పెద్దవాళ్లు.. సందేహిస్తున్నారు

మంచి ఆఫర్‌ రావడంతో ఉద్యోగం మారా. దానికితోడు మేనేజర్‌ హోదా. తీరా చేరాక నా కింది వాళ్లంతా నాకన్నా చాలా పెద్దవాళ్లు. మొదటిరోజు చూసినప్పుడే ‘ఈమె మేనేజరా.. అసలు చేయగలదా’ అన్న ప్రశ్నలు లేవనెత్తారు.

Published : 28 Jun 2023 00:33 IST

మంచి ఆఫర్‌ రావడంతో ఉద్యోగం మారా. దానికితోడు మేనేజర్‌ హోదా. తీరా చేరాక నా కింది వాళ్లంతా నాకన్నా చాలా పెద్దవాళ్లు. మొదటిరోజు చూసినప్పుడే ‘ఈమె మేనేజరా.. అసలు చేయగలదా’ అన్న ప్రశ్నలు లేవనెత్తారు. సలహా ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఇలాంటప్పుడు వాళ్లతో పనిచేయించేదెలా?

- సుకన్య, హైదరాబాద్‌

‘నన్ను సీరియస్‌గా తీసుకుంటారా?’ నాయకత్వ బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు యువత ముఖ్యంగా అమ్మాయిల మనసుల్లో మెదిలే ప్రశ్న ఇది. బదులుగా ‘సత్తా లేకపోతే నాకీ హోదా, ఉద్యోగం ఇచ్చేవారా?’అని ఆలోచించండి. ఇంకా వాళ్లలో పోటీతత్వం, కాలానికి తగ్గట్టుగా పనిచేయడం కొరవడి ఉండొచ్చు. కాబట్టి ఎవరేమన్నా అనుకున్నా.. ఆ హోదా మీదన్నది గుర్తుంచుకోండి. అర్హతలు, నైపుణ్యాల ఆధారంగానే ఎంచుకున్నారు. కాబట్టి, దాన్నెంత మెరుగ్గా చేయగలనన్నదే ఆలోచించండి. అలాకాకుండా ముందే డీలాపడితే మీ నాయకత్వంపైనే ప్రశ్నలు తలెత్తుతాయి. పెద్దవాళ్లు కాబట్టి, ఒక్కొక్కరితో మాట్లాడండి. మీ ప్రణాళికలు చెబుతూనే దానికి వాళ్ల అనుభవం ఎంతవరకూ ఉపయోగపడుతుందో వివరించండి. ఫీడ్‌బ్యాక్‌నీ కోరండి. మాట, ముఖకవళికల్లో ఆత్మవిశ్వాసం కనపడాలి. అవసరమైతే చూపు, మాట, నిల్చొనే తీరు, చేతి సంజ్ఞలు.. వంటివి సాధన చేయండి. వాళ్లలో మీపట్ల నమ్మకం కలిగించడానికీ సమయం పడుతుంది. ఓపిక, నిజాయతీతో ఉండండి.. ప్రణాళికలు పంచుకోండి. వాళ్ల నుంచి నేర్చుకోవడానికి సిద్ధమేనన్న సందేశం వెళ్లేలా చూసుకోండి. అనుభవజ్ఞులు కాబట్టి, సలహాలూ, సూచనలూ తీసుకోండి. వాళ్లు మీ నుంచి కోరుకుంటున్నదేంటో కూడా తెలుసుకోండి. సూచనలు, ఆజ్ఞలు ఇచ్చినంత మాత్రాన బాస్‌ అయిపోరు. కష్టాన్ని తెలుసుకోగలగాలి, విజయాల్నీ పంచగలగాలి. అప్పుడే అభిమానం పొందగలరు. నా బృందం పని సులువు చేసేదెలా, విజయవంతంగా పని పూర్తిచేసేలా వాళ్లకెలా సాయపడగలను, వాళ్ల ఆలోచనలను ముందుకెలా తీసుకెళ్లాలి, పొరపాటు జరిగినా నేనున్నానన్న భరోసా ఇచ్చేదెలా.. అన్న ప్రశ్నలు వేసుకోండి. పెద్దవాళ్లలో చిన్నచూపు చూస్తున్నారన్న భావనుంటుంది. వాళ్లతో తరచూ మాట్లాడితే సరి. వాళ్ల అవసరాలను సహానుభూతితో అర్థం చేసుకొని నేర్చుకోండి.. మీరు తెలుసుకొన్నది పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్