Colleague: అమ్మాయిలంటే పిచ్చి..

మా సహోద్యోగికి అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి. అతడి చూపులు చాలా ఇబ్బందిపెడతాయి. పెళ్లై, పిల్లలున్నా అలా ప్రవర్తిస్తాడేంటో అర్థం కాదు. కొత్త పరిచయాల కోసం అర్రులు చాస్తాడు.

Published : 17 Apr 2023 00:24 IST

మా సహోద్యోగికి అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి. అతడి చూపులు చాలా ఇబ్బందిపెడతాయి. పెళ్లై, పిల్లలున్నా అలా ప్రవర్తిస్తాడేంటో అర్థం కాదు. కొత్త పరిచయాల కోసం అర్రులు చాస్తాడు. భార్యను చక్కగా చూసుకుంటూనే బయటివాళ్ల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటివాళ్లలో మార్పు రావాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

స్త్రీలూ పురుషులూ కూడా ఒక వయసొచ్చాక తోటివారితో.. అవతలి లింగం వాళ్లతో ఎలా ఉండాలన్నది తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. చిన్నతనంలో అందరితో ఒకేలా ఉన్నా.. పెద్దయ్యాక పరిధులు తెలుసుకొని ప్రవర్తించాలి. కొందరు వేరే వైఖరితో లేదా విపరీత ధోరణితో ఉండటం వల్ల సమాజ పద్ధతులను పట్టించుకోరు. పరాయి స్త్రీలను మామూలుగా కాకుండా వేరే విధంగా చూస్తారు. వారి నుంచి ఆనందాన్ని పొందాలనుకుంటారు. అంటే స్నేహభావంతో కాకుండా శారీరక సుఖాన్నిచ్చే ఆటబొమ్మలా చూసి ఆకర్షితులవుతారు. సామాజిక విలువలు, బాధ్యతలు మర్చిపోవడం వల్ల ఇలా అతిగా ప్రవర్తిస్తారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. అలాంటివారు భార్యతో ఉన్నప్పటికీ ఇతర స్త్రీల నుంచి ఆనందాన్ని పొందాలనే మనస్తత్వంతో ఉంటారు. వాళ్లు అలా ఇబ్బందికరంగా చూస్తున్నారు అనిపించినప్పుడు మామూలుగా మాట్లాడుతూనే ఇది పద్ధతి కాదని తెలియజేయొచ్చు. ఒంటరిగా చెప్పడం కష్టమనిపిస్తే స్నేహితుల సాయం తీసుకోవచ్చు. అదీ కాదంటే పై అధికారులతో లేదా అతడు మర్యాద ఇస్తాడు అనుకున్నవారితో.. ఇది మంచి పద్ధతి కాదు, నీకు విలువుండదు, నీ గురించి చెడుగా చెప్పుకొంటారు, అందరూ దూరం పెడతారు, అసహ్యించుకుంటారు తరహాలో అతడికి తెలియజేయాలి. అయినా మారకపోతే.. అతడు మీ వద్దకు వస్తే అక్కణ్ణించి తప్పుకొని వెళ్లిపోండి. మాట్లాడించినా బదులివ్వొద్దు. అలా చేస్తే కొంతకాలానికి పరిస్థితీ, పరిణామాలూ అర్థమై మార్పు రావచ్చు. ఇంకా మార్పు రాకపోతే అతణ్ణి పట్టించుకోవడం మానేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్