ఆ ముప్పు నాకూ ఉందా?

పెద్దమ్మ బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో చనిపోయింది.  నాకు 38 ఏళ్లు.  నాకూ క్యాన్సర్‌ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఆహార జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చా?

Published : 20 Oct 2022 00:15 IST

పెద్దమ్మ బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో చనిపోయింది.  నాకు 38 ఏళ్లు.  నాకూ క్యాన్సర్‌ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఆహార జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చా?

- ఓ సోదరి.

ఇప్పుడు వస్తోన్న క్యాన్సర్లలో 50 శాతం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారంతో ముడిపడినవే. కొన్ని పదార్థాలు తీసుకున్న మోతాదు, వండిన విధానాల్నిబట్టి క్యాన్సర్‌ నివారిణిగా లేదా కారకాలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం. పోషకాహారం, వ్యాయామం, మంచి జీవనశైలితో చాలావరకూ క్యాన్సర్‌ ముప్పుని తగ్గించుకోవచ్చు. కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర ఉందంటున్నారు కాబట్టి బరువుని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు ప్రమాదం. ప్రీమెనోపాజ్‌ దశ నుంచే శరీరంలో మార్పులు గమనిస్తూ ఉండాలి. 40 ఏళ్లు దాటితే ఏటా మామ్మోగ్రామ్‌ చేసుకోవాలి.

ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌, మాంసకృత్తులు ఇవన్నీ ఉండాలి. అదే సమయంలో అవసరానికి మించి ఆహారం తీసుకుంటే కొవ్వు నిల్వలు పెరిగి రకరకాల వాపులకు దారితీసి క్యాన్సర్‌ రిస్కు పెరుగుతుంది. ఆహారాన్ని వీలైనంత సహజ రూపంలో తీసుకోవాలి. గింజ ధాన్యాలు, పప్పు దినుసులు ప్రాసెస్‌ చేయకుండా పొట్టుతో ఉన్నవి తింటే వాటిలోని పీచు మలినాల్ని బయటకు పంపేస్తుంది. అంతేకాకుండా వీటిలోని విటమిన్‌ సి, సెలీనియం, కెరాటిన్‌, లైకోపిన్‌, ఖనిజ లవణాలు ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడతాయి. పసుపు, వెల్లుల్లి, ఉల్లి, పుదీనా, రాగులూ తగిన మోతాదులో తీసుకోవాలి. వీటిలోని పాలీ ఫినాల్స్‌, ఫ్లేవనాయిడ్స్‌ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చెడు కణాలపై దాడిచేసి పెరగకుండా చేస్తాయి.   రోజూ కూరగాయలు, ఆకుకూరల్ని 350 గ్రా. తీసుకోవాలి. రంగుల కూరగాయలు, పండ్లు తీసుకుంటే వాటిలోని ఫైటోకెమికల్స్‌ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.

ఏం తినకూడదు.. చక్కెర ఎక్కువుండే మిఠాయిలూ, ఐస్‌క్రీమ్‌లు, కార్బోనేటెడ్‌ డ్రింక్‌లు, నిల్వ పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం తగ్గించాలి. కృత్రిమ రంగులు, పంటలకు కొట్టే రసాయనాలు ఆహారంలో లేకుండా చూడాలి. మాంసాహారంతో హాని లేదు. కాకపోతే డీప్‌ ఫ్రైలు, మళ్లీ మళ్లీ ఫ్రై చేసినవీ తినకూడదు. నీరు కాలుష్యమైతే హానికర సీసం, మెర్క్యూరీ శరీరంలోకి వెళ్లి డీఎన్‌ఏపై దాడిచేస్తాయి. ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు తీసుకోవద్దు. పాలిథీన్‌ కవర్లలో వేడి పదార్థాలు వేసి తాగినా, తిన్నా హానికారక మూలకాలు శరీరంలో చేరుతాయి. మధుమేహ బాధితులైతే చక్కెర స్థాయుల్ని నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా క్యాన్సర్‌ ముప్పుని తగ్గించుకోవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూనే నిత్యం వ్యాయామంతో కండరాల్ని ఉత్తేజపరచాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్