Weight Loss : వేగంగా బరువు తగ్గుతున్నారా? ఈ సమస్యలు తప్పవట!

మనసులో ఒకటి అనుకుంటే దాన్ని వెంటనే పూర్తి చేయాలనుకుంటారు కొంతమంది. బరువు తగ్గే విషయంలోనూ ఇలా ఇన్‌స్టంట్‌ ఫలితాన్ని కోరుకుంటారు. అయితే అధిక బరువును తగ్గించుకునే విషయంలో ఆతృత కంటే.. ఓపిక ముఖ్యమంటున్నారు నిపుణులు.

Published : 27 Nov 2023 12:56 IST

మనసులో ఒకటి అనుకుంటే దాన్ని వెంటనే పూర్తి చేయాలనుకుంటారు కొంతమంది. బరువు తగ్గే విషయంలోనూ ఇలా ఇన్‌స్టంట్‌ ఫలితాన్ని కోరుకుంటారు. అయితే అధిక బరువును తగ్గించుకునే విషయంలో ఆతృత కంటే.. ఓపిక ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే త్వరగా తగ్గాలన్న లక్ష్యం పెట్టుకొని కఠినమైన వ్యాయామాలు చేయడం, క్రాష్‌ డైట్లు పాటించడం వల్ల బరువు తగ్గడం మాటేమో గానీ.. లేనిపోని అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశమే ఎక్కువంటున్నారు. మరి, వేగంగా బరువు తగ్గడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

మరీ లావుగా ఉన్నామనో, ఎవరో కామెంట్‌ చేశారనో.. తమ శరీరాన్ని తాము అసహ్యించుకుంటుంటారు కొంతమంది. ఈ క్రమంలోనే వెంటనే బరువు తగ్గాలని స్వల్పకాలిక లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు. ఈ క్రమంలోనే శరీరంపై ఒత్తిడి కలిగేలా కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. క్రాష్‌ డైట్‌ పేరుతో తక్కువ తినడం, ఉపవాసం చేయడం.. వంటివీ చేస్తారు. నిజానికి ఈ అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. బరువు తగ్గే విషయంలో స్వల్పకాలిక లక్ష్యాలకు బదులు దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్దేశించుకుంటేనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడదని చెబుతున్నాయి. అందుకే బరువు తగ్గడాన్ని దీర్ఘకాలిక లక్ష్యాల్లో చేర్చుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

ఎముకలకు చేటు!

వేగంగా బరువు తగ్గాలన్న లక్ష్యంతో తిండి మానేస్తుంటారు కొందరు. ఈ క్రమంలోనే శరీరానికి అవసరమైన క్యాలరీలు, పోషక పదార్థాలు పక్కన పెట్టేస్తుంటారు. దీనివల్ల కండరాల ద్రవ్యరాశి ఒక్కసారిగా తగ్గిపోతుంటుంది. ఆరోగ్యపరంగా ఇది అసాధారణ సంకేతమంటున్నారు నిపుణులు. వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల పరిమాణం తగ్గిపోవడం సాధారణమే అయినా.. వేగంగా బరువు తగ్గే క్రమంలో ఈ పరిస్థితి ఎదురైతే మాత్రం పలు సమస్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఎముక చుట్టూ రక్షణ కవచంలా ఉండే కండరాల పరిమాణం క్షీణించడం వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి. తద్వారా అవి సులభంగా విరిగే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇదే కాదు.. పోషకాహార లేమి కారణంగా శరీరం నీరసించడంతో పాటు తేమ స్థాయుల్ని కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువే! కాబట్టి పోషకాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా.. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకునేలా నిపుణుల సలహా మేరకు ప్రణాళిక వేసుకోవడం మంచిది.

జుట్టు రాలుతుంది!

త్వరగా బరువు తగ్గాలన్న ఉద్దేశంతో ఆహారం తగ్గించి తీసుకుంటుంటారు చాలామంది. ఈ క్రమంలో తమ శరీరానికి అవసరమైన క్యాలరీలు, కొవ్వులు, పోషకాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయం కూడా ఆలోచించరు. ఇది క్రమంగా పోషకాహార లేమికి దారితీస్తుంది. అయితే ఒక్కో పోషక లోపంతో ఒక్కో ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. శరీరంలో ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్‌ బి12.. స్థాయులు తగ్గితే రక్తహీనత, జుట్టు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయట! అలాగే అయొడిన్‌ లోపిస్తే.. థైరాయిడ్‌ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందట! ఇక విటమిన్‌ ‘డి’ లోపం వల్ల చర్మ సమస్యలు, క్యాల్షియం తగ్గితే ఎముకల సమస్యలు, శరీరానికి సరిపడా విటమిన్‌ ‘ఎ’ అందకపోతే కంటి సమస్యలు, మెగ్నీషియం లోపం వల్ల గుండె సంబంధిత సమస్యలు.. వంటివి ఒకదాని తర్వాత మరొకటి దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితి రాకూడదంటే పోషకాలన్నీ అందేలా ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

హార్మోన్ల అసమతుల్యత

వేగంగా బరువు తగ్గాలన్న లక్ష్యంతో కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం, సామర్థ్యానికి మించి బరువులెత్తడం, అలసట నుంచి రికవరీ కాకముందే మళ్లీ వ్యాయామాలకు పూనుకోవడం, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటి వాటి వల్ల ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌, టెస్టోస్టిరాన్‌.. తదితర హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయులు పెరిగిపోయి మానసికంగానూ పలు సమస్యలు తప్పవంటున్నారు. అంతేకాదు.. శరీరంలో ఇలాంటి హార్మోన్ల అసమతుల్యత కారణంగా.. తీవ్ర అలసట/నీరసం, అండం విడుదల కాకపోవడం, నెలసరి ఆగిపోవడం.. వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట!

మనసుపై ప్రభావం!

కడుపు నిండా ఆహారం తీసుకోకుండా, కఠినమైన వ్యాయామాలు చేస్తూ త్వరగా బరువు తగ్గాలని శరీరాన్ని కష్ట పెడుతుంటారు చాలామంది. అయితే దీని ప్రభావం పరోక్షంగా మనసుపైనా పడుతుందంటున్నారు నిపుణులు. శరీరాకృతి గురించి తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, పదే పదే బరువు తగ్గాలన్న ఆలోచనలతో సతమతమైపోవడం.. ఇలా ప్రతికూల ఆలోచనలు మనసును ఒత్తిడిలోకి నెట్టేస్తుంటాయి. ఫలితంగా యాంగ్జైటీ, ఆందోళన, చిరాకు వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

అయితే ఎలా చూసినా వేగంగా బరువు తగ్గాలన్న ప్రయత్నం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అర్థమవుతోంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని బరువు తగ్గే విషయంలో చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నిపుణుల సలహా మేరకు ఆహార, వ్యాయామ నియమాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే బరువు తగ్గచ్చంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్