రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే పలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రాగుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Updated : 28 Mar 2024 13:49 IST

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే పలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రాగుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాగుల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

రాగులతో జావే కాదు..  వివిధ రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. కొంతమంది వీటిని ఇడ్లీ, దోసెల రూపంలో తీసుకుంటారు. రాగులతో లడ్డూ, కేక్‌, హల్వా, పూరీ, పరోటా.. వంటివీ చేసుకొని తీసుకుంటుంటారు మరికొందరు. రాగుల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాల్ని పొందచ్చంటున్నారు నిపుణులు.

ఎముకల దృఢత్వానికి..

రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎంత క్యాల్షియం లభిస్తుందో.. రెండు రాగి దోసెలను తీసుకోవడం వల్ల అంతే క్యాల్షియం శరీరానికి అందుతుందని చెబుతున్నారు నిపుణులు. క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. అలాగే దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు రాగులను క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయసు మళ్లిన వారు కూడా రాగులను తీసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

బరువు అదుపులో..!

అధిక బరువుతో బాధపడే వారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే 100 గ్రాముల రాగుల్లో కేవలం 1.9 గ్రాములు మాత్రమే కొవ్వు పదార్థాలు ఉంటాయట! ఫైబర్‌ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. దానివల్ల రాగులు కొద్ది మొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలన్న కోరిక దరిచేరదు. అదే సమయంలో శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.

మధుమేహులకు...

మధుమేహులకు రాగులు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ‘గ్లైసెమిక్‌ ఇండెక్స్‌’ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తంలోని గ్లూకోజు స్థాయులు అదుపులో ఉంటాయి.

గర్భిణులు, పాలిచ్చే తల్లులకు..

రాగుల్లో క్యాల్షియంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 34.7 మైక్రోగ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది గర్భిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగుల్లో ఉండే ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్‌, అమైనో ఆమ్లాలు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అందానికీ..!

రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్నీ ద్విగుణీకృతం చేస్తాయంటున్నారు నిపుణులు. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్‌ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయి. అలాగే వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి.. చర్మం ముడతలు పడకుండా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్