నల్లగా ఉన్నానని.. స్కూలుకి రావొద్దంటున్నాడు

మా అబ్బాయికి ఏడేళ్లు. చాలా చురుగ్గా ఉంటాడు. ఒకసారి నీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘ఎలాగైనా అమ్మ రంగును మార్చేయాలి’ అన్నాడు. అప్పుడు తెలిసింది నేను నల్లగా ఉన్నందుకు బాధపడుతున్నాడని. నేనంటే ఇష్టమే. అయినా ‘అందరి అమ్మల్లా మా అమ్మ లేదు’ అంటున్నాడు ఈ మధ్య. స్కూలుకి నన్ను రావద్దని చెబుతున్నాడు. మా అబ్బాయి మాటలకు నేను మొదట బాధపడినా, రంగులో ఏముందని ఎన్నో స్ఫూర్తి మాటలు చెప్పినా పట్టించుకోవట్లేదు.

Published : 04 Dec 2023 01:26 IST

మా అబ్బాయికి ఏడేళ్లు. చాలా చురుగ్గా ఉంటాడు. ఒకసారి నీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘ఎలాగైనా అమ్మ రంగును మార్చేయాలి’ అన్నాడు. అప్పుడు తెలిసింది నేను నల్లగా ఉన్నందుకు బాధపడుతున్నాడని. నేనంటే ఇష్టమే. అయినా ‘అందరి అమ్మల్లా మా అమ్మ లేదు’ అంటున్నాడు ఈ మధ్య. స్కూలుకి నన్ను రావద్దని చెబుతున్నాడు. మా అబ్బాయి మాటలకు నేను మొదట బాధపడినా, రంగులో ఏముందని ఎన్నో స్ఫూర్తి మాటలు చెప్పినా పట్టించుకోవట్లేదు. మా అబ్బాయిని మార్చేదెలా?

 ఓ సోదరి

స్నేహితులో, బయట మరెవరైనా వ్యక్తులో మీ రంగు గురించి తప్పుపట్టుంటే పిల్లాడు విని ఉండొచ్చు. చిన్ని మనసుకు బాధ కలిగిందేమో! అందుకోసం పిల్లాడిలో మార్పుకోసం ఒత్తిడి తీసుకు రావాల్సిన పని లేదు. ఒకవేళ అంతగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పించండి. పురాణాల్లోని కృష్ణుడు, రాముడు వంటి వారి రంగు నలుపైనా, వాళ్లు చేసిన మంచి పనుల వల్ల ఎలా అందరికీ ఆరాధ్యులయ్యారో చెప్పండి. ఇలా ఒకటి, రెండుసార్లు మామూలు మాటల్లో చెబితే అర్థం అవుతుంది. పిల్లవాడు మిమ్మల్ని నలుపని స్కూలుకి రావద్దనటం, పెద్దయితే మీ రంగు మార్చేస్తాననటం.. ఇవన్నీ ఎవరో మీ రంగు గురించి ఏవగింపుగా మాట్లాడి ఉంటే అది విని అలా మాట్లాడుతూ ఉండొచ్చు. అందరూ మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో.. పెద్దయితే తెల్లగా చేస్తాను అని ఉండొచ్చు. మీరు తనతోపాటు బయటకు వెళ్తే మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తారేమో అని, లేదంటే తనకే అవమానంగా అనిపించి ఉండొచ్చు. ఏది ఏమైనా మన సమాజంలో తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు తారతమ్యాల వల్ల, రంగును బట్టి ఒకరినొకరు వెక్కిరించుకోవటం లాంటి వాటి వల్లా పిల్లలకు ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. స్వతహాగా ఏర్పడినవి కాదు. వాడిని మార్చటానికి మీ తరఫున ప్రయత్నాలేమీ చేయొద్దు. ఆ విషయాన్ని గురించి మాట్లాడకుండా ఊరుకుంటేనే మంచిది. తిట్టటం, కోప్పడటం వంటివీ చేయొద్దు. పిల్లలు పెరిగేకొద్దీ ఈ అభిప్రాయాలు మారిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్