స్నేహితుడి భార్యతో... నా భర్త

మావారు స్నేహితుడి భార్యతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది అనుమానం కాదు, స్వయంగా చూశాను. నిలదీస్తే.. ఇష్టమొచ్చింది చేసుకోమన్నారు. మాకిద్దరు ఆడపిల్లలు. ఆయన వ్యాపారం చేస్తారు.

Updated : 19 Dec 2022 01:52 IST

మావారు స్నేహితుడి భార్యతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది అనుమానం కాదు, స్వయంగా చూశాను. నిలదీస్తే.. ఇష్టమొచ్చింది చేసుకోమన్నారు. మాకిద్దరు ఆడపిల్లలు. ఆయన వ్యాపారం చేస్తారు. నేను పదోతరగతి వరకే చదివాను. పుట్టింటివాళ్లకి చెబితే సర్దుకుపోమన్నారు. చాలా దిగులుగా ఉంది. ఆయనలో మార్పు రావాలంటే నేనేం చేయాలి?

- ఓ సోదరి

మీ భర్త వివాహేతర సంబంధం అన్యాయమే. అతడు మిమ్మల్ని, ఆమె తన భర్తనీ మోసం చేస్తూ అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. ఈ స్థితిలో మీకు బతుకు మీద విరక్తి కలుగుతుంది. లేదా అతడి స్నేహితుడికి చెప్పేయాలనిపిస్తుంది. అప్పుడతడు తన భార్యను ఒప్పుకోకపోవచ్చు. లేదా వృత్తి విధమైన లాభాపేక్ష ఉందని సరిపెట్టుకుంటున్నాడేమో. లేకపోతే... మీవన్నీ భ్రమలూ అనుమానాలూ అంటూ ఆమె మీ గురించే తప్పుగా ప్రచారం చేయొచ్చు. మీ భర్త మిమ్మల్ని వదిలేయొచ్చు. ఇలాంటి పర్యవసానాలతో మీరు అన్ని విధాలా నష్టపోయిన వారవుతారు. అందువల్ల శాంతంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు బాధపడుతున్నా రేపు వాళ్లు దుష్పరిణామాలను అనుభవిస్తారని గుర్తుంచుకోండి. ‘నా ఇష్టం.. ఏమైనా చేసుకో’ అన్నాడంటే అతడు మారడానికి సుముఖంగా లేడు, ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు- అని స్పష్టమౌతోంది. మీకు ఆడపిల్లలున్నారు, తల్లిదండ్రుల నుంచి సహకారమూ లేదు కనుక ఈ స్థితిని అంగీకరించి భరించక తప్పదు. అలా అని ఊరుకోనవసరం లేదు. అతనితో ఇలాంటి వాటి వల్ల నష్టాలను సందర్భోచితంగా చెబుతూ ఉండండి. మీరిద్దరూ సంతోషంగా గడిపిన సమయాలను గుర్తు చేయండి. మీ పట్ల ఎంత అనుచితంగా ఉన్నా.. పిల్లల బాధ్యత విస్మరించడానికి వీల్లేదని గుర్తుచేయండి. తన నడత ప్రభావం పిల్లల మీదా పడుతుందని చెబుతూ ఉండండి. అతడు వాళ్లమీద ధ్యాసపెట్టాలని, వాళ్ల పురోభివృద్ధికి సహకారం అందించక తప్పదని గట్టిగా చెప్పండి. పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వాళ్లకి బాధ్యతలను గుర్తుచేస్తూ చక్కగా చదువుకునేట్లు చూడండి. ఉద్యోగాల్లో స్థిరపడ్డాక మీకు అండదండగా నిలుస్తారు. మీరు చేసిందంతా గుర్తుంచుకుని కృతజ్ఞతగా, ప్రేమగా ఉంటారు. కనుక దారులు మూసుకుపోయాయి అనుకోవద్దు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా మరో దారి తప్పకుండా ఉంటుంది. దాన్ని అన్వేషించి అనుసరించాలంతే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్