పీసీఓఎస్‌ ఉంది... ఏం తినాలి?

నా వయసు 28. పెళ్లై నాలుగేళ్లు. నాకు పీసీఓఎస్‌ ఉంది. దానితో పాటు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉండటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరి సరిగా రావడం లేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలంటే ఇన్సులిన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవాలంటున్నారు.

Published : 02 May 2024 15:34 IST

నా వయసు 28. పెళ్లై నాలుగేళ్లు. నాకు పీసీఓఎస్‌ ఉంది. దానితో పాటు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉండటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరి సరిగా రావడం లేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలంటే ఇన్సులిన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవాలంటున్నారు. ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఓ సోదరి

పీసీఓఎస్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నవారిలో బరువు పెరిగి హార్మోన్ల హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. దీనివల్ల నెలసరి సమస్యలూ ఏర్పడతాయి. వీటిని నియంత్రణలో ఉంచాలంటే ముందుగా మీ దినచర్యలో మార్పులు చేసుకోవాలి. అంటే.. తీసుకునే ఆహార పరిమాణంతో పాటూ ఆహార వేళలను తప్పనిసరిగా పాటించాలి. శారీరక శ్రమ, తగినంత నిద్ర కూడా ముఖ్యం. ఒత్తిడి లేకుండానూ చూసుకోవాలి. శారీరక వ్యాయామాలు.. కండరాల బలానికి, గుండెకు సంబంధించిన వాటిని ఎంచుకుంటే మంచిది. మీ బరువు, ఇన్సులిన్‌ శాతం ఎంత ఉందో చెప్పలేదు. ఎత్తుకు మించి బరువు ఉంటే మాత్రం తగ్గాలి. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నప్పటికీ కొందరిలో బరువు నియంత్రణలోనే ఉంటుంది. దీన్ని లీన్‌ పీసీఓఎస్‌ అంటారు. ఇన్సులిన్‌ హెచ్చుతగ్గులున్నవారు సమయానికి భోజనంతో పాటూ సాయంత్రం స్నాక్స్‌ను కూడా తీసుకోవాలి. చిరుతిండిగా గింజలు తీసుకున్నా మంచిదే. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ ఉండే తృణధాన్యాలు, సోయా, పప్పుదినుసులు తీసుకోవడం వల్ల తగినన్ని కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్లు లభిస్తాయి. కాయగూరలు, పండ్లు రోజూ తినాలి. బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగుల్ని తీసుకోవాలి. నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించి పీసీఓఎస్‌, ఇన్సులిన్‌ స్థాయులు అదుపులోకి వచ్చాక ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్