మా కోడలు చిన్న పనీ చేయట్లేదు..!

మా అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కోడలు పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది. ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో చిన్న పని కూడా చేయదు.

Updated : 25 May 2024 21:42 IST

మా అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కోడలు పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది. ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో చిన్న పని కూడా చేయదు. నేను కోప్పడితే వేరు కాపురం పెడతానంటోంది. మా అబ్బాయిని చూడకుండా నేను ఉండలేను. ఆయనేమో కొడుకూ, కోడలు వేరుగా వెళ్తే బాధ్యత తెలుస్తుంది, నీకూ పనిభారం తగ్గుతుంది అంటున్నారు. ఏం చేయమంటారు? 

ఓ సోదరి

అత్తగారుగా, కుటుంబ పెద్దగా మీ కోడలు మీతో కలిసిపోయి ఇంట్లో పనులు చేస్తూ బాధ్యతలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు. అయితే, ఒకప్పటి ఆలోచనాధోరణి ఇప్పుడు లేదు. ప్రస్తుతం ఆడ, మగ భేదం లేకుండా పిల్లల్ని  చదివిస్తున్నారు. చదువుల్లో ఏకాగ్రత ఉండాలని తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు వాళ్లకు వేరే పనులు చెప్పడం లేదు. ఒక్కరే కూతురు ఉన్నా ఎక్కువ ప్రేమ చూపించడం, పనులు చెప్పకపోవడం జరుగుతుంది. నిజానికి అబ్బాయైనా అమ్మాయైనా సరే... ఇద్దరికీ జీవననైపుణ్యాలు అవసరమే. అయినా, పెళ్లంటే అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్లి పనిచేయడం అని కాదు. కానీ పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా వారి వారి పాత్ర, బాధ్యతలు మారిపోతాయి. కాబట్టి  ఒకవేళ ఆ పనులన్నీ ముందుగానే ఆమె నేర్చుకున్నా కూడా... మీ ఇంటి పద్ధతులు నేర్చుకోడానికి సమయం పడుతుంది. ఎవరైనా బాధ్యతలన్నీ ఒకేసారి తీసుకోలేరు. కాబట్టి, మీరు తప్పులు పట్టకుండా కొంచెం కొంచెంగా బాధ్యతలు ఇస్తూ నేర్చుకునేలా చూడండి.

ఎందుకంటే, మీ అబ్బాయి పెద్దవాడైనా సరే, అతణ్ని విడిచి ఉండలేనని మీరు అనుకున్నట్లే, వాళ్ల తల్లిదండ్రులు కూడా మీ ఇంట్లో వాళ్లమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా! ముందు మీరు స్నేహపూర్వకంగా ఆమెకు చెప్పడానికి ప్రయత్నించండి. నేర్చుకోవడానికి సమయం ఇవ్వండి. అప్పుడూ మార్పు రాలేదంటే, మీ వారు చెప్పినట్లు వాళ్లను వేరే ఇంట్లో ఉండమనండి. రోజూ ఒకే ఇంట్లో ఉంటూ ఎడముఖం పెడముఖంగా ఉండే కంటే ఇది ఉత్తమం. మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి మగవారూ ఇంటి పనుల్లో సాయం చేస్తేనే ఒకరిమీదే ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇద్దరూ బాధ్యతల్ని సమానంగా పంచుకుంటేనే వారి సంసారం సాఫీగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్