గ్యాస్ట్రిక్‌ సమస్య.. ఏం తినాలి?

నా వయసు 30. డెస్క్‌ ఉద్యోగిని. సాయంత్రానికి గుండె పట్టేస్తున్నట్లు అనిపిస్తోంటే డాక్టర్‌ని సంప్రదించా. గ్యాస్ట్రిక్‌ సమస్య అని చెప్పి, ఆహారంలో మార్పులు చేసుకోమన్నారు.

Updated : 30 Jun 2022 09:10 IST

నా వయసు 30. డెస్క్‌ ఉద్యోగిని. సాయంత్రానికి గుండె పట్టేస్తున్నట్లు అనిపిస్తోంటే డాక్టర్‌ని సంప్రదించా. గ్యాస్ట్రిక్‌ సమస్య అని చెప్పి, ఆహారంలో మార్పులు చేసుకోమన్నారు. ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు చెబుతున్న లక్షణాల్నిబట్టి చూస్తే ఇది ఎసిడిటీ ప్రాబ్లమ్‌ అని అర్థమవుతోంది. అందుకు పీహెచ్‌ హై లోడింగ్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, ఒత్తిడితో కూడిన ఉద్యోగం... వీటిలో ఏదైనా కారణం కావొచ్చు. బిర్యానీ లాంటివి తీసుకుంటే నూనెతోపాటు ప్రొటీన్‌ అధికంగా చేరి జీర్ణవ్యవస్థ మీద అధిక భారం పడుతుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువ మోతాదులో యాసిడ్‌లు విడుదలవుతాయి. ఇలాంటి ఆహారం తరచూ ఎక్కువగా తీసుకుంటే గ్యాస్‌ తయారయ్యి, ఛాతీ నొప్పి వస్తుంది. టైమ్‌కి తినకపోయినా కూడా నొప్పి రావొచ్చు. తగిన పరీక్షల ద్వారా ఏ కారణంవల్ల వస్తుందో డాక్టర్లు గుర్తించగలరు. మీ విషయంలో ఆహారంలో మార్పులు అవసరమని చెప్పారంటున్నారు.

మిరప, గరమ్‌ మసాలా ఎక్కువగా తీసుకున్నప్పుడూ కాఫీ తాగినప్పుడూ... అలాగే ఆయిల్‌, ప్రోటీన్‌ ఉన్న ఆహార పదార్థాలు అంటే మటన్‌, చికెన్‌, గ్రేవీ కర్రీ, నట్స్‌ ఉపయోగించి చేసిన మసాలా కర్రీ.. వీటిలో కొవ్వులు ఎక్కువ ఉండటంవల్ల జీర్ణవ్యవస్థ ఎక్కువ శ్రమ పడాలి. అలాంటప్పుడు అవసరానికి మించి యాసిడ్‌ ఉత్పత్తి కావడంవల్ల ఛాతీ నొప్పి వస్తుంది. జీవనశైలిలో, ఆహారంలో మార్పుల ద్వారా సమస్యని పరిష్కరించుకోవచ్చు. నడుము కొలత మగవాళ్లలో 90 సెం.మీ, ఆడవాళ్లలో 80 సెం.మీ. కంటే ఎక్కువ ఉండకూడదు. కొందరిలో నడుము, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ చేరుతుంది. దీన్నే సెంట్రల్‌ ఒబెసిటీ అంటాం. దీనివల్ల జీర్ణకోశం, పేగుల మీద కొవ్వు పేరుకుని జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది.

లివర్‌లో, పాంక్రియాస్‌లో కొవ్వు ఎక్కువైనా డైజెషన్‌ సులభంగా జరగదు. కాబట్టి అదనపు బరువు, నడుము కొలత తగ్గించుకోండి. శుభ్రమైన, తాజా ఆహారాన్నే తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ మీద భారం పడకుండా ఎక్కువ సార్లు తక్కువ తక్కువగా తిన్నా మంచిదే. ఆహారం పొట్టలోకి పోవడానికి గురుత్వాకర్షణ బలం ఉండాలి. తిన్నాక 10 - 15 నిమిషాలు నడవాలి. రోజులో కనీసం 10వేల అడుగులు వేయాలి. వీటితోపాటు ఏం తిన్నప్పుడు సమస్య వస్తుందో పరిశీలించుకుని కూడా మార్పులు చేసుకోవాలి. మీ అభిరుచులూ, సామర్థ్యం మేరకు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడానికే చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్