ఫొటో చూపించి ఇష్టమంటోంది..!

మా అమ్మాయికి 17ఏళ్లు. అన్నింట్లోనూ చురుగ్గా ఉంటుంది. అయితే ఇటీవల ఓ అబ్బాయి ఫొటో చూపించి, తనంటే ఇష్టమంటోంది. ఒక్కోసారి కాలేజీ నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తోంది. ఎంత చెప్పినా వినటం లేదు. గట్టిగా చెబుదామంటే ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడుతుందేమో అని భయంగా ఉంది.

Published : 19 Feb 2024 01:58 IST

మా అమ్మాయికి 17ఏళ్లు. అన్నింట్లోనూ చురుగ్గా ఉంటుంది. అయితే ఇటీవల ఓ అబ్బాయి ఫొటో చూపించి, తనంటే ఇష్టమంటోంది. ఒక్కోసారి కాలేజీ నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తోంది. ఎంత చెప్పినా వినటం లేదు. గట్టిగా చెబుదామంటే ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడుతుందేమో అని భయంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. తనను మార్చేదెలా?

ఓ సోదరి

యుక్తవయసులో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇలాంటి ఆకర్షణలకు లోనవుతుండడం సహజం. ఇది వాళ్ల ఎదుగుదలలో ఒక అంశం. దీనికి కారణం చాలావరకూ హార్మోనులే. స్నేహితులను చూసీ నేర్చుకుంటారు. తోటి పిల్లలతో కలిసి మాట్లాడేటప్పుడు, అభిమతాలు కలిశాయనో మరేదో కారణం వల్లో ఇష్టపడుతుంటారు. వాళ్లతో తిరగటం, కబుర్లు చెప్పుకోవటం, సినిమాలు చూడటం వంటివి చేస్తుంటారు. అది వయసు ప్రభావం. మీ అమ్మాయి అతన్ని చూపించి ఇష్టపడుతున్నట్లు చెప్పింది. చాలామంది తల్లిదండ్రుల దగ్గర అలాంటి విషయాలు గోప్యంగా ఉంచుతారు. మీ అమ్మాయి ఓపెన్‌గా ఉంది. కాబట్టి, తనతో స్నేహపూర్వకంగా ఉండి, ఆ అబ్బాయి వివరాలు తెలుసుకోండి. ముందే కాదంటే పిల్లల్లో మొండితనం పెరుగుతుంది. చెప్పే విషయాలూ చెప్పకుండా దాచేస్తారు. ఈ వయసులో వద్దన్నది చేయటం, అన్నీ తమకే తెలుసన్న అభిప్రాయాలతో ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడితే వాదనలోకి దిగుతారు. దాంతో మీ మధ్య దూరం పెరుగుతుంది. ఇటువంటి విషయాల్లో జాగరూకతతో ఉండటం మంచిదే కానీ తొందరపడి ఆ అమ్మాయిని తప్పుపట్టి మందలించకండి. ముందుగానే లేనిపోనివి ఊహించుకుని కట్టడి చేసేకంటే, వాళ్లని మన నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. అందుకే నెమ్మదిగా మాట్లాడుతూ తప్పొప్పులు చెప్పండి. అప్పుడు మీ మీద నమ్మకంతో తప్పుడు దారిలోకి పోకుండా ఉంటుంది. మీరు ఒత్తిడి చేయటం వల్ల తను ఏమీ చెప్పదు. ఒకవేళ ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే మనకి తెలియదు. సరిదిద్దే అవకాశమూ ఉండదు. కాబట్టి తనతో సఖ్యతగా మెలగుతూ దారిలోకి తెచ్చుకోవడమే అన్నివిధాలా మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్