ఎంబ్రాయిడరీతో రామకథ!

ఎంబ్రాయిడరీ చిన్ననాటి జ్ఞాపకం ఆమెకు. సరదాగా ప్రయత్నించి, అభిరుచిగా మలచుకున్నారు. తరవాత పూలు, ఆకులు కాదు... పురాణగాథలకు అల్లికల్లో ప్రాణం పోయాలనుకున్నారు కనుమూరి అపర్ణ.

Published : 17 Apr 2024 14:28 IST

ఎంబ్రాయిడరీ చిన్ననాటి జ్ఞాపకం ఆమెకు. సరదాగా ప్రయత్నించి, అభిరుచిగా మలచుకున్నారు. తరవాత పూలు, ఆకులు కాదు... పురాణగాథలకు అల్లికల్లో ప్రాణం పోయాలనుకున్నారు కనుమూరి అపర్ణ. అలా రామాయణాన్ని వస్త్రంపై తీర్చిదిద్ది... అందరి మన్ననలూ అందుకుంటున్నారు.

చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ ఎంబ్రాయిడరీ చేస్తోంటే ముచ్చటగా చూసేదాన్ని. కాస్త పెద్దయ్యాక నాకూ ప్రయత్నించాలనిపించింది. మాది సికింద్రాబాద్‌. మొదట్నుంచీ నేను అందరిలా డిజైన్లు వేసేదాన్ని కాదు. జంతువులు, పక్షుల బొమ్మలను ప్రయత్నించేదాన్ని. ఎంకామ్‌ తరవాత పెళ్లైంది. మావారు రామ్మోహనరావు డాక్టర్‌. మాకో బాబు. తీరిక వేళలో నా అభిరుచిపై దృష్టిపెట్టేదాన్ని. అయితే అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నా. దీంతో ఇంట్లోవాళ్ల ముఖాలనే ఎంబ్రాయిడరీ చేయడం ప్రారంభించా. అందరికీ చాలా నచ్చాయి. శిక్షణా లేకుండా బాగా తీర్చిదిద్దానని అందరూ మెచ్చుకున్నారు. అది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

లాక్‌డౌన్‌లో అయోధ్య రామాలయ నిర్మాణానికి ‘భూమి పూజ’ చేస్తున్నారనే వార్త విన్నా. అప్పట్నుంచీ రాముడి రూపమే మనసులో మెదిలేది. ఆయన కథని కుట్లు, అల్లికల్లో చూడాలని అనిపించింది. వెంటనే ప్రారంభించా. రోజులో పది గంటలు దానికే కేటాయించేదాన్ని. వంద ప్యానెల్స్‌ చేయడానికి ఏడాది సమయం పట్టింది. దాన్ని పుస్తకంలా తయారుచేశా. ఒక్కో సన్నివేశాన్నీ ఎంబ్రాయిడరీ చేస్తోంటే రామాయణం కళ్లముందే జరిగినట్లు అనిపించేది. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా స్నేహితురాలితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నా. అప్పుడే నా ఎంబ్రాయిడరీ పుస్తకాన్ని అందరికీ చూపించా. నచ్చుతుందో లేదోనని భయపడ్డా. కానీ చూసినవాళ్లు బాగుందని ప్రశంసించడంతో సంబరపడ్డా.

ఎంబ్రాయిడరీకి తోడు అవసరమైన చోట రంగులనీ అద్దా. అందమైన రంగులతో ఉండేసరికి పెద్దలే కాదు పిల్లలూ ఆకర్షితులయ్యారు. అప్పుడే ఇతిహాసాలను పిల్లలకు పరిచయం చేయడం మన బాధ్యత అనిపించింది. రోజూ ఇన్ని గంటలు ఏకధాటిగా పనిచేయడం కష్టమే. అయినా ఎప్పుడూ ఆపాలి అనిపించలేదు. పైగా ఇది నా దృష్టిలో కళ మాత్రమే కాదు... ఒత్తిడిని తగ్గించే మంత్రం కూడా. అల్లికలూ, కుట్లూ మానసిక ప్రశాంతతను అందిస్తాయని బలంగా నమ్ముతా. పుస్తకమే కాదు... లాకెట్స్‌, చిన్నచిన్న అలంకరణ వస్తువులనీ చేస్తుంటా. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉండాలి. అది మానసిక సంతృప్తి ఇవ్వడంతోపాటు అవసరమైతే ఆర్థికంగానూ ఆదుకోగలదు. బాధ్యతల్లో పడి దాన్ని మాత్రం పక్కన పడేయొద్దన్నది నా సలహా.

సాయి అదపాక

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్