Relationship: నేనే ప్రాణమన్నట్టు నటిస్తారు.. మా ఆయన్ను మార్చేదెలా?

మా వారి ప్రవర్తనతో విసిగిపోతున్నాను. బయటివాళ్ల ముందు నేను తన ప్రాణమన్నట్టు నటిస్తారు. అందరూ నేను చాలా అదృష్టవంతురాలిని అనుకుంటారు.. కానీ ఇంట్లో నన్నసలు పట్టించుకోరు.

Updated : 01 May 2023 13:13 IST

మా వారి ప్రవర్తనతో విసిగిపోతున్నాను. బయటివాళ్ల ముందు నేను తన ప్రాణమన్నట్టు నటిస్తారు. అందరూ నేను చాలా అదృష్టవంతురాలిని అనుకుంటారు.. కానీ ఇంట్లో నన్నసలు పట్టించుకోరు. ప్రతి విషయంలోనూ గొడవలే. కౌన్సెలింగ్‌కు వెళ్దామంటే వినరు. ఈయన్ను మార్చేదెలా? 

- ఓ సోదరి

భార్యను గౌరవించి, ప్రేమగా చూసుకుంటే సమాజం మెచ్చుతుందని మీ భర్త బయటి వాళ్లముందు అలా ఉంటున్నారు. కానీ ఇంట్లో అలా ఉండటంలేదని అతనితోనే చెప్పండి. ‘ప్రేమ చూపినప్పుడు ఆనందంగా ఉంటోంది, ఇంట్లో అందుకు వ్యతిరేకంగా ఉంటే బాధ కలుగుతోంది.. అసలేం కోరుకుంటున్నారు, ఎలా ఉంటే నచ్చుతుంది?’ అని ముఖాముఖీ అడగండి. అతని అభిప్రాయమేంటో తెలుస్తుంది. ఇద్దరూ చర్చించుకుని సర్దుబాట్లు చేసుకోవచ్చు. భార్య ఇంటి పనులన్నీ చేయాలి.. లాంటి అతని ఆశలకు తగ్గట్టు మీరు లేకపోవడం వల్ల లేదా ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించడంలో తేడాలు ఉండటం వల్ల అతను ప్రేమగా ఉండటËం లేదా? ఒకవేళ మీ ఆలోచనలో లోపం ఉందేమో కూడా ఆలోచించండి. సాధారణంగా బయట అందరూ ఎంతో కొంత నటించడం సహజం. అందరి ముందూ ఉన్నట్టే ఇంట్లోనూ ఉండాలని ఎక్కువ ఆశపడుతున్నందువల్ల మీకు అసంతృప్తిగా ఉందేమో! బయట ప్రశంసించారు కనుక, ఇక ఇంటికొచ్చాక నాకేమీ పని చెప్పకూడదు, అనుకుంటే అదీ పొరపాటే. కనుక ఇలాంటి విషయాల్లో రెండు వైపులా ఆలోచించి ఇద్దరి వ్యక్తిత్వాలనూ పరిశీలించాల్సి వస్తుంది. మీది సున్నిత మనస్తత్వమా, మీరేం కోరుకుంటున్నారు, అతనేం ఆశిస్తున్నాడు.. లేదా అతనిలో రెండు రకాల ప్రవర్తన ఉందా.. వ్యక్తిత్వ సమస్యలున్నాయా- ఇవన్నీ చూడాలి. ఇద్దరినీ గమనించాక కోరికలు, దృక్పథాల్లో తేడాలుంటే కౌన్సెలింగ్‌తో సరిచేయొచ్చు. సైకలాజికల్‌ ఎసెస్‌మెంట్‌ చేశాక విడివిడిగా మాట్లాడతారు. మీరేంటో మీకు తెలిసేలా చేస్తారు. ఎలా సరిదిద్దుకోవాలో చెబుతారు. అతను మానసిక నిపుణుల వద్దకు రానంటే అతడితో ఎలా సర్దుకుపోవాలో.. కొన్ని సందర్భాల్లో పట్టించుకోకుండా దాటేయడం ఎలాగో మీకు తర్ఫీదిస్తారు. అప్పటికీ ఫలితం లేదంటే ఇరువైపుల పెద్దలతో మాట్లాడి నిర్ణయించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్