అందుకే మొహం చిట్లించకుండా హ్యాపీగా తినేయండి..!

చాలామంది మొహం చిట్లించుకుంటూ తినే కూరగాయల్లో 'క్యాప్సికం' కూడా ఒకటి. ఇది పెద్ద సైజు మిరపకాయను పోలి ఉండడంతో కొంతమంది కారంగా ఉంటుందేమోనని తినకుండా ఉండిపోతారు. కానీ క్యాప్సికం అసలు కారమే ఉండదు.. పైగా ఇందులో శరీరానికి కావలసిన విటమిన్ సి....

Published : 05 Nov 2022 19:07 IST

చాలామంది మొహం చిట్లించుకుంటూ తినే కూరగాయల్లో 'క్యాప్సికం' కూడా ఒకటి. ఇది పెద్ద సైజు మిరపకాయను పోలి ఉండడంతో కొంతమంది కారంగా ఉంటుందేమోనని తినకుండా ఉండిపోతారు. కానీ క్యాప్సికం అసలు కారమే ఉండదు.. పైగా ఇందులో శరీరానికి కావలసిన విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు.. తదితర పోషకాలు, ఇతర ఖనిజాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా ఇంట్లో క్యాప్సికం కూర చేసినప్పుడు మొహం చిట్లించకుండా హ్యాపీగా తినేయండి. ఇంతకీ ఇందులో ఉండే పోషకాలేంటో చూద్దాం రండి..

యాంటీఆక్సిడెంట్లు అధికంగా..

క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అవయవాలు, రక్తనాళాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని కూడా పెంచుకోవచ్చు. సి విటమిన్‌కు మనం తినే ఆహారపదార్థాల్లోని ఐరన్‌ను ఎక్కువగా గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి మన శరీరంలో సి విటమిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందువల్ల ఐరన్ లేమితో బాధపడే వారికి ఇది మంచి ఆహారం.

క్యాలరీలు తక్కువ..

క్యాప్సికంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది తింటే బరువు పెరుగుతామనే భయం ఉండదు. అలాగే ఇది శరీరంలోని కొవ్వును కరిగించి జీవక్రియల్ని వేగవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి దీన్ని సలాడ్ల రూపంలో, కూరల్లో వేసుకుని తినడం మంచిది.

గుండెకు రక్షణగా..

గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ క్యాప్సికం పాత్ర కీలకమే. కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో, ధమనుల్లో బ్లాకేజ్‌లు ఏర్పడకుండా గుండెకు రక్షణనిస్తుంది. గుండెను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ప్రతిరోజూ తింటే బోర్ కొడుతుంది కదా! అంటారా? అయితే ఇతర కూరగాయల్లో కూడా దీన్ని వేసుకుని తినచ్చు. అలాగే క్యాప్సికంలో ఉండే క్యాప్సాయిసిన్స్ అనే సమ్మేళనం శరీరంలో కార్సినోజెన్ అభివృద్ధిని నిరోధిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడచ్చు.

అదుపులో మధుమేహం..

మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండవు. ఇది చాలా ప్రమాదకరం. మరి దీన్ని వెంటనే అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాప్సికం రక్తంలోని చక్కెర స్థాయుల్ని.. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే ఇందులో క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయనే భయం ఉండదు.

ఆందోళనను తగ్గిస్తుంది..

కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతుంటారు. దీంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది తగ్గాలంటే క్యాప్సికం తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం ఆందోళనను, ఉద్రేకాన్ని తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.

జీర్ణవ్యవస్థ పటిష్టం..

కొంతమందికి తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్య.. లాంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాళ్లు క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనికి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ సమస్యనైనా నయం చేసే శక్తి ఉంది.

కంటికి మంచిది..

క్యాప్సికంలో ఉండే విటమిన్ ఎ వల్ల కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే చర్మంపై ఏర్పడే దద్దుర్లు, మొటిమలు వంటివి తొలగించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

కండరాలు దృఢంగా..

పొటాషియం అధికంగా లభించే ఆహార పదార్థాల్లో క్యాప్సికం ఒకటి. ఈ ఖనిజం శరీరంలో ఖనిజాల స్థాయుల్ని బ్యాలన్స్ చేయడంలో సహకరిస్తుంది. అలాగే పొటాషియం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు కండరాల పనితీరు మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్