లావు... తగ్గనివ్వరే!

నాకు 15ఏళ్లు. అసలే లావు. పైగా  ఎత్తు తక్కువ. దీంతో మరింత పొట్టిగా కనిపిస్తున్నా. స్కూల్లో ఏడిపిస్తున్నారని డైట్‌ చేస్తున్నా. అమ్మావాళ్లేమో సరిగా తినట్లేదని ఒకటే పోరు.

Published : 07 Jun 2024 12:16 IST

నాకు 15ఏళ్లు. అసలే లావు. పైగా  ఎత్తు తక్కువ. దీంతో మరింత పొట్టిగా కనిపిస్తున్నా. స్కూల్లో ఏడిపిస్తున్నారని డైట్‌ చేస్తున్నా. అమ్మావాళ్లేమో సరిగా తినట్లేదని ఒకటే పోరు. నేను తగ్గాలి అనుకుంటున్నా అంటే ‘కాస్త బొద్దుగా ఉన్నావంతే. తినకపోతే నీరసపడతా’వని బలవంతంగా పెడుతున్నారు. వాళ్లకి అర్థమయ్యేలా ఎలా చెప్పను?

ఓ సోదరి

నీది ఎదిగే వయసు. ఈ సమయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరు తొందరగా ఎదిగితే మరికొందరికి శారీరకంగా ఎదగడానికి కొంత సమయం పడుతుంది. దీనిలో జన్యువుల పాత్రా ఎక్కువే. నీది ఇంకా చిన్న వయసే. కాస్త వ్యాయామంపై దృష్టిపెడితే ఫలితం ఉంటుంది. అంతేకానీ స్కూల్‌లో ఏడిపిస్తున్నారని బాధపడుతూ కూర్చుంటే అనవసర ఒత్తిడి. తిండి మానేయడం కాకుండా జీవనశైలిలో మార్పు చేసుకోవడానికి ప్రయత్నించు. శారీరక శ్రమకే కాదు చదువుకీ చాలా శక్తి కావాలి. కాబట్టి, పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. బయటివాటి జోలికి పోకుండా ఇంటి ఆహారాన్నే తీసుకుంటూ రోజూ కొద్దిసేపు యోగా, వ్యాయామాలు వంటివి చెయ్యి. బరువు అదుపులో ఉండటమే కాదు, ఎత్తూ పెరగొచ్చు. అలాకాకుండా  తిండి మానేస్తే, నీరస పడటమే కాదు, అనారోగ్యాలూ పలకరిస్తాయి. మరో విషయం... బాహ్య  సౌందర్యం కన్నా అంతః సౌందర్యమే మిన్న. కాబట్టి, మంచి నడవడికను పెంపొందించుకో. నీ ఫ్రెండ్స్‌కి అవసరం అయినప్పుడు సహాయం చేయడం, అందరితో కలివిడిగా ఉండడం, విజ్ఞానాన్ని పెంచుకోవడం లాంటివి చెయ్యి. అప్పుడు నిన్ను నిన్నుగా అభిమానిస్తారు. రూపాన్ని కాక కలుపుగోలుతనం ఉన్న నీ గురించి ఆలోచిస్తారు. అందం, రూపురేఖలు లేకుండా ఎంతమంది ఉన్నత శిఖరాలను అందుకోలేదు? వారి స్ఫూర్తితో పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రాధాన్యమివ్వు... అప్పుడు ఈ విషయాలు నిన్నూ బాధపెట్టవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్