అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. పెళ్లప్పుడు ఆయన ఎంబీఏ చేసి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తరవాత ఎప్పుడూ నష్టాలనీ, కొత్త బిజినెస్‌ మొదలుపెడతాననీ డబ్బులు అడిగేవారు.

Published : 07 May 2024 14:38 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. పెళ్లప్పుడు ఆయన ఎంబీఏ చేసి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తరవాత ఎప్పుడూ నష్టాలనీ, కొత్త బిజినెస్‌ మొదలుపెడతాననీ డబ్బులు అడిగేవారు. దాంతో నేను దాచుకున్న డబ్బులు ఇవ్వడంతో పాటు బంధువుల దగ్గరా, రకరకాల లోన్లు పెట్ట్టి రుణాలు తీసుకున్నా. ఏళ్లు గడుస్తున్నా... అదే పరిస్థితి. ఈఎమ్‌ఐల భారం మోయలేకపోతున్నా. తాజాగా మరోసారి రుణం తీసుకోమని ఒత్తిడి తేవడంతో ఇక, విడాకులకు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నా. కోర్టు దీన్ని కారణంగా పరిగణిస్తుందా? 

ఓ సోదరి

పదేళ్లుగా మీరెంత సాయం చేస్తున్నా... మీ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదంటున్నారు. ఆ కారణంగా మిమ్మల్ని అప్పులు తీసుకురమ్మని బలవంతం చేయడం క్రూరత్వం కిందకే వస్తుంది. అయితే, దాన్ని నిరూపించడం కష్టం. హిందూ వివాహ చట్టం(సెక్షన్‌-13) కింద అక్రమ సంబంధం పెట్టుకోవడం, శారీరకంగా, మానసికంగా హింసించడం, రెండేళ్లు  భాగస్వామికి దూరంగా ఉండటం, మతం మారడం, మానసిక స్థితి సరిగా లేక వెళ్లిపోవడం...వంటి వాటిని కారణాలుగా చూపించి విడాకులు తీసుకోవచ్చని చెబుతోంది. అయితే, ఇందులో సరైన నిర్వచనం ఇవ్వకపోయినా... మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించడం క్రూరత్వమే అంటూ పలు కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇక, మీ విషయానికి వస్తే పెళ్లికి ముందు భర్త, అత్తింటి వారి గురించి లోతుగా తెలుసుకోలేకపోవడమే మీ సమస్యకు ప్రధాన కారణం. భర్తను నమ్మి మీరు అప్పులు తెచ్చివ్వడం, తిరిగి వాటిని ఆయన తీర్చలేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఇదంతా ఆర్థిక హింసే. అయితే, ఇప్పటివరకూ తీసుకున్న అప్పులను తీర్చాల్సిన బాధ్యత అతనిదే. మీరు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అతడి వేధింపుల్ని మీరు నిరూపించగలగాలి. అంటే... మీరు మీవారి కోసం తీసుకున్న లోన్లు, ఆ డబ్బుని అతడి వ్యాపారంలో పెట్టినట్లుగా ఆధారాలు చూపించాలి. లేదంటే అతడు మీరు లోన్‌ ఎందుకు తీసుకున్నారో తెలియదని బుకాయించే అవకాశం ఉంది. అతడి దగ్గర్నుంచి మీకు ఏమీ రాకపోయినా తండ్రిగా తన కొడుక్కి  మెయింటెనెన్స్‌ ఇవ్వాలి. అలానే, మీ దగ్గర నుంచి తీసుకున్న రుణాలు, పెళ్లప్పుడు ఇచ్చిన కట్న కానుకలు... అన్నింటికీ కలిపి సెక్షన్‌ 25 కింద శాశ్వత భత్యం అడగండి. డివోర్స్‌ కేసుతో పాటు కోర్టు దాన్నీ నిర్ణయిస్తుంది. ఆలోచించి అడుగు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్