మరుదులు ఆస్తి మీద కన్నేశారు

నాకు 58 ఏళ్లు. మావారు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేసి 2020లో మరణించారు. మాకు సంతానం లేని కారణంగా అతని తమ్ముళ్లు నా ఆస్తిమీద కన్నేశారు. ప్రాణ భయంతో తల్లిదండ్రుల దగ్గర తలదాచుకుంటున్నా.

Published : 11 Oct 2022 00:28 IST

నాకు 58 ఏళ్లు. మావారు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేసి 2020లో మరణించారు. మాకు సంతానం లేని కారణంగా అతని తమ్ముళ్లు నా ఆస్తిమీద కన్నేశారు. ప్రాణ భయంతో తల్లిదండ్రుల దగ్గర తలదాచుకుంటున్నా. అంతకు ముందు మేం కరీంనగర్‌లో ఉండేవాళ్లం. మాకు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఫ్లాట్‌ ఉంది. అది నాపేర మార్చుకోవడానికి లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ ఉండాలంటున్నారు. ఆధార్‌ కరీంనగర్‌ అడ్రెస్‌తో ఉండటంతో అక్కడ ఎమ్మార్వో ఆఫీసులో తీసుకోవాలంటున్నారు. అల్వాల్‌ ఇంటి అడ్రెస్‌తో ఆ సర్టిఫికెట్‌ తీసుకునే వీలుందా?

- ఓ సోదరి

మీకు కరీంనగర్‌ ఇంటి అడ్రెస్‌ మీద ఆధార్‌ ఉంది కాబట్టి లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ కోసం ముందు అక్కడి ఎమ్మార్వో దగ్గర ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ తీసుకోండి. సింగరేణి కాలరీస్‌ నుంచి రావాల్సిన పెన్షన్‌ లాంటి వాటికోసం దరఖాస్తు చేసుకోవడానికి అది పనికొస్తుంది. కానీ ఆస్తులు మ్యుటేషన్‌ చేసుకోవడానికి అంటే మీ పేరు మీద మార్చుకోవడానికి ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ సరిపోదు. అందుకు లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ కావాలి. అది కోర్టు ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్టులో మిమ్మల్ని లీగల్‌ హేర్‌గా ప్రకటించమని ఒక దావా వేయాల్సి ఉంటుంది. దానిలో ఎక్కడ ఆస్తి ఉందో ఆ ప్రాంతపు తహశీల్దారును ప్రతివాదిగా చేర్చాలి. ఒక వేళ వేర్వేరు చోట్ల రెండు ఆస్తులు ఉంటే ఇద్దరు తహశీల్దారులను ప్రతివాదులుగా చేర్చాలి. మీ అత్తగారుగానీ ఉంటే ఆవిడనీ ప్రతివాదిగా చేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే హిందూ వారసత్వ చట్టం- సెక్షన్‌ 9 ప్రకారం భార్య, పిల్లలు, తల్లి, ఆ తరువాత అన్నదమ్ములు వారసులుగా వస్తారు. అల్వాల్‌లో ఫ్లాట్‌ ఉంది కాబట్టి అక్కడే దావా వేయొచ్చు. ఒకవేళ మీరు అల్వాల్‌లో కొన్న ఫ్లాట్‌ జాయింట్‌గా ఉంటే మీ అత్తగారిని ప్రతివాదిగా చేర్చాల్సిన పనిలేదు. ఎందుకంటే జాయింట్‌ ప్రాపర్టీలు ఏవైనా.. ఒకరు చనిపోతే రెండోవారికే పూర్తిగా చెందుతాయి. ప్రాపర్టీస్‌ విషయంలో నామినీ ఉండరు. పొదుపు, బీమా లాంటివాటిలోనే ఉంటారు. కొంచెం వివరంగా తెలుసుకుని కోర్టులో లీగల్‌ హేర్‌కు సంబంధించిన దావా వేయండి. అందుకు మీ ఆస్తి తాజా మార్కెట్‌ విలువ సర్టిఫికెట్స్‌ తీసుకోవాలి. దాన్నిబట్టి కోర్టు ఫీజు కట్టాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్