ఒంటరినయ్యానా...!

నేనో గృహిణిని. నా భర్త ఉద్యోగం చేస్తారు. మాకు ఐదేళ్ల బాబు. రోజంతా వాడిని చూసుకోవడంతోనే సరిపోతుంది. కానీ, ఆఫీసు నుంచి వచ్చీ రాగానే మళ్లీ ఆఫీసు పని మొదలుపెడతారు.

Published : 25 Mar 2024 01:35 IST

నేనో గృహిణిని. నా భర్త ఉద్యోగం చేస్తారు. మాకు ఐదేళ్ల బాబు. రోజంతా వాడిని చూసుకోవడంతోనే సరిపోతుంది. కానీ, ఆఫీసు నుంచి వచ్చీ రాగానే మళ్లీ ఆఫీసు పని మొదలుపెడతారు. కనీసం కలిసి భోజనం చేసే సమయం కూడా ఉండట్లేదు. సమయం దొరికినప్పుడైనా బయటకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపించరు.  దీంతో ఒంటరినయ్యానన్న భావన కలుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఈ బంధం ముగిసిందేమో అనిపిస్తోంది. ఏం చేయాలో తోచడం లేదు. సలహా ఇవ్వగలరు?

ఓ సోదరి

ప్రతి వ్యక్తికీ వాళ్ల ఆలోచనలూ, ఆచరణలూ వేర్వేరుగా ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడం, ఇంటిపనీ... వీటన్నింటి వల్లా విరామం కోరుకోవడం, విసుగ్గా అనిపించడం సహజమే. కానీ ఆయన తన పనులను ఇంటికీ తెచ్చుకోవడంతో మీకు సమయం ఇవ్వలేకపోతున్నారు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా చేసుకోలేకపోతుండొచ్చు. ఆఫీసునీ, కుటుంబాన్నీ సమన్వయం చేసుకోలేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి ఇలా జరుగుతుంది. వీలుంటే ఆఫీసులోనే పని పూర్తి చేసుకుని వచ్చేట్లు చూడమనండి. ఒకవేళ ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఉద్యోగం మారే అవకాశం ఉందేమో అడిగి చూడండి. ఒంటరిగా మీరెంత బాధ పడుతున్నారో ఒకసారి తనకు అర్థమయ్యేలా వివరించండి. దాంతోపాటు బాబుని చూసుకోవడంలో అతడినీ సాయం చేయమనండి. అప్పుడు మీకూ కొంత ఉపశమనం. బాబుకీ తండ్రితో  అనుబంధం ఏర్పడుతుంది. ఏది ఏమైనా భార్యాభర్తలంటే కేవలం ఒక ఇంట్లో కలిసి ఉండటమే కాదు...  ఆలోచనలూ పంచుకునేలా ఉండాలి. ఒకరి సమస్యలు మరొకరు అడిగి తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పినా మార్పు రాలేదంటే మీరిద్దరూ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు వెళ్లండి. అక్కడ సమయపాలన, వ్యక్తిత్వ విషయాల మీద శిక్షణ ఇస్తారు. ఇల్లూ, ఉద్యోగాన్నీ సమన్వయపరచుకోవడం తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్