స్వార్థమే కానీ.. ప్రేమ చూపరు

నేను హాస్టల్‌లో ఉండి ఇంజినీరింగ్‌ చదువుతున్నాను. అందంగా ఉండనని నా స్నేహితురాలు విమర్శిస్తూనే అన్నీ అడుగుతుంది. మిగతావాళ్లూ అంతే. తమ అవసరాలకు వాడుకుంటారుగానీ ఒక్కరూ ప్రేమగా మాట్లాడరు. స్నేహం చేయాలంటేనే భయమేస్తోంది.

Published : 28 Nov 2022 00:05 IST

నేను హాస్టల్‌లో ఉండి ఇంజినీరింగ్‌ చదువుతున్నాను. అందంగా ఉండనని నా స్నేహితురాలు విమర్శిస్తూనే అన్నీ అడుగుతుంది. మిగతావాళ్లూ అంతే. తమ అవసరాలకు వాడుకుంటారుగానీ ఒక్కరూ ప్రేమగా మాట్లాడరు. స్నేహం చేయాలంటేనే భయమేస్తోంది.

- ఒక సోదరి, హైదరాబాద్‌

మీరు అందంగా లేనని మీరే నమ్ముతున్నందువల్ల ఆ మాట ఎదుటివాళ్లు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు. మీకు తెలియకుండానే మీలో న్యూనతాభావం పెరిగిపోయింది. హాస్టల్లో అందరితో కలిసుండాలి కనుక.. ఏదైనా ఇస్తేనే స్నేహం దొరుకుతుందని సాయం చేస్తున్నారు. అలా మీవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు అవసరానికి వాడుకుని లేనప్పుడు అవమానిస్తుంటే మీరు కుంగిపోతున్నారు. దీనికి కారణం మీ వ్యక్తిత్వం. దీన్ని ‘ప్యాసివ్‌ డిపెండెంట్‌ పర్సనాలిటీ’ అంటారు. అంటే ఇంకొకరి మీద ఆధారపడి, అణిగిమణిగి ఉండే తత్వం. మీ గురించి మీకు నమ్మకం, గట్టితనం లేకపోవడం వల్లే అనర్థాలు వస్తున్నాయి. వాళ్లకి మీమీద అభిమానం, గౌరవం లేవు. కేవలం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా దృఢంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని, స్వతంత్రంగా ఉండగలనని నమ్మి, అందుకు ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. నిర్ణయాలు తీసుకోవాలి. ఇకపై వాళ్లేమైనా అడిగినప్పుడు నెమ్మదిగా దాటేయండి. పరోక్షంగా వాళ్లకీ గుణపాఠం నేర్పినట్లవుతుంది. ఎవరి మీదా ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా ఉండండి. చేయగలిగినంత సాయం చేయండి. అంతే తప్ప వాళ్లని సంతోషపరచడానికి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అలా ఉన్నప్పుడు మీకే ధైర్యం వస్తుంది. స్థైర్యంగా నిలబడగలుగుతారు. మీరలా దృఢంగా ఉంటే.. మీ రూపురేఖలు ఎలా ఉన్నా స్వభావాన్ని చూసి మారతారు. ఇది చాలా ముఖ్యం. దీన్ని ఎసర్టివ్‌ ట్రెయినింగ్‌ అంటారు. మొట్టమొదట ‘నేనూ అందరిలాంటి దాన్నే. ఎందులోనూ తక్కువ కాదు. ఇతరులు చులకన చేసినంతలో తక్కువైపోను’ అని నిశ్చయించుకోవాలి. అవసరాలకు మించి ఎవరికీ సాయం చేయొద్దు. వాళ్లు ఎంతవరకూ స్నేహంగా ఉంటే అంతవరకే ఉండండి. మీకు అనుకూలమైనవారితో మీ గుణగణాలకు తగ్గవారితో స్నేహం చేయాలి. ఎవరైనా అవమానిస్తే దూరంపెట్టాలి. అప్పుడు మీ విలువ తెలుస్తుంది. ఒకవేళ మీ అంతట మీరు మారడం కష్టమనిపిస్తే క్లినికల్‌ సైకాలజిస్టును సంప్రదించండి. మీ వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసి, ఆలోచనా దృక్పథాన్ని మార్చి స్థిరంగా ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తారు. ఇది బాగా ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్