క్లీనింగ్ ఏజెంట్.. ఆలూ!

బంగాళాదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా మనలో చాలామందికి ఫేవరెట్‌. పలు చర్మ సమస్యల్ని తగ్గించి మేని ఛాయను పెంచే సుగుణాలూ ఇందులో బోలెడు! అయితే ఇలా అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఈ దుంప.. పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలిస్తుందని మీకు తెలుసా?

Published : 14 Sep 2023 12:41 IST

బంగాళాదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా మనలో చాలామందికి ఫేవరెట్‌. పలు చర్మ సమస్యల్ని తగ్గించి మేని ఛాయను పెంచే సుగుణాలూ ఇందులో బోలెడు! అయితే ఇలా అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఈ దుంప.. పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలిస్తుందని మీకు తెలుసా? అంతేకాదు.. సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఏజెంట్‌గా పనిచేసే ఆలూ పలు ఇంటి అవసరాలకూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

ఆ పాత్రల్ని మెరిపిస్తుంది!

వాతావరణంలోని తేమ కారణంగా ఐరన్‌, స్టీలు పాత్రలు తుప్పు పట్టడం సహజమే! అయితే దీన్ని వదిలించడానికి స్టీల్‌ స్క్రబ్బర్‌ వంటివి వాడితే పాత్ర త్వరగా పాతబడిపోతుంది.. మెరుపూ తగ్గిపోతుంది. అందుకే దానికి బదులు బంగాళాదుంపను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఆలూను మందపాటి స్లైసుల్లా కట్‌ చేసుకోవాలి. ఒక స్లైస్‌ను గిన్నెలు తోమే సోప్‌ లిక్విడ్‌లో ముంచి లేదంటే బేకింగ్‌ సోడాలో అద్ది.. తుప్పు ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఫలితంగా తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత సోప్‌ లిక్విడ్‌తో శుభ్రం చేసి పొడిగా ఆరబెడితే సరిపోతుంది.

ఇక తుప్పు పట్టిన వంటింటి కత్తులపై బంగాళా దుంప ముక్కతో రుద్ది ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగి పొడిగా తుడిచేస్తే ఫలితం ఉంటుంది.

వెండి నల్లబడిందా?

గాలి తగిలి వెండి ఆభరణాలు నల్లగా మారడం మనకు తెలిసిందే! ఇలాంటప్పుడు వాటిని మరిగే నీటిలో వేసి కడుగుతుంటాం. అయితే దీనివల్ల అవి శుభ్రపడడమేమో గానీ వాటి సహజ మెరుపును కోల్పోతాయి. ఇలాంటప్పుడు బంగాళాదుంపలు మరిగించిన నీళ్లతో వెండి వస్తువుల్ని శుభ్రం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా నీళ్లు బాగా వేడిగా, మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి. ఈ నీటిలో ఆయా వస్తువుల్ని వేసి గంటపాటు వదిలేసి ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఈ నీళ్లలో ఉండే స్టార్చ్‌ నల్లగా మారిన వెండి ఆభరణాలు/వస్తువుల్ని తిరిగి మెరిపిస్తుంది.

మాడిపోతే ఇలా చేయండి!

మతిమరుపు/హడావిడి కారణంగా ఒక్కోసారి వంట చేసే క్రమంలో గిన్నెలు అడుగంటుతుంటాయి. అయితే దీన్ని వదిలించాలన్నా అందుకు బంగాళాదుంప చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం మందపాటి స్లైస్‌లా కట్‌ చేసిన ఆలూ ముక్కను నిమ్మరసంలో ముంచి మాడిన ప్రదేశంలో రుద్దాలి. ఆ తర్వాత దాన్ని ఓ అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు సబ్బు నీటితో నెమ్మదిగా రుద్ది కడిగేస్తే మాడిన గిన్నె తిరిగి మెరిసిపోతుంది.

మరకలు మాయం!

దుస్తులు, కార్పెట్స్‌పై టొమాటో కెచప్‌ వంటి మరకలు పడితే ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు ఒక చిన్న బంగాళాదుంప ముక్క తీసుకొని మరక పడిన చోట రుద్దాలి. ఆపై బంగాళాదుంపలు ఉడికించిన నీటిని దానిపై పోయాలి. ఇప్పుడు ఆ క్లాత్‌ను ఓ అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత సాధారణంగా సబ్బు నీటితో ఉతికేస్తే మరక తొలగిపోవడం మనం గమనించచ్చు. ఇలా కాదనుకుంటే.. ఆలూ ఉడికించిన నీటిలో స్పాంజిని ముంచి కూడా మరక పడిన చోట రుద్దచ్చు. ఫలితంగా కూడా మరక తొలగిపోతుంది.

ఇలా కూడా!

లెదర్‌ షూస్‌, బ్యాగులు త్వరగా దుమ్ము పట్టేస్తుంటాయి. తద్వారా అవి మురికిగా కనిపిస్తాయి. అలాంటప్పుడు బంగాళాదుంప ముక్కతో వాటిని రుద్ది ఓ ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు శుభ్రమైన కాటన్‌ వస్త్రంతో మరోసారి వాటిని తుడిచేస్తే సరిపోతుంది.

చెక్క వస్తువులు/వుడెన్‌ ఫర్నిచర్‌ని శుభ్రం చేయడానికీ బంగాళాదుంపను ఉపయోగించచ్చు. ఇందుకోసం కొద్దిగా వెనిగర్‌, టీస్పూన్‌ ఉప్పు, తురిమిన ఆలూ కొద్దిగా తీసుకొని.. వీటన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమంలో స్పాంజిని ముంచి చెక్క ఫర్నిచర్‌ని తుడిచేస్తే అవి మెరిసిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్