ఆ ఫ్లాట్‌ నా కొడుక్కి వస్తుందా!

నాకు 36. బాబు వయసు 21 నెలలు. మావారు 2020లో చనిపోయారు. ఆయన పేరు మీద ఫ్లాట్‌ ఉంది. మా పెళ్లయ్యాకే కొన్నాం. బీమా ఉండటంవల్ల ఆ లోన్‌ క్లియర్‌ అయింది.

Published : 21 Mar 2022 02:00 IST

నాకు 36. బాబు వయసు 21 నెలలు. మావారు 2020లో చనిపోయారు. ఆయన పేరు మీద ఫ్లాట్‌ ఉంది. మా పెళ్లయ్యాకే కొన్నాం. బీమా ఉండటంవల్ల ఆ లోన్‌ క్లియర్‌ అయింది. మా అత్తమామలకు మొదట్నుంచీ నేనంటే ఇష్టం లేదు. మాది కులాంతర వివాహం. ఫ్లాట్‌ కోసం వారు నన్ను, బిడ్డను ఏం చేయడానికైనా వెనుకాడరు. అందుకే బాబుతో సహా పుట్టింట్లోనే ఉంటున్నా. ఆ ఫ్లాటే మాకు ఆధారం. అమ్మానాన్న నాకు మరో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఫ్లాట్‌ బాబుకి వస్తుందా?  

-ఓ సోదరి

మీ భర్త పేరు మీద ఉన్న ఫ్లాట్‌ మీ పేరు మీదకు మార్చుకోవాలంటే ముందుగా మీరు మ్యుటేషన్‌ చేయించుకోవాలి. అంటే మీ పేరు మీదకు ఫ్లాట్‌ను మార్పించుకోవాలి. అందుకు సాధారణంగా లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌(వారసత్వ ధృవపత్రం) అడుగుతారు. హిందూ వారసత్వ చట్టం, సెక్షన్‌-8 ప్రకారం ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే అతడి ఆస్తి క్లాస్‌ వన్‌ హేర్స్‌కు ముందుగా చెందుతుంది. అందులో పిల్లలు, తల్లి, భార్య వస్తారు. అంటే మీవారి పేరు మీదున్న ఆస్తికి మీ అత్తగారు కూడా వారసురాలు అవుతారు. అంటే ఆస్తిని మూడు భాగాలుగా చేసి మీకు, మీ అత్తగారికి, మీ అబ్బాయికి ఇవ్వాలి. మీ అత్తగారి వాళ్లనుంచి ఆస్తి కోసం ప్రాణ భయం ఉంటే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ ఇద్దరి తరఫు పెద్దవాళ్లను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. మీవారి సంపాదన మొత్తం మీకే దక్కిందనే బాధ మీ అత్తమామలకు ఉండొచ్చు. మీరు వాళ్లకు కూడా భాగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. హిందూ దత్తత, భరణం చట్టం, సెక్షన్‌-9 ప్రకారం హిందూ స్త్రీ భర్త చనిపోతే మామగారి దగ్గర నుంచి భరణం కోరవచ్చు. కానీ ఆమెకు భర్త నుంచిగాని వారసత్వంగా ఆస్తి ఉంటే లేదా మళ్లీ పెళ్లి చేసుకున్నా ఆమెకు భరణం కోరే అర్హత లేదు. మీకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే దానికి ముందే ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిది. ముందుగా న్యాయస్థానం ద్వారా లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మైనర్‌ ప్రాపర్టీ ఒకసారి నిర్ణయమయ్యాక దాన్ని ఎవరూ ముట్టుకోవడానికి వీలుండదు. కాబట్టి తొందరగా సమస్యను పరిష్కరించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్