ఆయనకెన్నో సంబంధాలు

నా  పెళ్లయి 5 ఏళ్ళు అయ్యింది. మా వారికి మరికొందరు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం తెలిసి నిలదీస్తే... నన్నే తిరిగి కొట్టారు. నీతో సంతోషంగా ఉండలేకపోతున్నా.

Updated : 11 Jul 2023 04:45 IST

నా  పెళ్లయి 5 ఏళ్ళు అయ్యింది. మా వారికి మరికొందరు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం తెలిసి నిలదీస్తే... నన్నే తిరిగి కొట్టారు. నీతో సంతోషంగా ఉండలేకపోతున్నా. కాబట్టే మరో దారి చూసుకున్నా అని చెప్తున్నారు. ఇప్పటివరకూ నేను ఉద్యోగం చేసి సంపాదించింది అంతా ఇంటి కోసమే ఖర్చుపెట్టా. నాకోసం ఏమీ దాచుకోలేదు. మనసుకు ఎంత సర్ది చెప్పుకొందాం అనుకున్నా ఉండలేక పోతున్నా... మాకు పిల్లలు లేరు.  నేను ఒంటరిగా బతకగలనా? చట్టం నాకు ఏ విధంగా సాయం చేస్తుంది?

- ఓ సోదరి.

పెళ్లి చేసుకున్న తర్వాత వివాహేతర సంబంధాలు కొనసాగించడం విడాకులకు దారి తీస్తుంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13లో మొదటి క్లాజ్‌ ప్రకారం పెళ్లి అయిన తర్వాత భార్య /భర్త ఎవరైనా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దాన్ని కారణంగా చూపించి విడాకులు కోరవచ్చు. అతడు చేసిన పనుల గురించి ప్రశ్నించినందుకు మిమ్మల్ని కొట్టడం గృహహింస కిందకు వస్తుంది. గృహహింస చట్టంలోని సెక్షన్‌ 3లో శారీరక, మానసిక, ఆర్థిక హింసల గురించి ప్రస్తావించారు. ఆర్థిక హింసల్లో ముఖ్యంగా ఇంటికి కావాల్సిన వనరులను సమకూర్చక పోవడం, ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్తులను వృథా చేయడం,  భార్య పుట్టింటి ధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇంటి అద్దె కట్టకపోవడం, ఇంట్లోని వస్తువులను అమ్మేయడం, భార్య స్త్రీ ధనాన్ని తస్కరించడం, అమ్మడం లాంటివి చేర్చారు. వీటన్నింటినీ అరికట్టడానికి, సెక్షన్‌ 18 కింద రక్షణ కోరుతూ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్‌ 19 కింద ఇంట్లో ఉండే హక్కుని పొందవచ్చు. సెక్షన్‌ 20 కింద మీరు సంపాదించిన ధనాన్ని తిరిగి తీసుకునే హక్కు, సెక్షన్‌ 22 ప్రకారం మిమ్మల్ని గృహ హింసకు గురి చేసినందుకు పరిహారం పొందవచ్చు. గృహహింస చట్టంలో విడాకుల ప్రస్తావన లేదు. అతని ఇంట్లో మీకు కూడా వుండే హక్కు ఉంది కాబట్టి ఒంటరిగా బతకలేను అని భయపడవలసిన అవసరం లేదు. అతడితో జీవితం కొనసాగించా లనుకుంటున్నారో లేదో స్పష్టత తెచ్చుకోండి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులతో విషయం చెప్పండి. ఆపై పెద్ద మనుషుల సాయంతో  సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. అప్పటికీ అతడిలో మార్పు రాదని భావిస్తే విడాకులు తీసుకోవడానికి వెనుకాడొద్దు. మీరు ఇప్పటికే  ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. ముందు ధైర్యంగా ఉండి మంచి లాయర్ని సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్