చిరుజల్లుల్లో చిలకముక్కు పూలందం!

తొలకరి జల్లు మొదలైతే చాలు... పచ్చని ఆకుల్లో దాగి ముద్ద గులాబీల్లా మురిపించే పూలు నీలగోరింటలు. ముదురు రంగుల్లో ముచ్చటగా కనిపించే వీటిని... ఇంటి ముంగిట్లో పెంచుకుంటే ఆ ప్రదేశానికే నిండుదనం వస్తుంది. మరి వీటినెలా పెంచాలో చూద్దామా!

Published : 06 Jun 2024 01:30 IST

తొలకరి జల్లు మొదలైతే చాలు... పచ్చని ఆకుల్లో దాగి ముద్ద గులాబీల్లా మురిపించే పూలు నీలగోరింటలు. ముదురు రంగుల్లో ముచ్చటగా కనిపించే వీటిని... ఇంటి ముంగిట్లో పెంచుకుంటే ఆ ప్రదేశానికే నిండుదనం వస్తుంది. మరి వీటినెలా పెంచాలో చూద్దామా! 

నీలగోరింట పూలనే చిలకముక్కుపూలనీ, ముద్ద గోరింట అనీ అంటారట. అంతేనా, ఇంపేషన్స్‌ బాల్సమినా, బాల్సమ్, గార్డెన్‌బాల్సమ్, టచ్‌ మీనాట్‌ అంటూ ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. పూల ఆకృతి, రంగుల్ని బట్టి ఇందులో ఎన్నో రకాలూ ఏర్పడ్డాయి. ఈ మొక్క శాస్త్రీయ నామం ఇర్రెసిస్టబుల్‌ బాల్సమ్‌. ఈ మొక్కలు ఇండియాతో పాటు మయన్మార్, చైనా, కొరియాల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. మృదువుగా కనిపిస్తూనే గట్టి కాండంతో ఎదుగుతుందీ మొక్క. దీనిపూలు అచ్చం గులాబీలను పోలి కాంతిమంతమైన గులాబీ, ఎరుపు, ఊదా, తెలుపు వంటి రంగుల్లో పూస్తాయి. ఇందులోనే డబుల్‌ కలర్స్‌వీ ఉన్నాయి. ఈ పూలు కీటకాలు, తేనె సేకరించే పక్షుల ద్వారా పరాగ సంపర్కం చెందుతాయి. వీటి కాయలు పండగానే బాంబుల్లా పేలి... వాటిల్లోని విత్తనాలను వెదజల్లుతాయి. ఇక, ఈ పూలు, ఆకులకు ఔషధ గుణాలూ ఎక్కువేనట. చర్మ సంబంధిత సమస్యలకు, మొటిమలకు, పాము కాటుకు చికిత్సగానూ వాడతారు. కొరియన్‌ నాటు వైద్యంలోనూ, చైనా, నేపాల్‌ సంప్రదాయ పండగల్లోనూ వీటికి ప్రాధాన్యత ఉంది. వీటి ఆకులను గోళ్ల రంగుగా ఉపయోగిస్తారు.

 

ఎలా పెంచాలంటే...

ఈ చిలకముక్కు పూల మొక్కల్ని పాక్షికంగా నీడ ఉండే చోట నాటుకున్నా ఎదుగుతాయి. అయితే, కనీసం ఐదారు గంటలైనా సూర్యకాంతి ఉండేలా చూసుకోవాలి. మట్టి ఎండిపోతే మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే, తేమని కోల్పోకుండా చూసుకోవాలి. అలాగని నీళ్లెక్కువైతే వేళ్లు కుళ్లిపోతాయి. వీటిని నేలలోనే కాదు కుండీల్లోనూ పెంచుకోవచ్చు.. పోషకాలు నెమ్మదిగా విడుదలయ్యే గ్రాన్యువల్స్‌ రూపంలో ఉన్న ఎరువుల్ని ఇవ్వాలి. కాయలు ఏర్పడకుండానే వాడిన పూలు, కొమ్మల్ని తొలగించడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. దీనికి చీడపీడల సమస్య తక్కువే కానీ తెల్లదోమ, పేనుబంక వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వేపనూనెను చల్లితే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్