ఆ పాప తనకి కావాలట...

నా వయసు 45. మావారికి 50. సంతానం లేక బంధువుల అమ్మాయిని పెంచుకుంటున్నాం. ఆ పాప అమ్మానాన్నా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

Updated : 29 Nov 2022 05:38 IST

నా వయసు 45. మావారికి 50. సంతానం లేక బంధువుల అమ్మాయిని పెంచుకుంటున్నాం. ఆ పాప అమ్మానాన్నా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వాళ్ల తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మల అంగీకారంతో సంప్రదాయబద్ధంగా హోమాలు, పూజలు చేసి దత్తత తీసుకున్నాం. నెలల పిల్లగా మా ఇంటికొచ్చింది. ఇప్పుడు పిల్ల మేనమామ వచ్చి నేనే పెంచుతా అంటున్నాడు. చట్టబద్ధత తెచ్చుకోవడానికి ఈ దత్తత కార్యక్రమం సరిపోతుందా? ఇంకేం చేయాలి?

- ఓ సోదరి.

మీరు చెప్పిన ప్రకారం పాప తాత నానమ్మ మీకు దత్తత ఇచ్చారని తెలుస్తోంది. హిందూ అడాప్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ - 1956 ప్రకారం దత్తత అనేది ఇచ్చేవాళ్ళకి అర్హత ఉంటేనే చెల్లుతుంది. ఆ యాక్ట్‌ లోని సెక్షన్‌ 9 ప్రకారం వాళ్ళ తల్లి, తండ్రికి మాత్రమే దత్తత ఇవ్వడానికి అర్హత వుంది. అలాగని తల్లికి తెలియకుండా తండ్రి, తండ్రికి తెలియకుండా తల్లి దత్తత ఇవ్వలేరు. తల్లిదండ్రులిద్దరూ లేకపోతే ఎవరు గార్డియన్‌గా వ్యహరిస్తున్నారో, అంటే ఆ పిల్ల బాగోగులు ఎవరు చూస్తున్నారో వారు కోర్టు అనుమతితో పిల్లలను దత్తతకు ఇవ్వాలి. దత్తత ఇవ్వడానికి, తీసుకోవడానికి పాప లేదా బాబుకి 15 ఏళ్లు నిండరాదు. మీరు దత్తతకు సంబంధించిన క్రతువుని చేసుకున్నా.. ఇచ్చేవ్యక్తి  కోర్టు అనుమతి తీసుకోకపోతే చెల్లదనే చెప్పొచ్చు. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు... కోర్టులో ఆ చిన్నారినీ దత్తత ఇవ్వడానికి, తీసుకోవడానికి ఒక ఒరిజినల్‌ పిటిషన్‌ వేయవచ్చు. దాంట్లో మీరు పాపని ఎప్పటి నుంచి పెంచుతున్నారు... ఇప్పుడు పాప వయసు లాంటివన్నీ పొందుపరిచి... దత్తత ఇచ్చిన వారినీ పార్టీగా చేర్చి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయండి. కోర్టు గనుక పిల్లల క్షేమం గురించి సంతృప్తి చెందితే... పాప మీకు చెందేలా ఆర్డర్‌ ఇవ్వొచ్చు. వాళ్ళ మావయ్యకి అడిగే హక్కు లేదు. తను కూడా కోర్టు పర్మిషన్‌ లేకుండా తీసుకుని వెళ్లలేడు. దత్తత చట్టం లోని సెక్షన్‌ 11 ప్రకారం.. అమ్మాయిలను దత్తత తీసుకోవాలంటే... దత్తత తీసుకునే వ్యక్తులకు అప్పటికి ఆడపిల్లలు ఉండకూడదు. అలానే ఈ నియమం మగ పిల్లల విషయంలోనూ వర్తిస్తుంది. ఇక, దత్తత తీసుకునే వ్యక్తికీ... చిన్నారికి మధ్య కనీసం 21 ఏళ్లు వయసు తేడా ఉండాలి. పిల్లల సంక్షేమం చాలా ముఖ్యం కనుక దత్తత ఇవ్వడానికి ముందు కోర్టు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటుంది.. ముందు సరైన వివరాలతో కోర్టు ద్వారా ప్రయత్నిస్తే... చిక్కులు ఎదురుకావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్