పసిపిల్లలతో ప్రయాణాలా? ఇవి గుర్తుపెట్టుకోండి!
ఒక్క రోజు ఊరెళ్లాలన్నా మోయలేనంత లగేజీ తయారవుతుంది. అలాంటిది పసి పిల్లల్ని వెంటపెట్టుకెళ్లాలంటే బ్యాగుల కొద్దీ లగేజీ సర్దుకోవాల్సిందే! ఈ క్రమంలో వారికి అవసరం ఉన్నవే కాదు.. అవసరం లేనివీ ముందు జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక పసిపిల్లలతో ప్రయాణాలంటే చాలామంది....
ఒక్క రోజు ఊరెళ్లాలన్నా మోయలేనంత లగేజీ తయారవుతుంది. అలాంటిది పసి పిల్లల్ని వెంటపెట్టుకెళ్లాలంటే బ్యాగుల కొద్దీ లగేజీ సర్దుకోవాల్సిందే! ఈ క్రమంలో వారికి అవసరం ఉన్నవే కాదు.. అవసరం లేనివీ ముందు జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక పసిపిల్లలతో ప్రయాణాలంటే చాలామంది తల్లులు అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ క్రమంలో అత్యవసరం కాకపోతే ప్రయాణాలు మానుకునే వారూ లేకపోలేదు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల పసి పిల్లలతో ప్రయాణాల్ని సౌకర్యవంతంగా ఆస్వాదించచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
⚛ పసి పిల్లల్ని వెంట తీసుకెళ్తున్నప్పుడు ఒకటి లేదా రెండు జతల దుస్తులు అదనంగా బ్యాగులో పెట్టుకోవడం మంచిది. అలాగే అన్నీ లగేజీ బ్యాగులో సర్దేయకుండా.. ఒక జత మీకు అందుబాటులో ఉండేలా హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకుంటే.. వెంటనే మార్చడానికి వీలుగా ఉంటుంది.
⚛ దుస్తులతో పాటు డైపర్లు, వైప్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు.. తీసుకెళ్లడమూ మర్చిపోవద్దు. దూర ప్రయాణాలైతే క్లాత్ డైపర్లు వాడడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి ఎక్కువ తేమను పీల్చుకొని ఎక్కువ సమయం పాటు పొడిదనాన్ని అందిస్తాయి.. అలాగే సౌకర్యవంతంగానూ ఉంటాయి.
⚛ కొంతమంది అవసరం ఉన్నా, లేకపోయినా.. పిల్లల ఆట వస్తువులన్నీ బ్యాగులో సర్దుతుంటారు. దానివల్ల లగేజీ బరువు తడిసి మోపెడవుతుంది. కాబట్టి ఈ బరువు తగ్గించుకోవాలంటే పిల్లలు ఎక్కువగా ఆడుకునే రెండు మూడు ఆట వస్తువుల్ని తీసుకెళ్లడం మంచిది.
⚛ లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లే వారు.. మధ్యమధ్యలో వాహనాన్ని ఆపి.. బేబీకి ఆహారం తినిపించడం, నిర్ణీత వ్యవధుల్లో డైపర్లు మార్చడం.. వంటివి చేయాలి. అలాగే పచ్చటి ప్రదేశాలున్న చోట కాసేపు సమయం గడిపితే మనసుకు ఆహ్లాదంగానూ ఉంటుంది.
⚛ కొంతమంది తల్లులు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి వెనకాడుతుంటారు. ఇలాంటి వారు నర్సింగ్ ప్యాడ్స్, నర్సింగ్ కవర్-అప్స్ వెంట తీసుకెళ్తే సౌకర్యంగా ఉంటుంది. అలాగే బాటిల్ ఫీడింగ్ తీసుకునే పిల్లల కోసం అదనంగా పాల బాటిళ్లు, వేడి నీళ్లు, ఫార్ములా.. వంటివి తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఘనాహారం తినే పిల్లల కోసం తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాల్ని/మిక్స్‌లను తీసుకెళ్లడం మంచిది.
⚛ వాతావరణ మార్పులు పిల్లలపై త్వరగా ప్రభావం చూపుతాయి. కొంతమంది చిన్నారులకు నీళ్ల మార్పిడి వల్ల జలుబు, దగ్గు.. వంటివి తలెత్తచ్చు. కాబట్టి పిల్లలకు సంబంధించిన మందులు, టానిక్స్.. వెంటే ఉంచుకోవాలి. తద్వారా వెళ్లిన చోట ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు.
⚛ కొంతమంది బేబీ స్ట్రోలర్, బేబీ క్యారియర్.. వంటివి తీసుకెళ్లడం అనవసరం అనుకుంటారు. కానీ ప్రయాణాల్లో రవాణా కోసం వేచి చూడాల్సి వస్తే.. పాపాయిని ఎత్తుకోవడానికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. కాబట్టి బరువు అనుకోకుండా వీటిని వెంటపెట్టుకెళ్లడమే మంచిది.
⚛ చిన్నపిల్లలతో హడావిడి ప్రయాణాలు వద్దు. అది విమానమైనా, రైలైనా, బస్సైనా సరే.. నిర్ణీత సమయానికంటే ముందే ఎయిర్‌పోర్ట్/రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు చేరుకోవడం మంచిది. అలాగే దిగేటప్పుడు కూడా అలర్ట్‌గా ఉండాలి.
⚛ పిల్లలతో ప్రయాణించినప్పుడు ముందు సీట్లను, అది కూడా కిటికీ ఉన్న సీట్లను ఎంచుకోవడం మంచిది. తద్వారా అక్కడ కాస్త ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. వెంట తీసుకెళ్లిన బేబీ సీట్స్/స్ట్రోలర్‌ని అక్కడ ఫిక్స్ చేస్తే.. ఇటు మీకు, అటు వారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
⚛ ప్రయాణాల్లో పిల్లల్ని తోటి ప్రయాణికులకు అప్పగించడం, ఒంటరిగా వదిలిపెట్టి వాష్‌రూమ్‌కి వెళ్లడం సరికాదు. కాబట్టి చిన్నపిల్లల్ని వెంటపెట్టుకొని ఊర్లకు వెళ్లేవారు.. ఒంటరిగా కాకుండా, భాగస్వామిని లేదంటే ఇతర కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకెళ్లడం మంచిది.
⚛ పసి పిల్లలతో కలిసి వెకేషన్లకు వెళ్లాలనుకునే వారు.. చిన్నారులకు సౌకర్యవంతంగా ఉండే ప్రదేశాల్ని ఎంచుకోవడం మంచిది. ఈ క్రమంలో బాగా వేడిగా లేదంటే బాగా చల్లగా ఉండే లొకేషన్స్ కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్ని ఎంచుకోవాలి. అలాగే కొంతమంది పిల్లలకు బీచ్ వాతావరణం కూడా పడకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.