ఒంటరితనం పెరిగిపోతోంది

ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ నలుగుర్ని కలవడం, డబ్బు రాబడి వల్ల ఒక ఆనందం, ఆత్మ విశ్వాసం కలుగుతాయి. రిటైర్‌మెంట్‌ తర్వాత తీరూతెన్నూ లేనట్లు అనిపించి విసుగూ, విరక్తి ఏర్పడతాయి. నిజానికి విరమణకు ముందే కుటుంబసభ్యులతో కలిసి కూర్చుని తర్వాతి జీవితాన్ని ఎలా గడపాలో ప్రణాళిక వేసుకోవాలి. కొత్త స్నేహాలు, ఫుల్‌టైం లేదా పార్ట్‌టైంగా మరో ఉద్యోగం చూసుకోవడం, సమాజసేవ లాంటివి చేయాలి.

Published : 24 Oct 2022 00:39 IST

మా వారు రిటైరయ్యాక కోపం, చిరాకు పెరిగి పోయాయి. నా మీద ఎప్పుడూ అరుస్తూనే ఉంటారు. పిల్లల ఇళ్లకు వెళ్దామంటే రారు. నాకు ఒంటరితనం పెరిగి పోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

- ఓ సోదరి, ఏలూరు

ద్యోగంలో ఉన్నన్నాళ్లూ నలుగుర్ని కలవడం, డబ్బు రాబడి వల్ల ఒక ఆనందం, ఆత్మ విశ్వాసం కలుగుతాయి. రిటైర్‌మెంట్‌ తర్వాత తీరూతెన్నూ లేనట్లు అనిపించి విసుగూ, విరక్తి ఏర్పడతాయి. నిజానికి విరమణకు ముందే కుటుంబసభ్యులతో కలిసి కూర్చుని తర్వాతి జీవితాన్ని ఎలా గడపాలో ప్రణాళిక వేసుకోవాలి. కొత్త స్నేహాలు, ఫుల్‌టైం లేదా పార్ట్‌టైంగా మరో ఉద్యోగం చూసుకోవడం, సమాజసేవ లాంటివి చేయాలి. వచ్చిన డబ్బును ఎలా వినియోగించాలి, మిగిలినదాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి లాంటివి కూడా వ్యాపకమే. ఇన్నాళ్లూ సమయం లేనందున బంధుమిత్రులను కలవడం తగ్గి ఉంటుంది. ఇప్పుడు ఖాళీ దొరికింది కనుక భార్యతో కలిసి బంధువుల ఊళ్లకు వెళ్లి అనుబంధం పెంచుకోవాలి. పిల్లల దగ్గరకు వెళ్లి మనవలతో కాలక్షేపం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం లాంటివి చేస్తే చిరాకు, అసహనం కలగవు. ఉద్యోగం మీద చాలా ఆధారపడి, కుటుంబం మీద ధ్యాస పెట్టనివాళ్లకి రిటైరయ్యాక ఇంట్లోనే గడపటం ఇబ్బందిగా ఉంటుంది. మనోభావాలు పంచుకోవడం అలవాటు లేక యాంత్రికంగా ఉంటుంది. కుటుంబానికి ఏమీ చేయ లేదనే న్యూనత, కొత్తవాళ్లతో స్నేహం చేయలేకపోవడం.. ఈ అశక్తతలతో కోపం వస్తుంది. అది ఎవరి మీదా వెలిగక్కలేక మీమీద చూపుతున్నారు. కనుక ఆ అసహనం మీమీద అనుకోవద్దు. ఆయన్ని అర్థం చేసుకుని మీకు తోచిన విధంగా అతనికి ఇష్టమైన అంశాలు మాట్లాడి ఇద్దరూ కలిసి బయటకు వెళ్లేలా ప్రోత్సహించండి. మెల్లమెల్లగా ఆయనకి ఇష్టమైన వాళ్లని ఇంటికి పిలవడం, వాళ్లింటికి మీరెళ్లడం ద్వారా వాళ్లతో ఆయన కలిసేలా చేయండి. పిల్లల దగ్గరికి రానంటే వాళ్లనే రప్పించండి. అందరూ తనతో గడుపుతుంటే మెల్లగా అలవాటవుతుంది. ఆయన సాంగత్యంలో మీకు ఆనందం కలుగుతుందని చెప్పండి. క్రమంగా మీరు ఆశించే మార్పు వస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్