చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!

ఈ వేసవి కాలం చెమట ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.. ఈ క్రమంలో కొన్ని శరీర భాగాల్లో జిడ్డుదనం, దురద, మంట.. వంటివి సహజం. ఇదిలా ఉంటే.. గాలి తగలని వ్యక్తిగత భాగాల్లో తలెత్తే ఇబ్బందుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వేసవిలో వచ్చే వెజైనా ఇన్ఫెక్షన్‌ కూడా ఇలాంటిదే! సిగ్గు, బిడియంతో ఈ సమస్య గురించి చెప్పుకోలేరు చాలామంది.

Updated : 04 May 2024 20:26 IST

ఈ వేసవి కాలం చెమట ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.. ఈ క్రమంలో కొన్ని శరీర భాగాల్లో జిడ్డుదనం, దురద, మంట.. వంటివి సహజం. ఇదిలా ఉంటే.. గాలి తగలని వ్యక్తిగత భాగాల్లో తలెత్తే ఇబ్బందుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వేసవిలో వచ్చే వెజైనా ఇన్ఫెక్షన్‌ కూడా ఇలాంటిదే! సిగ్గు, బిడియంతో ఈ సమస్య గురించి చెప్పుకోలేరు చాలామంది. అయితే కొన్ని సహజసిద్ధమైన మార్గాలు ఈ సమస్యకు శాశ్వత, సురక్షితమైన పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

కారణాలేంటి?

ఈ కాలంలో కేవలం చెమట వల్లే ఈ సమస్య రాదంటున్నారు నిపుణులు. దీంతో పాటు వ్యాయామం చేసే క్రమంలో శరీరం నుంచి విడుదలయ్యే అధిక వేడి, వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, అవాంఛిత రోమాలు తొలగించుకోకపోవడం, కాలానికి తగ్గ లోదుస్తుల్ని ఎంచుకోకపోవడం, అధిక బరువు, ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో రూపొందించిన శ్యానిటరీ న్యాప్‌కిన్లు, ప్యాంటీ లైనర్లు.. వంటివన్నీ అధిక చెమటకు కారణమై.. తద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అందుకే కాలమేదైనా వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు ఎన్నో ప్రత్యుత్పత్తి సమస్యలు, ప్రమాదకర క్యాన్సర్లకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు.

‘సహజ’ పరిష్కారముంది!

ఈ వేసవిలో వెజైనా సమస్యలు/ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా.. ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సహజసిద్ధమైన పరిష్కార మార్గాలతో పాటు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటంటే..!

⚛ పాలిస్టర్‌, కాటన్‌.. వంటి మెటీరియల్స్‌కి చెమటను పీల్చుకొనే గుణం ఉంది. తద్వారా చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఆయా మెటీరియల్స్‌తో తయారుచేసిన లోదుస్తుల్ని ధరించడం ఉత్తమం.

⚛ లోదుస్తులే కాదు.. ఇతర దుస్తుల విషయంలోనూ ఈ కాలంలో శ్రద్ధ వహించడం అత్యవసరం. ఈ క్రమంలో జీన్స్‌ వంటి బిగుతైన దుస్తులకు బదులు పలాజో, వైడ్లెగ్‌ ప్యాంట్స్‌, వదులుగా ఉండే కాటన్‌ ట్రౌజర్లు.. వంటివి చక్కటి ఎంపిక. ఇవి చెమటను పీల్చుకోవడంతో పాటు గాలి బాగా ఆడుతుంది.

⚛ వ్యాయామం తర్వాత, బయటి నుంచి ఇంటికొచ్చిన తర్వాత.. ఇలా ఎక్కువగా చెమట పట్టిన ప్రతిసారీ దుస్తుల్ని మార్చుకోవడం, శుభ్రంగా స్నానం చేయడం తప్పనిసరి.

⚛ వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా ఆ ప్రదేశంలోని అవాంఛిత రోమాల్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ముఖ్యం. తద్వారా ఇన్ఫెక్షన్లు, దుర్వాసన.. వంటి సమస్యలకు చెక్‌ పెట్టచ్చు.

⚛ స్నానం చేసే నీటిలో బేకింగ్‌ సోడా, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, వేపాకులు వేసి మరిగించిన నీళ్లు.. వంటివి కలుపుకొని.. ఆ నీటితో స్నానం చేసినా ఇన్ఫెక్షన్లు, చెమట వల్ల వచ్చే దురదను నివారించుకోవచ్చు.

⚛ జననేంద్రియాలను శుభ్రం చేయడానికి బాడీ సోప్స్.. వంటివి అస్సలు వాడకూడదు. ఒకవేళ వాడితే అక్కడి మంచి బ్యాక్టీరియా, పీహెచ్‌ స్థాయుల బ్యాలన్స్‌ అదుపు తప్పి సమస్య మరింత ఎక్కువవుతుంది.

⚛ వెజైనా ఆరోగ్యానికి ప్రొబయోటిక్‌ ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. ఇందులో భాగంగా పెరుగు, పులియబెట్టిన పదార్థాలు.. వంటివి తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్‌ సలహా మేరకు అవసరమైతే ప్రొబయోటిక్‌ సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు. అలాగే రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి.

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?

ఇవన్నీ పాటించినా.. వెజైనా దగ్గర చెమట - దురద తగ్గకపోయినా, మంటగా అనిపించినా, కలయిక సమయంలో ఇబ్బంది తలెత్తినా, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చినా.. ఈ క్రమంలో మంటగా, ఇబ్బందిగా అనిపించినా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. తద్వారా అసలు సమస్యేంటో తెలుసుకొని దాని ప్రకారం చికిత్స అందిస్తారు. ఫలితంగా ఇది ఇతర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్