ఆట వస్తువులతోనూ అసమానతలు పెంచద్దు!

ఇంట్లో ఆడ, మగ పిల్లలుంటే.. ఇద్దరినీ సమానంగా పెంచాలని, అసమానతలు వారి మనసులోకి రాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే అన్ని విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకున్నా.. వాళ్లకు కొనిచ్చే ఆటవస్తువులు, బొమ్మల విషయంలో మాత్రం ఇప్పటికీ చాలామంది....

Published : 09 Oct 2022 16:59 IST

ఇంట్లో ఆడ, మగ పిల్లలుంటే.. ఇద్దరినీ సమానంగా పెంచాలని, అసమానతలు వారి మనసులోకి రాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే అన్ని విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకున్నా.. వాళ్లకు కొనిచ్చే ఆటవస్తువులు, బొమ్మల విషయంలో మాత్రం ఇప్పటికీ చాలామంది పేరెంట్స్‌ ఆలోచనలు మారట్లేదనే చెప్పాలి. ఆడపిల్లలకు బార్బీ బొమ్మ, తమ చిట్టి చేతులతో వంట నేర్చుకోవడానికి ఓ మినీ వంట సామగ్రి సెట్‌.. వంటివి కొనిస్తుంటారు. అదే మగ పిల్లాడైతే మినీ కారు/బైక్‌, పజిల్స్‌ ఇస్తుంటారు. ఇలా ఆట వస్తువుల్లో చూపించే వ్యత్యాసం పిల్లల మనసుల్లో లింగ అసమానతలకు తెరతీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఈ సమస్య లేకుండా ఉండాలంటే.. ఇద్దరికీ ఒకే రకమైన ఆట వస్తువులు.. అది కూడా వాళ్ల ఆలోచనా శక్తిని, తెలివితేటల్ని పెంచే వాటిని అందించడం ఉత్తమం అంటున్నారు. మరి, ఏంటా ఆట వస్తువులు? వాటి వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటి? రండి.. తెలుసుకుందాం!

ఎలాంటి బొమ్మలివ్వాలి?

చాలామంది ఆడపిల్లలకు బార్బీ బొమ్మలు, మినీ వంట సామగ్రి, టాయ్‌ మేకప్‌ కిట్‌, టెడ్డీబేర్‌.. వంటివి అందిస్తుంటారు. వీటితో ఆడుకోవడం వల్ల వాళ్లకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా.. అమ్మాయి అంటే వంటింటికే పరిమితమవ్వాలేమోనన్న భావన వారి చిన్ని మనసులో నాటుకుపోతుంది. ఇక అబ్బాయిలకు బొమ్మ బైక్‌లు, మినీ కార్లు, సూపర్‌ హీరో బొమ్మలు.. వంటివి అందించడం వల్ల వారిలో ఒక రకమైన హీరోయిజం వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఉండే ఆడ, మగ పిల్లలకు ఇలాంటి బొమ్మలివ్వడం వల్ల ఇద్దరి మధ్య అసమానతలు పెరగడంతో పాటు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకే అమ్మాయైనా, అబ్బాయైనా.. వారి తెలివితేటల్ని పెంచే బొమ్మల్ని అందించడం ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారి ఆసక్తులకు, అభిరుచులకూ ప్రాధాన్యమివ్వమంటున్నారు. అలా వారి ఇష్టాయిష్టాల్ని బట్టి.. వివిధ సంగీత పరికరాలు, డాక్టర్‌ కిట్‌, క్రాఫ్ట్‌ కిట్స్‌, సైన్స్‌ కిట్‌, వివిధ రకాల పజిల్స్‌.. ఇలా ఆలోచిస్తే పిల్లల మెదడుకు పదును పెట్టే బోలెడన్ని ఆటవస్తువులు మార్కెట్లో దొరుకుతాయి.

సృజనాత్మకత పెరుగుతుంది!

ఈ రోజుల్లో సృజనాత్మకత ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలుగుతాం. అయితే దీన్ని అప్పటికిప్పుడు అలవర్చుకోవాలంటే కుదరదు.. చిన్న వయసు నుంచే చురుగ్గా, క్రియేటివ్‌గా ఆలోచించేలా మెదడుకు పదును పెట్టాలి. ఇందుకోసం ఆలోచించి ఆడే పజిల్‌ గేమ్స్‌, బిల్డింగ్‌ బ్లాక్స్‌.. వంటి ఆటలు దోహదం చేస్తాయి. ఇలాంటి ఆటలు మొదలుపెట్టాక చివరి వరకూ ఆడాలన్న ఆరాటం పిల్లల్లో పెరుగుతుంది. ఇదే వారిలో సరికొత్త ఆలోచనలు రేకెత్తేలా చేస్తుంది. చేసే పనిపై ఏకాగ్రత పెరిగేందుకూ ఇలాంటి ఆట వస్తువులే పిల్లలకు అవసరం అంటున్నారు నిపుణులు. అలాగే సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.. వంటివి అలవడతాయి.

ఆ వివక్షకు స్వస్తి!

సమాజంలో లింగ వివక్షను అంతమొందించాలంటే.. ఆ ప్రక్రియ మొదట ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఇంట్లో ఉండే ఆడ, మగ పిల్లలకు చిన్న వయసు నుంచే లింగ సమానత్వానికి సంబంధించిన బీజాలు వేయాలి. ఇద్దరికీ ఒకే రకమైన ఆట వస్తువులు అందించడమూ ఇందులో ముఖ్యమే! దీనివల్ల ఆ ఇంట్లో లింగ భేదానికి తావుండదు. పైగా ఇలా ఇద్దరూ ఒకే రకమైన బొమ్మలతో ఆడుకున్నప్పుడు వాళ్లకొచ్చిన సరికొత్త ఆలోచలను పంచుకోగలుగుతారు. కలిసి ఆడుకోవడం వల్ల వారి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. తల్లిదండ్రులు తామిద్దరినీ సమానంగా చూస్తున్నారన్న భావన కూడా వారిలో కలుగుతుంది. ఇది పిల్లలకు, పెద్దలకు మధ్య అనుబంధాన్ని రెట్టింపు చేస్తుంది.

ప్రయోగాలు చేయనివ్వండి!

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎక్కువ మార్కులు రావాలనే ఆరాటపడుతుంటారు. కానీ వారికి మార్కుల కంటే విషయ పరిజ్ఞానం ముఖ్యమని ఆలోచించరు. ఇలా ఆయా సబ్జెక్టులపై పట్టు ఉంటేనే వారు అనుకున్న రంగంలో రాణించగలుగుతారు. ఈ నైపుణ్యం సొంతం కావాలంటే వారికి ప్రయోగాలు చేయడానికి వీలుగా ఉండే ఆట వస్తువుల్ని అందించడం మంచిదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. వాళ్లకు అంతరిక్షమంటే  ఇష్టమనుకోండి.. దానికి సంబంధించిన కిట్‌ను అందించాలి.. అదే ల్యాబ్‌లో ప్రయోగాలు చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లయితే వాళ్లకో మినీ మైక్రోస్కోప్‌ అందించి చూడండి.. ఇలాంటి ఆట వస్తువులతో ఆడుకోవడం వల్ల వారికి విషయ పరిజ్ఞానం అలవడుతుంది.. ఇలా ప్రయోగాత్మకంగా వారు తెలుసుకున్న కొత్త విషయాలు ఇక ఎప్పటికీ మర్చిపోరు కూడా!

మీ ప్రోత్సాహం ఎల్లవేళలా..!

ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ వృత్తి ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉంటున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రమంలో చాలామంది తమ పిల్లలకు అవసరమైన వస్తువుల్ని అందించడంతో తమ పనైపోయిందనుకుంటారు. ఈ క్రమంలో ఒకవేళ ఇద్దరికీ ఒకే రకమైన ఆట వస్తువులే ఇచ్చినా కేవలం అది మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు పెరిగి పెద్దయ్యే క్రమంలో వారు వేసే ప్రతి అడుగులోనూ తల్లిదండ్రుల తోడు, ప్రోత్సాహం చాలా ముఖ్యమంటున్నారు. అలాగే మీరిచ్చే బొమ్మలతో మీరే స్వయంగా వారిని ఆడించండి.. అర్థం కాని విషయాలు వివరించండి. దానివల్ల వారు వివిధ నైపుణ్యాలు మరింత చురుగ్గా నేర్చుకోగలుగుతారు. మరోవైపు.. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్