Updated : 07/03/2023 17:41 IST

ఇంటర్‌లోనే ప్రేమ అంటోంది.. ఎలా మార్చాలి?

మా చెల్లి ఇంటర్‌ చదువుతోంది. నేను పీజీ చేస్తున్నాను. మా చెల్లి తను చదువుతోన్న కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తన స్నేహితురాలి ద్వారా నాకు తెలిసింది. అతనిది మా కులం కాదు. మా అమ్మానాన్నలకు కుల పట్టింపులు చాలా ఎక్కువ. దీనికి తోడు ఆ అబ్బాయి ప్రవర్తన కూడా సరిగా లేదు. పైగా అతను మా చెల్లి కంటే చిన్నవాడు. ఇవన్నీ చెప్పి అతన్ని మర్చిపోమని చెప్పాను. కానీ, ఎంత చెప్పినా తను నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఆ దిగులుతో నేను సరిగా చదవలేకపోతున్నా. మా చెల్లి ఆలోచనలను మార్చడం ఎలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. ఈ రోజుల్లో చాలామంది పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు. దాని ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటోంది. ఇందులో భాగంగానే ప్రేమ, డేటింగ్‌ వంటి అంశాలకు ఆకర్షితులవుతున్నారు. మీ చెల్లి విషయంలో కూడా ఇది స్పష్టంగా కనబడుతోంది. అయితే మీరు తన మంచి కోసం చెప్పే మాటలను పట్టించుకోవడం లేదంటున్నారు. దానివల్ల మీరు దిగులు పడడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి, ముందుగా ఈ విషయాన్ని మీ పెద్దవాళ్లకు చెప్పండి. వారి ద్వారా చిన్న వయసులో ప్రేమ వల్ల కలిగే నష్టాల గురించి మీ చెల్లెలికి తెలియజేయండి. అలాగే ఈ వయసులో కెరీర్‌పై దృష్టి పెట్టడం ఎంత అవసరమో వివరించండి. దాంతో తన ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉండచ్చు. అప్పటికీ తనలో మార్పు రాకపోతే రెండో మార్గాన్ని అనుసరించండి.

ఈసారి నేరుగా అబ్బాయి తల్లిదండ్రులను సంప్రదించండి. వారికి కూడా వీరి వ్యవహారం గురించి చెప్పండి. ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో స్పష్టం చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల అబ్బాయి చదువుపై ధ్యాస పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా మీ చెల్లి కూడా అతని గురించి ఆలోచించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో కూడా వారిలో మార్పు రాకపోతే నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించండి. వారు పలు టెక్నిక్‌లు ఉపయోగించి వారి ఆలోచనల్లో మార్పు వచ్చేలా చేస్తారు. కాబట్టి, మీరు కంగారు పడకండి. ఈ ఆలోచనలతో చదువును నిర్లక్ష్యం చేయకండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని