మోకాళ్ల నొప్పులు.. ఏం తినాలి?

మా అమ్మ వయసు 55, బరువు 85. మెనోపాజ్‌ తర్వాత బరువు పెరిగింది. మోకాళ్ల నొప్పులూ, అరికాళ్ల మంటలతో ఇబ్బంది పడుతోంది.

Published : 23 Feb 2023 00:05 IST

మా అమ్మ వయసు 55, బరువు 85. మెనోపాజ్‌ తర్వాత బరువు పెరిగింది. మోకాళ్ల నొప్పులూ, అరికాళ్ల మంటలతో ఇబ్బంది పడుతోంది. గతంలో మాదిరిగా ఎక్కువ దూరం నడవలేకపోతోంది. మధ్యాహ్నం చిరుధాన్యాలు తింటుందిగానీ బరువు తగ్గడం లేదు. తను ఏంతినాలి?

- ఓ సోదరి

మెనోపాజ్‌ దశ నుంచి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణం. ఈ వయసుకి వచ్చేసరికి గతంలో ఉన్నంత పని ఒత్తిడి ఉండకపోవడం వల్ల శారీరకంగా విశ్రాంతి దొరుకుతుంది. కానీ, అదే సమయంలో బాధ్యతలూ, భావోద్వేగాలు మానసికంగా ప్రభావం చూపిస్తాయి. దాంతో హార్మోన్ల విడుదలపై ప్రభావం కనిపిస్తుంది. ఈస్ట్రోజన్‌ హర్మోను తగ్గడం, రుతుక్రమం ఆగిపోవడం వంటి వాటివల్ల మెటబాలిజం రేటూ మందకొడిగా సాగుతుంది. ఫలితంగా ఒంట్లో కొవ్వు పేరుకుని బరువు పెరిగి మోకాళ్ల నొప్పులు వేధిస్తాయి. ఎముకలు గుల్లబారడం, గుండె సంబంధిత సమస్యలు చుట్టుముట్టడం వంటివన్నీ ఈ సమయంలోనే ఇబ్బందిపెడతాయి. వీటిని అధిగమించాలంటే... ముందు మీ ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి. సమతులాహారాన్ని తీసుకుంటూ, వ్యాయమాలు చేయాలి. కనీసం నలభై ఐదు నిమిషాలైనా రోజూ కసరత్తులు చేయాలి. ప్రొటీన్‌, పీచు, మైక్రో న్యూట్రియంట్లు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు వంటివి అధికంగా ఉండే ఆహారాన్ని, నిదానంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్‌ని తీసుకోవాలి. ఎక్కువ ప్రాసెస్‌ చేసిన సేమ్యా, నూడుల్స్‌ వంటివాటికి దూరంగా ఉండాలి. శనగలు, బార్లీ, ఓట్స్‌, పొట్టుతో ఉన్న పప్పు ధాన్యాలు, ఉలవలు, మొక్కజొన్న రవ్వ, దంపుడు బియ్యం, గుడ్లు, నట్స్‌, నూనె గింజలు, వంటివి తీసుకోవచ్చు. అయితే, ఏ రవ్వ అయినా మూడు పూటలూ కలిపి 150 గ్రాములకు మించకూడదు. కూరగాయలు 300- 400 గ్రా తప్పక ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లు 150-200గ్రా వరకూ ఉండొచ్చు. పాలు-పెరుగు 300ఎం.ఎల్‌. తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్