క్లాసులకని చెప్పి పార్కులకు...

మా మేనమామ కూతురు క్లాసులకని చెప్పి అబ్బాయిలతో సినిమాలకు, పార్కులకు వెళ్తోంది. ఒక్క కూతురైనందున అడిగినంత డబ్బు ఇస్తారు.

Updated : 26 Dec 2022 06:34 IST

మా మేనమామ కూతురు క్లాసులకని చెప్పి అబ్బాయిలతో సినిమాలకు, పార్కులకు వెళ్తోంది. ఒక్క కూతురైనందున అడిగినంత డబ్బు ఇస్తారు. నేను నిలదీస్తే ‘నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. అసలైనా నా జీవితం నా ఇష్టం, నీకెందుకు?’ అంటోంది. చెబితే వాళ్లు నన్నే నిందిస్తారేమో! కానీ రేపేదైనా జరిగితే కుటుంబ పరువు పోతుంది కదా! 

 - ఓ సోదరి

మీ మేనమామ కూతురు స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటోంది. ఆమె పరిపక్వత స్థాయి తక్కువ ఉన్నందున తాను అదుపులో ఉండాలని, చేస్తున్నది తప్పని గ్రహించడంలేదు. కూతుర్ని నమ్మిన తల్లిదండ్రులు రేపు విషయం తెలిస్తే బాధపడతారు. ఆంక్షలు విధిస్తారు. అందువల్ల మీరు ఉద్వేగపడకుండా, తొందరపాటు లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించగలిగే వారికి చెప్పండి. ‘ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు.. కానీ ఇలా వింటున్నాను.. ఆమె జీవితం పాడవకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చెబుతున్నాను..’ అంటూ పరిస్థితిని వివరించండి. మీరు తన హితమే కోరుతున్నట్టు వాళ్లకి అర్థమవ్వాలి. వాళ్లు కూడా మీద్వారా తెలిసినట్టు కాకుండా, ఆమెని తప్పుపడుతున్నట్టు, బెదిరిస్తున్నట్టు కాకుండా వ్యవహరించాలి. సమస్యల్లో ఇరుక్కుంటే కష్టమని, అవసరమైన సాయం చేస్తామని చెప్పి వివరాలు కనుక్కోవాలి. నచ్చజెబుతూ మంచి మార్గంలోకి మళ్లించాలి. లేదంటే చదువు ఆగిపోవచ్చు. చెడు అలవాట్ల వల్ల అవమానాలు ఎదురవ్వొచ్చు. ఎవరైనా అపకారం చేయొచ్చు. తల్లిదండ్రులు ముందుగా చర్చించుకుని శాంతంగా మాట్లాడుతూ తోడుగా ఉంటామంటూ భరోసా ఇవ్వాలి. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి అవసరమైన సాయం చేయాలి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పెద్దలు తిట్టడం, నిర్బంధాలు, నిబంధనలు, ఫోన్‌ లాక్కోవడం, కాలేజీ మాన్పించడం లాంటివి చేస్తారు. ఆ చర్యలు సమస్యని మరింత క్లిష్టం చేస్తాయి. అంతవరకూ స్వేచ్ఛ ఇచ్చి ఒకేసారి లాగేసుకుంటే మానసికంగా కుంగిపోవచ్చు. ఆత్మహత్యా ప్రయత్నం చేయొచ్చు. ఇంట్లోంచి వెళ్లిపోవచ్చు. అందువల్ల ఓర్పుగా నచ్చజెప్పాలి. వినకుండా మొండి వైఖరి అవలంభిస్తే సైకియాట్రిస్టును సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్