(బాకా) ఆకృతిలో విరిసే పూలు...కాంతిమంతమైన వర్ణాలతో విరబూసే మార్నింగ్‌ గ్లోరీపై మనసు పారేసుకునేవారు చాలామందే. దీన్నెక్కడ నాటినా... అందంగా అల్లుకుపోతూ ఆకట్టుకుంటుంది.

Published : 11 Apr 2024 05:44 IST

హృదయాకారపు ఆకులు, ట్రంఫెట్‌(బాకా) ఆకృతిలో విరిసే పూలు...కాంతిమంతమైన వర్ణాలతో విరబూసే మార్నింగ్‌ గ్లోరీపై మనసు పారేసుకునేవారు చాలామందే. దీన్నెక్కడ నాటినా... అందంగా అల్లుకుపోతూ ఆకట్టుకుంటుంది. ఆ ప్రదేశానికి రెట్టింపు ఆకర్షణను తెచ్చిపెడుతుంది. మీరూ దీన్ని పెంచాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.

మార్నింగ్‌ గ్లోరీ అనేది కనవల్వులేసి కుటుంబానికి చెందిన పూల మొక్క, ఇది మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది. 10 అడుగుల వరకు పెరిగే ఈ తీగ జాతి మొక్క వేల రకాల్లో దొరుకుతుంది. ఇపోమియా పర్పూరియా(కామన్‌ మార్నింగ్‌ గ్లోరీ), ఇపోమియా త్రివర్ణ(హెవెన్లీ బ్లూ) వంటివి ఇందులోని ప్రసిద్ధ రకాలు. ఇక ఈ పూలు తెలుపు, నీలం, గులాబీ, ఊదా, ఎరుపు... ఇలా అనేక రంగుల్లో పూస్తాయి. అయితే ఈ మార్నింగ్‌ గ్లోరీస్‌ రాత్రి పూట పాక్షికంగా వికసించి... మరుసటి రోజు సూర్యకిరణాల తాకిడితో విచ్చుకుంటాయి. ఇవి ఏడాది పొడవునా పూలు పూస్తాయి. ప్రత్యక్ష కాంతిలో ఆరోగ్యంగా ఎదిగే ఈ మార్నింగ్‌ గ్లోరీ మొక్క... పాక్షికంగా నీడ ఉన్నా జీవిస్తుంది. అయితే, ఎదగడానికి కాస్త బలమైన ఆధారం ఉండాలి. లేదంటే గ్రౌండ్‌ కవర్‌లానూ పెంచుకోవచ్చు.

సంరక్షణ ఇలా...

మార్నింగ్‌ గ్లోరీ మొక్కను సాధారణంగా విత్తనాల ద్వారానే పెంచుతారు. వీటిని వసంత కాలంలో నాటుకుంటే సరి. ఇది తీగజాతి మొక్క. దీన్ని కంటైనర్లు, వెదురు కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఈ మొక్కను నేలలో నాటాలనుకున్నప్పుడు మట్టిలో కలుపు తొలగించి, కంపోస్ట్‌, సేంద్రియ ఎరువుని కలిపి నేలను సిద్ధం చేసుకోవాలి. నాటిన విత్తనాలు 7-14 రోజుల్లో మొలకెత్తుతాయి. 60-90 రోజులలో పుష్పించడం ప్రారంభిస్తాయి. వీటికి క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. అయితే, నీరు నిలవకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన పెరుగుదలకూ, పూలు ఎక్కువగా పూసేందుకు ప్రతి 2-3 వారాలకు ఒకసారి ఎరువుల్ని అందించాలి. ఎండిన కొమ్మలనూ, పూలనూ ఎప్పటికప్పుడు తీగ నుంచి తొలగిస్తే కొత్త చిగుళ్లు వస్తాయి. సాధారణంగా ఈ మార్నింగ్‌ గ్లోరీకి సాలీడు, తెల్లదోమ, పేనుబంక వంటి చీడలు పడతాయి. అందుకే ఏదైనా దెబ్బతిన్న కాండాలను, ఆకుల్నీ తీసేస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్