చెల్లి నాతో కలిసి పనిచేస్తుందట!

నాదో తికమక పరిస్థితి. మాదో అభివృద్ధి చెందుతున్న సంస్థ. తాజాగా నా హోదాలోనే ఇంకొకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. దానికి నా చెల్లి ప్రయత్నించాలని అనుకుంటోంది.

Updated : 02 Nov 2022 05:40 IST

నాదో తికమక పరిస్థితి. మాదో అభివృద్ధి చెందుతున్న సంస్థ. తాజాగా నా హోదాలోనే ఇంకొకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. దానికి నా చెల్లి ప్రయత్నించాలని అనుకుంటోంది. ఇద్దరి విద్యార్హత, చదివిన సంస్థ ఒకటే. కానీ మొన్నటివరకూ తన దృష్టి వేరే విభాగంపై ఉండేది. దీని గురించి చర్చ వచ్చినప్పుడు మొదట ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మనసు మార్చుకుంది. ఇద్దరిదీ ఒకే హోదా అయినా వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తాం. ఒకరిపై మరొకరి పెత్తనం ఏమీ ఉండదు. సంస్థలో బంధువులు కలిసి పనిచేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ మా సహోద్యోగి చెల్లెలు కొద్దిరోజులు ఇక్కడ పనిచేసింది. ఒక్కోసారి సానుకూలంగా అనిపిస్తోంది. ఇంకోసారి ప్రతికూలంగా ఆలోచిస్తున్నా. ఈ గజిబిజి నుంచి బయట పడేయగలరా?

- శ్రేయ

మీరు, మీ చెల్లి ఇద్దరూ ఒకే విభాగంలో పని చేయకపోవడమే మంచిదనిపిస్తోంది. వేరే డిపార్ట్‌మెంట్‌లో చేయడం వేరు. ఒకే దాంట్లో చేయడం వేరు. ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారమే ఎక్కువ. ఉదాహరణకు- మీ చెల్లెలి పనితీరు సరిగా లేకపోతే పరిస్థితేంటి? ఆ ఒత్తిడి పడేది మీపైనే (ఇది తనకూ వర్తిస్తుంది). తనను కాపాడే క్రమంలో మీపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చు. సహోద్యోగితో ఏదైనా ఇబ్బంది వస్తే పరిష్కరించుకోవడం కొంత సులువే. చెల్లెలి విషయంలో అది కాస్త క్లిష్టంగా మారుతుంది. ప్రాజెక్టులు, రివార్డులు, గుర్తింపు.. ఇలా ప్రతిచోటా పోటీ ఉంటుంది. మీ చెల్లెలికి ఎవరితోనైనా సమస్య వచ్చిందనుకోండి... మీరు తనకు మద్దతిస్తే సరే. ఇవ్వకపోతే ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు వస్తాయి. అవతలి వారూ మీ దగ్గరి వ్యక్తే అయితే ఇద్దరి మధ్యా నలిగిపోయేది మీరే. ఇంకా ఇలాంటి పరిస్థితులెన్నో! ఇదొక్క ఉద్యోగమే తనకున్న మార్గం కాకపోతే.. వేరే ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలు. వీటన్నింటి గురించీ చర్చించుకొని వేరే దానికి ప్రయత్నించమని చెప్పండి. ఆ విషయంలో మీరు తనకు చేయగలిగినంత సాయం చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్