రాత్రివేళకి... సుగంధాల రాణి!

పరిమళాలను వెదజల్లే పూల మొక్క నైట్‌క్వీన్‌. అలంకారం కంటే... దీన్ని సువాసనకోసమే ఎక్కువగా పెంచుతారంటే అతిశయోక్తి కాదేమో! మరి మీ బాల్కనీలో పెంచుకోవాలనుకుంటే... మెలకువలు తెలుసుండాలి కదా! ఇవి మీకోసమే... క్వీన్‌ ఆఫ్‌ నైట్‌, నైట్‌ క్వీన్‌, రాత్‌కీ రాణీ...ఇలా ప్రాంతానికో పేరుతో కనిపించే ఈ పూల మొక్క శాస్త్రీయ నామం సెస్ట్రమ్‌ నాక్టర్నమ్‌.

Published : 25 Apr 2024 02:09 IST

పరిమళాలను వెదజల్లే పూల మొక్క నైట్‌క్వీన్‌. అలంకారం కంటే... దీన్ని సువాసనకోసమే ఎక్కువగా పెంచుతారంటే అతిశయోక్తి కాదేమో! మరి మీ బాల్కనీలో పెంచుకోవాలనుకుంటే... మెలకువలు తెలుసుండాలి కదా! ఇవి మీకోసమే...

క్వీన్‌ ఆఫ్‌ నైట్‌, నైట్‌ క్వీన్‌, రాత్‌కీ రాణీ...ఇలా ప్రాంతానికో పేరుతో కనిపించే ఈ పూల మొక్క శాస్త్రీయ నామం సెస్ట్రమ్‌ నాక్టర్నమ్‌. సోలనేసి కుటుంబానికి చెందిన ఇది... పొదలా పెరిగే ఈ మొక్క పూలు రాత్రి పూట వికసిస్తాయి. ఆకుల కొనలు... సూది మొన తేలినట్లు ఉండి పచ్చగా నిగనిగలాడతాయి. కిందకి వాలినట్లు ఉండే వీటి పూలు కాండం పక్కనున్న ఆకుల నుంచి వస్తాయి. ఆకుపచ్చ, తెలుపు కలగలిపిన రంగులో, గొట్టం ఆకృతిలో విరబూస్తాయివి. ఇందులో ఊదా, పసుపు రంగుల్లో విరిసే రకాలూ ఉన్నాయి. ఈ మొక్క పదమూడు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లో పెంచుకునేటప్పుడు మాత్రం కత్తిరించి దీని పొడవుని నియంత్రిస్తే చూడ్డానికి గుబురు పొదలా అందంగా కనిపిస్తుంది. లేదంటే కాండం సన్నటి తీగలా బలహీనంగా ఎదుగుతుంది.

సంరక్షణ ఇలా...

తెల్లటి పూలు... మత్తెక్కించే పరిమళంతో నైట్‌క్వీన్‌... చుట్టూ ఉండే ప్రదేశాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే రాత్‌కీ రాణి పేరుతోనే మధ్య ప్రాచ్యం, భారతదేశాల్లో ఈ సుగంధ అత్తర్లూ దొరుకుతాయి. వెచ్చటి వాతావరణం ఉన్నంత కాలం ఇవి చక్కగా వికసిస్తాయి. ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మాత్రం ఎండ తగినంత కావాలి. కనీసం ఆరుగంటలైనా ప్రత్యక్ష సూర్య కాంతి అవసరం. సారవంతమైన ఇసుక నేలల్లో ఇది బాగా ఎదుగుతుంది. దీనికి నీటి అవసరం ఎక్కువ. మొక్క ఎదిగే సమయంలో కాస్త ఎక్కువగా పోయాలి. నిరంతరం తేమ నిలిచి ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, కుండీల్లో పెంచినప్పుడు... వేర్లు దెబ్బతినకుండా రెండేళ్లకోసారి రీపాటింగ్‌ చేయాలి. కంపోస్ట్‌ రెండు నెలలకోసారైనా అందిస్తే... మొక్క పచ్చగా నిగనిగలాడుతుంది. పూలూ బాగా వస్తాయి. కొమ్మ కత్తిరింపుల ద్వారా కొత్త మొక్కల్ని పెంచొచ్చు. గొంగళి, తెల్ల దోమ వంటివాటి బెడద వీటికెక్కువ. ఇలాంటప్పుడు సబ్బు నీళ్లు, వేపనూనె ద్రావణం స్ప్రే చేస్తే సరిపోతుంది. మరింకెందుకాలస్యం... మీ ఇంటి పరిసరాల్ని సుగంధ భరితం చేసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్