బరువు పెరగాలని అతిగా తింటోంది...

మా అమ్మాయికి 18 ఏళ్లు. చాలా సన్నగా ఉంటుంది. ఎంత తిన్నా లావు కాకపోవడానికి మా జన్యువులూ ఓ కారణం. అయితే, ఆమె మాత్రం బొద్దుగా కావాలనుకుంటోంది.

Updated : 11 May 2023 05:24 IST

మా అమ్మాయికి 18 ఏళ్లు. చాలా సన్నగా ఉంటుంది. ఎంత తిన్నా లావు కాకపోవడానికి మా జన్యువులూ ఓ కారణం. అయితే, ఆమె మాత్రం బొద్దుగా కావాలనుకుంటోంది. అందుకోసం స్వీట్లు, బరువుని పెంచే ఆహార పదార్థాలు అతిగా తినేస్తోంది. దీంతో ఇప్పటికే గ్యాస్‌ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి తనేం తినాలో చెప్పగలరు?

- ఓ సోదరి

యుక్త వయసు పిల్లలు...తమ ఊహలకు తగ్గ శరీరాకృతిని కోరుకుంటారు. మీ పాపా అదే చేస్తోంది. జన్యుపరంగా ప్రతి ఒక్కరి శరీరాకృతీ వేర్వేరుగా ఉంటుంది. బరువు పెరగడానికని వేపుళ్లూ, స్వీట్లు, బేకరీ, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కోరుకున్న బాడీ షేప్‌ రాదు సరికదా! జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. శరీరంలో కొవ్వుశాతం తక్కువగా, కండ శాతం ఎక్కువగా ఉన్నా సన్నగా కనిపిస్తారు. కొందరు సన్నగానే ఉన్నా  వారిలో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే, శరీర తీరుని అర్థం చేసుకోకుండా ప్రయోగాలు చేయకూడదు. తన వయసులో హార్మోన్ల పనితీరు కీలకం. అతిగా తినడం వల్ల వాటి సమతుల్యత లోపిస్తుంది. ముందు న్యూట్రిషనిస్ట్‌ సాయంతో తన వయసు, ఎత్తుకు ఎంత బరువు ఉండొచ్చో తెలుసుకోండి. ఆ బరువులో కొవ్వు ఉందా? కండ ఉందా ఉన్నది చూసుకుని దానికి తగ్గట్లు ఆహార నియమాలను పెట్టుకోవాలి. తగిన బరువు లేకపోతే... జీవనవిధానం, ఆహారపుటలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా పెరగడానికి ప్రయత్నించొచ్చు. అయితే, ఇందుకు 3-6 నెలలు పడుతుంది. తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. ఇందుకోసం ఆవిరిపై ఉడక బెట్టినవి.. ఇడ్లీ, సేమ్యా, నూడుల్స్‌, తృణ ధాన్యాలతో చేసిన జావలు వంటివి తినాలి. వీటి ద్వారా రోజూ కనీసం 500 కెలొరీలైనా శరీరానికి అందేలా చూసుకోవాలి. స్నాక్స్‌గా మిల్క్‌ షేక్‌లు, జావలు, పండ్ల రసాల్ని తీసుకోవచ్చు. వీటన్నింటి నుంచి విటమిన్లు, ప్రొటీన్లు, పీచు, ఐరన్‌ వంటి పోషకాలన్నీ సమతులంగా అందుతాయి. అప్పుడే ఆరోగ్యంగా బరువు పెరగగలరు. చక్కటి శరీరాకృతీ వారి సొంతమవుతుంది. అవసరమైతే డాక్టర్‌ సలహాతో న్యూట్రిషన్‌ సప్లిమెంట్‌్్స తీసుకోవచ్చు. ఆహారం జీర్ణం కావడానికీ, గ్యాస్‌ సమస్య తగ్గడానికీ వైద్యులను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్