జలుబు.. జ్వరం.. ఏం తినాలి?

కుటుంబమంతా జలుబూ, ఒళ్లు నొప్పులూ, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?    

Published : 31 Jan 2022 01:11 IST

కుటుంబమంతా జలుబూ, ఒళ్లు నొప్పులూ, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?      

-ఓ సోదరి, హైదరాబాద్‌  

క వ్యక్తికి ఉండే రోగ లక్షణాలు, దాని తీవ్రతలాంటి  అంశాల ఆధారంగా వారు తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... పిల్లలకు... జ్వర తీవ్రత అధికంగా ఉంటే ఎక్కువ శక్తినిచ్చే ఆహారం అందించాలి. అయితే ఇలాంటప్పుడు చిన్నారులు తినడానికి మారాం చేస్తారు. కాబట్టి వారికి తేలికగా జీర్ణమయ్యే బ్రెడ్‌, ఆమ్లెట్‌, ఫ్రెంచ్‌ టోస్ట్‌, చీజ్‌ టోస్ట్‌, పాలు, ఓట్స్‌, పాన్‌ కేక్‌, ఆపమ్‌లాంటివి ఇవ్వొచ్చు. ఇవి చిన్నారులు ఇష్టంగా తింటారు.

జలుబుంటే ముక్కు కారడం, దగ్గు, శ్లేష్మం వల్ల పిల్లలు ఆహారం తీసుకోలేరు. దాంతో నీరసపడిపోతారు. ఇలాంటప్పుడు వారికి రంగు రంగుల ఆహారం, వేడిగా అందించాలి. పాస్తా, రైస్‌ నూడుల్స్‌ను ఇంట్లోనే రుచిగా చేసి పెట్టొచ్చు. దగ్గు, కఫం ఎక్కువగా ఉన్న ఈ టైమ్‌లో మాంసకృత్తులుండే ఆహారం ఇవ్వాలి. ఆమ్లెట్‌, చీజ్‌, ఉడికించిన గుడ్డు, గుగ్గిళ్లు, వేరుసెనగలు ఇవ్వొచ్చు. పాలలో వెనిలా ఎస్సెన్స్‌, పీనట్‌ బటర్‌ లేదా పండు కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారు. ఉడికించిన చిలగడ దుంప, ఆలూను... చాట్‌, కట్లెట్‌లా చేసి పెట్టొచ్చు. ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ కొంచెం మిరియాల పొడి వేసి ఇవ్వొచ్చు.

అందరికీ నచ్చేలా... అనారోగ్యాలతో బాధపడుతోన్న పిల్లలూ, పెద్దలకు వారికి నచ్చిన ఆహారాన్ని ఇస్తే ఇబ్బంది పడకుండా తింటారు. ఈ సమయంలో ఆహారంలో కెలొరీలు, ప్రొటీన్లు తగ్గకుండా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగించాలి. నీళ్లు తాగడానికి ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయంగా రాగి జావ, టొమాటో, పాలకూర.. లాంటి సూప్‌లు ఇవ్వొచ్చు. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, తాజా పెరుగు మంచివే.

* మాంసాహారాన్ని నూనె తక్కువ వేసి, బాగా ఉడికించి పెట్టాలి. పిల్లలు, వృద్ధులకు నాన్‌వెజ్‌ను బాగా ఉడికించి కీమాలా చేసి పెట్టడమో లేదా సూప్‌లా ఇస్తే త్వరగా కోలుకుంటారు. విరోచనాలవుతుంటే ఆహారం మానేయకూడదు. ఎలక్ట్రాల్‌ వాటర్‌ లేదా తేలికగా జీర్ణమయ్యే  ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువ మసాలాలు వాడొద్దు. అరటి పండు పడని వారు తప్ప మిగతావారు దీన్ని తీసుకోవచ్చు. ఓట్స్‌, తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇడ్లీ, గోధుమరవ్వ ఉప్మా, కిచిడీ ఆవిరి కుడుము లాంటివి తినొచ్చు.. గర్భిణులు, బాలింతలు..మాంసకృత్తులుండే నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్