నన్ను చూసి భయపడుతున్నారట!

నేనో ఇంజినీర్‌ని. పురుషాధిక్యత ఉండే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తా. దానికి తగ్గట్టే ఉన్నతహోదాలను అందుకుంటున్నా.

Published : 19 Oct 2022 00:15 IST

నేనో ఇంజినీర్‌ని. పురుషాధిక్యత ఉండే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తా. దానికి తగ్గట్టే ఉన్నతహోదాలను అందుకుంటున్నా. గతంలో సంస్థలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్లలో రెండు పదోన్నతులు అందుకున్నా. త్వరగా కలిసిపోతా. అందుకే బృందంలో చాలామంది నన్ను ఇష్టపడతారు కూడా. కానీ చాలామంది సహోద్యోగులు నన్ను చూస్తే భయమేస్తోందని, మాట్లాడటానికీ సందేహిస్తున్నామని వ్యక్తిగత సంభాషణల్లో చెబుతున్నారు. ఏం చేయను?

- ప్రజ్ఞ

పనిపరంగా దృఢంగా ఉండటం మంచిదే. అయితే ఈ లక్షణమున్న ఆడవాళ్లకు భయపెడతారన్న పేరు రావడం సహజమే. సంస్థలో మగవాళ్లెక్కువ అన్నారు. చాలామందికి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ విజయపథంలో సాగే మహిళలతో ఎలా సాగాలో తెలియదు. అలా పొరబడి ఉండొచ్చు. ఒక్కోసారి కచ్చితంగా ఉండే తత్వం ఎదుటివారి అభిప్రాయాలను చెప్పడానికి సంకోచించేలానూ చేస్తుంది. చిన్న పొరపాటుకీ తావుండకూడదు అన్న ధోరణి ఉన్నవాళ్లూ అందరికీ నచ్చరు. ముందు మీ సహోద్యోగులు, పైవాళ్లతో మాట్లాడండి. మీ ప్రవర్తన వాళ్లపై ఎలా ప్రభావం చూపుతోందో కనుక్కోండి. ఇది మీ కెరియర్‌ ముందుకు సాగడంలోనూ సాయపడగలదు. ఇంకా..

* బృందంతో కలిసి పనిచేయడమంటే వాళ్లతో సత్సంబంధాలు కొనసాగించడం. ప్రాణస్నేహితుల్లా మెలగాల్సిన పనిలేదు. కానీ అందరితో కలిసిపోగలగాలి. వాళ్ల గురించి తెలుసుకోగలగాలి. అప్పుడే వారిలో మీపట్ల ఉన్న భయాన్ని పోగొట్టగలరు.

* ఫీడ్‌బ్యాక్‌ కోరండి. ఇది ఒక్కసారితో ఆగిపోకూడదు. తరచూ జరగాలి. పైపైన కాకుండా లోతుగా విశ్లేషించమని చెప్పండి. సమస్యపై సుముఖంగా స్పందిస్తారన్న భరోసా ఉంటే వాళ్లూ ధైర్యంగా చర్చించగలరు. వాటిని ఆచరించడానికి మీరూ ప్రయత్నించాలి.

* మీతోటి వారు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా అన్నదీ చెక్‌ చేసుకోండి. శరీరభాష, మాట్లాడేతీరు, ఈమెయిల్‌ పంపే విధానం, సూచనలు ఎలా ఉంటున్నాయో సరిచూసుకోండి. అవసరమైతే వాటిని మార్చుకోండి. అన్నింటి కంటే ముఖ్యమైనది.. ఎదుటివారు చెప్పేది వినండి. వాళ్ల సూచనలు మీకు ముఖ్యమన్న సందేశం వారికి వెళ్లేలా చూడండి.. చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్