కెరియర్‌ మారాలనుకుంటున్నా!

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పదేళ్ల అనుభవం ఉంది. మంచి జీతం. అయినా ఏదో అసంతృప్తి. నిజానికి నాకు వేరే దానిపై ఆసక్తి. నాన్న కోసమని ఈ రంగంలోకి వచ్చా.

Published : 06 Dec 2023 01:57 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పదేళ్ల అనుభవం ఉంది. మంచి జీతం. అయినా ఏదో అసంతృప్తి. నిజానికి నాకు వేరే దానిపై ఆసక్తి. నాన్న కోసమని ఈ రంగంలోకి వచ్చా. ఇప్పుడు కెరియర్‌ మారాలని ఉంది. మంచి నిర్ణయమేనా? మారే ముందు ఏయే అంశాలను గమనించుకోవాలో సలహా ఇవ్వండి.

- పూర్ణిమ

నచ్చని రంగంలో కొనసాగడం తేలికేమీ కాదు. అందుకే కెరియర్‌ మారాలి అనుకుంటున్నవారు పెరుగుతున్నారు. అయితే ఇన్నేళ్ల తర్వాత వేరేది ఎంచుకోవడం రిస్క్‌తో కూడిన వ్యవహారమే. వైఫల్యాలకీ సిద్ధంగా ఉండాలి. దానికంటే ముందు ‘ఎందుకు మారాలనుకుంటున్నా’రన్న ప్రశ్న వేసుకోవాలి. ఆ రంగంలో పేరు గడించడం, వ్యాపారం.. దేనికోసమన్న స్పష్టత ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకున్నాక కూడా మారాలనిపిస్తేనే ముందడుగు వేయాలి. ఇక కొత్తదానిలో ఎంత ఆసక్తి, అనుభవం ఉన్నా.. దానిలో తాజా ధోరణులు తెలియాలంటే నిపుణుల సాయం తప్పనిసరి. అలాంటివారిని కోచ్‌గా ఎంచుకోండి. సరైన మార్గనిర్దేశనం దొరకడమే కాదు.. త్వరగా అనుకున్న గమ్యం చేరడంలోనూ సాయపడతారు. తర్వాత ఆర్థిక పరిస్థితేంటి? కొత్త ప్రయత్నమంటే మొదటి మెట్టు నుంచీ ప్రారంభించాలి. ఉద్యోగం ద్వారా నెలవారీ వచ్చే డబ్బులు ఆగిపోతాయి. అంతేకాదు కొత్తగా నేర్చుకోవడానికీ అంటే కోర్సులు, శిక్షణ, వేరే ప్రదేశాల్లో ఉండాల్సొస్తే అక్కడయ్యే ఖర్చుల గురించీ ఆలోచించాలి. ఏమేం నేర్చుకోవాలి? అందుకయ్యే ఖర్చులు.. ముందు వీటికి సిద్ధమైతేనే తర్వాతి ప్రక్రియ సులువుగా అనిపిస్తుంది. వ్యాపారం మీ ఉద్దేశమైతే సేవింగ్స్‌ మొత్తం అయిపోవచ్చు, నగలూ, ఆస్తి వగైరా అమ్మాల్సి రావొచ్చు. వ్యాపకాలు పక్కన పెట్టేయడం, తగినంత నిద్ర లేకపోవడం, కుటుంబంతో గడపలేకపోవడం.. ఇలా ఎన్నో త్యాగాలూ చేయాల్సొస్తుంది. వీటికీ సిద్ధమేనా అనీ ఆలోచించుకోండి. మారడం అన్న ప్రక్రియ అంత సులువు కాదు. కానీ నచ్చింది చేస్తున్నప్పుడు కష్టమైనా బాగానే అనిపిస్తుంది. ఓపిక, పట్టుదలతో సాగితే కోరుకున్నది సాధించొచ్చు. కాబట్టి, వీటన్నింటినీ ఆలోచించుకుని ముందడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్