కోపిష్టి భర్తతో వేగేదెలా?

నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. నా భర్త మహా కోపిష్టి. ఎప్పుడు దేనికి అరుస్తాడోనని చాలా భయంగా ఉంటుంది. మాకు ఇద్దరు పాపలు. వాళ్ల మీద ఆ ప్రభావం పడకూడదంటే ఏం చేయాలి?

Published : 07 Nov 2022 00:17 IST

నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. నా భర్త మహా కోపిష్టి. ఎప్పుడు దేనికి అరుస్తాడోనని చాలా భయంగా ఉంటుంది. మాకు ఇద్దరు పాపలు. వాళ్ల మీద ఆ ప్రభావం పడకూడదంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

పిల్లల పెంపకంలో కచ్చితమైన మార్గం, ఒకటే పద్ధతి అంటూ ఉండవు. వాళ్ల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే తెలివితేటల్లో హెచ్చుతగ్గులున్నా, మన ప్రకారం లేకున్నా ప్రేమించాలి, ఆదరణ చూపాలి. వాళ్ల ఆసక్తులను ప్రోత్సహించాలి. వాళ్ల మానసిక స్థితి, ప్రవర్తనను బట్టి క్రమశిక్షణ నేర్పించాలి. మరీ కఠినంగా ఉండకూడదు, అతి చనువూ ఇవ్వకూడదు. వేరే పిల్లలతో పోల్చడం, మన కోరికలు వాళ్లమీద రుద్దడం చేయకూడదు. మీ భర్త కోపిష్టి అయి, మీరు మెతకగా ఉన్నా కూడా ఆ తారతమ్యాలు పిల్లల ముందు వ్యక్తం చేయొద్దు. భేదాభిప్రాయాలుంటే పిల్లలు లేనప్పుడు పంచుకోండి. వాళ్ల ముందు ఇద్దరూ సమంగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లలు అన్ని విషయాల్లో స్వతంత్రంగా ఉండటానికి మీరు ఆదర్శం కావాలి. అంటే మీరు చెబుతూ, ఆచరిస్తుంటే వాళ్లూ ఆ మంచిని గ్రహించి అనుసరిస్తారు. సమాజంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి అంశాల గురించి పిల్లలకి కథలుగా లేదా ఉదాహరణలుగా అర్థమయ్యేలా చెప్పండి. భయపెడుతున్నట్టు కాకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు మెల్లమెల్లగా చెప్పాలి. అందువల్ల సమస్యలను ఎదుర్కొనే తెలివి, ధైర్యం, స్థైర్యం అలవడతాయి. నలుగురితో కలిసేలా, లోకాన్ని చూసే అవకాశం కల్పిస్తే తమ ఇష్టాయిష్టాలను గ్రహిస్తారు. ఆసక్తి ఉన్నప్పుడు మరింత ప్రయత్నించి రాణిస్తారు. వాళ్లలో మంచిని గమనిస్తే ప్రోత్సహించాలి. చెడుదారి పట్టారనిపిస్తే వేలెత్తి చూపినట్లు కాకుండా సరైన సలహాలతో మనసు మళ్లించాలి. అప్పుడు కుటుంబ, సామాజిక విలువలు తెలుసుకుని పాటిస్తారు.

ఇంట్లో వాతావరణం బాగుందంటే పిల్లలకు మానసిక ఒత్తిడి ఉండదు. వాళ్ల నాన్న కోపంగా ఉన్నా కూడా అది ఆయన తత్వం, లోపల మంచిమనిషే అన్నట్లు చెప్పండి. అతని భావోద్వేగాలకు వీళ్లను దూరంగా ఉంచండి. అతనికి ఎందుకు కోపం వస్తుందో ఆ విషయాల్లో పిల్లలు మారేలా ప్రయత్నించండి. అలాగే మీ భర్త వాళ్ల మీద కోపం ప్రదర్శించకుండా చూడండి. పిల్లల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా మెలగుతూ ఆదరణ చూపితే క్లిష్టపరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలరు. అందుకు మీరు మార్గదర్శిగా ఉండండి.

ఎట్టి పరిస్థితిలోనూ మీరు కోపం తెచ్చుకోవద్దు, డిప్రెషన్‌లోకి వెళ్లొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్