బరువు పెరిగేదెలా..

మా పాపకి ఆరేళ్లు. చాలా సన్నగా ఉంటుంది. సరిగా తినదు. తీపి పదార్థాలూ, చాక్లెట్లు మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంది.

Published : 27 Apr 2023 00:09 IST

మా పాపకి ఆరేళ్లు. చాలా సన్నగా ఉంటుంది. సరిగా తినదు. తీపి పదార్థాలూ, చాక్లెట్లు మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంది. తను మెచ్చేలా ఏం తినిపించాలి? కాస్త బొద్దుగా మారాలంటే ఎలా?

- ఓ సోదరి

మీ పాప బరువెంతో చెప్పలేదు. తన వయసుకు తగ్గట్టుగా 16 కేజీల బరువు, 107.4 ఎత్తుండాలి. సన్నగా ఉన్నంత మాత్రాన దిగులు పడక్కర్లేేదు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్‌ వల్ల కూడా పిల్లల శరీరాకృతి ఉంటుంది. ఎప్పటికప్పుడు బరువును చెక్‌ చేసుకుంటూండాలి. ఆటపాటల్లో చురుకుగా ఉందా, జలుబు, జ్వరాల్లాంటివి తరచూ ఇబ్బంది పెడుతున్నాయా, కోలుకోడానికి ఎంత సమయం పడుతుందన్నవి గమనించండి. ఈ వయసులోనే శరీరం ఎదగడానికి బలమైన పునాదులు వేయాలి. కాబట్టి, ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి. ఇంట్లో పెద్దవాళ్లు తీసుకున్నట్టే తనకి కూడా అదే ఆహారం ఇస్తుంటే అది నచ్చకపోవచ్చు. వయసుకు తగినన్ని విటమిన్లు, మాంసకృతులు ఇస్తున్నారా లేదా చూడాలి. పిల్లలు ఒక్కోసారి ఆటలపై ధ్యాసతో అన్నం మానేస్తారు. టిఫిన్‌ తప్పనిసరిగా పెట్టాలి. వారి వయసుకు తగ్గట్టు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఇడ్లీ, దోశ, పల్లీ చట్నీ, పప్పులు, కూరగాయలు ఎక్కువగా వేసిన కిచిడి కూడా పెట్టొచ్చు. కార్న్‌ ఫ్లేక్స్‌, మిల్లెట్‌ ఫ్లేక్స్‌, పాలు, ఆమ్లెట్‌, బ్రెడ్‌ ఇవ్వండి. పాలు తాగటానికి ఇష్టపడకపోతే వాటిలో కొద్దిగా పండ్ల ముక్కల్ని వేసి మిల్క్‌షేక్‌ చేసి తాగించొచ్చు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్డు, మాంసం తినిపించాలి. తన ఆకలికి తగ్గట్టుగానే తీసుకుంటుందా లేదా అనేది చూడండి. రోజూ రంగు రంగుల పండ్లు, కూరగాయలు, నట్స్‌ పెట్టాలి. చాక్లెట్లు శక్తి జనకాలే కానీ వీటితో కడుపు నిండినట్టు అనిపించి వేరే ఆహారంపైకి మనసు మళ్లదు. బిడ్డ ఎదుగుదలకి అవసరమయ్యే విటమిన్లూ, పోషకాలు అందవు. దీనిమూలంగా ఎముకలు, జుట్టు బలహీనంగా మారతాయి. చురుకుదనంపై ప్రభావం పడుతుంది. కాబట్టి చక్కెరను అసలు పెట్టొద్దు. వాటికి బదులు తీయగా ఉండే పండ్లు, బెల్లం, డ్రైఫ్రూట్స్‌ ఇవ్వండి. ఒక వేళ అస్తమానం జబ్బు పడుతున్నట్లయితే రోగనిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్‌ సి అధికంగా ఉండే తాజా పండ్లను తినిపించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్