సుగంధాల నక్షత్ర మల్లె!

నేలపై పచ్చని తివాచీ...దానిపై పరచుకున్న నక్షత్రాల్లాంటి పూలు... అవి వెదజల్లే సుగంధం మన ఇంటి చుట్టూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! ఇదంతా స్టార్‌ జాస్మిన్‌ పూల తీగ ప్రత్యేకత. దీన్ని మన ముంగిట పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటారా... అయితే చదివేయండి మరి.

Published : 23 May 2024 01:16 IST

నేలపై పచ్చని తివాచీ...దానిపై పరచుకున్న నక్షత్రాల్లాంటి పూలు... అవి వెదజల్లే సుగంధం మన ఇంటి చుట్టూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! ఇదంతా స్టార్‌ జాస్మిన్‌ పూల తీగ ప్రత్యేకత. దీన్ని మన ముంగిట పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటారా... అయితే చదివేయండి మరి.

నిగనిగలాడే ముదురాకుపచ్చ ఆకులతో నిండుగా ఎగబాకే పూల తీగ స్టార్‌ జాస్మిన్‌. నక్షత్రాకారంలో ఉండే ఈ పూలు మధురమైన సువాసన వెదజల్లుతాయి. తెలుపు, పసుపు, గులాబీ వర్ణాల్లో విరిసి పెంచుకున్న ప్రదేశానికి వన్నె తెచ్చిపెడతాయి. అంతేనా, ఇవి తేనెటీగల్నీ, పరాగసంపర్క కీటకాలనూ ఆకర్షిస్తాయి. ఈ తీగ అపోసైనేసియా కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ట్రాకెలోస్పెర్పమ్‌ జాస్మినోయిడ్స్‌. సరైన ఆధారం అందిస్తే గ్రౌండ్‌ కవర్‌గానూ, గోడలూ, పర్గోలాలు, స్వాగతద్వారాలకు అల్లించేయొచ్చు. ఒకప్పుడు తెలుపు, పసుపు రంగుల్లో మాత్రమే లభ్యమైన ఈ పూలల్లో ఈ మధ్య గులాబీ రంగు రకాలూ దొరుకుతున్నాయి. ఎక్కడ పెంచుకున్నా సుందర ప్రకృతి వనంలో ఉన్నట్లే అనిపిస్తుంది.

జాగ్రత్తలిలా... దీన్ని కాస్త పెద్ద కుండీల్లో ట్రెల్లిస్‌ ఆధారంతో పెంచుకోవచ్చు. వీటిని పెంచేందుకు సారవంతమైన, నీరు నిలవని మట్టిని ఎంచుకోవాలి. అలాగని నీటి అవసరం ఉండదనుకునేరు. మట్టిపొడిబారకుండా రోజూ తప్పనిసరిగా తడి అందించాలి. ఈ తీగ సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాల్లో పెంచుకునేందుకు అనువైనది. పూర్తి సూర్యకాంతిలో ఉంటే పూలూ చక్కగా విరబూస్తాయి  కాలం మారిన ప్రతిసారీ సమపాళ్లలో ఎన్‌పీకే ఎరువుని ఇవ్వాలి. మొక్క మరీ ఎగబాగుతుంటే ఎత్తు నియంత్రించడానికీ, అందమైన ఆకృతిలో కనిపించడానికీ రెండు మూడు నెలలకోసారి ప్రూనింగ్‌ చేయండి. దీనికి చీడపీడల సమస్య తక్కువే కానీ, బూడిద తెగులు మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు చీడ పట్టిన, ఎండిన కొమ్మల్ని కత్తిరించడంతో పాటు లీటరు నీటిలో చెంచాన్నర వేపనూనె కలిపి స్ప్రే చేయాలి. లేదా వంట సోడా మిశ్రమాన్ని చల్లినా మంచిదే. ఈ నక్షత్ర మల్లెపూల తీగను కొమ్మ కత్తిరింపులతోనూ, విత్తనాలను నాటడంతోనూ కొత్తగా పెంచుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్