Akshaya Tritiya: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేదెలా?

ఏ విషయంలోనైనా రాజీ పడతారేమో గానీ.. బంగారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు చాలామంది మహిళలు. ‘అక్షయ తృతీయ’ వచ్చిందంటే చాలు.. గోల్డ్‌ ధర ఎంత ఉన్నా కనీసం గ్రాము బంగారమైనా కొంటారు. తద్వారా ఆ ఏడాదంతా ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వారి నమ్మకం!

Updated : 10 May 2024 15:31 IST

ఏ విషయంలోనైనా రాజీ పడతారేమో గానీ.. బంగారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు చాలామంది మహిళలు. ‘అక్షయ తృతీయ’ వచ్చిందంటే చాలు.. గోల్డ్‌ ధర ఎంత ఉన్నా కనీసం గ్రాము బంగారమైనా కొంటారు. తద్వారా ఆ ఏడాదంతా ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వారి నమ్మకం! అయితే బంగారం కొనే విషయంలో స్పష్టత ఉన్నా.. దాని స్వచ్ఛత గురించి మహిళల్లో ఒక రకమైన భయం ఉంటుంది. తాము తీసుకొనే ఆభరణం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైందేనా?, నాణ్యమైందేనా? అన్న సందేహాలు కలుగుతుంటాయి. అయితే బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే దాని స్వచ్ఛతను సులభంగా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం రండి..

మనం కొనుగోలు చేసే బంగారు ఆభరణాల స్వచ్ఛతను ‘హాల్‌మార్క్‌’ ద్వారా గుర్తించచ్చు. ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS)’ రూపొందించిన ఈ గుర్తులో భాగంగా బంగారం స్వచ్ఛతను తెలుసుకోవాలంటే.. నగపై ముద్రించిన మూడు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. వాటిలో మొదటిది - BIS స్టాండర్డ్‌ మార్క్‌, రెండోది - స్వచ్ఛత గ్రేడ్‌, మూడోది - HUID నంబర్‌. 2021 నుంచే బంగారు నగలపై ఈ హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

BIS స్టాండర్డ్‌ మార్క్

త్రిభుజాకారంలో ఉండే గుర్తు ఇది. ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి, వాటిపై హాల్‌మార్కింగ్‌ చేశారనడానికి ఇదే తొలి సంకేతమంటున్నారు నిపుణులు. కాబట్టి ఎంచుకునే నగపై ఈ గుర్తును ముద్రించారో, లేదో చెక్‌ చేసుకోవాలి. ఈ మార్క్‌ ఉన్న వాటినే కొనుగోలు చేయాలి.

క్యారట్లలో.. స్వచ్ఛత!

బంగారం స్వచ్ఛతను తెలుసుకోవాలంటే.. దానిపై ముద్రించిన క్యారట్స్‌ సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి! సాధారణంగా 24 క్యారట్ల బంగారాన్ని వంద శాతం స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అయితే ఈ బంగారంతో నగలు తయారుచేస్తే అవి అంత దృఢంగా ఉండవు. అందుకే నగల తయారీలో బంగారంతో పాటు వెండి, రాగి, నికెల్‌, ఇనుము, జింక్‌, టిన్‌, మాంగనీస్‌, కాడ్మియం, టైటానియం.. వంటి ఇతర లోహాల్నీ వాడుతుంటారు. ఇలా వీటితో తయారైన నగల్లో అసలు బంగారం ఎంత శాతం ఉంది? ఇతర లోహాల్ని ఎంత మొత్తంలో కలిపారు? అన్న అంశాలపై.. ఆ బంగారు ఆభరణం స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికే BIS.. బంగారం స్వచ్ఛతను ఆరు రకాలుగా వర్గీకరించింది. అంటే.. 14k, 18k, 20k, 22k, 23k, 24k.. వంటి గుర్తులతో స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.

ఈ క్రమంలోనే ఆయా నగలపై స్వచ్ఛతను సూచించడానికి 22k916, 18k750, 14k585.. వంటి గుర్తుల్ని ముద్రిస్తారు. అంటే.. 22 క్యారట్ల బంగారు ఆభరణాల్లో 91.6 శాతం బంగారం ఉంటుందని అర్థం! అదే.. 18 క్యారట్ల నగల్లో 75 శాతం, 14 క్యారట్ల గోల్డ్‌ జ్యుయలరీలో 58.5 శాతం బంగారం లోహాన్ని కలుపుతారని అర్ధం. ఇలా మనం కొనుగోలు చేసే నగల స్వచ్ఛతను ఈ క్యారట్ల సంఖ్య ద్వారా గుర్తించచ్చు.

HUID నంబర్ అంటే..?

బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను తెలుసుకోవాలంటే HUID (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌) నంబర్‌ కూడా కీలకమే! ప్రతి నగల వ్యాపారి ఈ ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్‌ (అక్షరాలు, అంకెలతో కూడిన) కోడ్‌ ఉన్న ఆభరణాల్నే విక్రయించాలని గతేడాది ఏప్రిల్‌ 1నే భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆభరణానికీ ఒక ప్రత్యేకమైన HUID నంబర్‌ని కేటాయిస్తారు. ఈ కోడ్‌ ప్రతి ఆభరణానికి భిన్నంగా ఉంటుంది. అయితే ఈ కోడ్‌ సాయంతో కొనే బంగారం స్వచ్ఛమైందో, కాదో స్వయంగా తనిఖీ చేసుకోవడానికి ‘BIS Care’ అనే ప్రత్యేకమైన యాప్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం.

దీంతో బంగారం స్వచ్ఛతను తెలుసుకోవాలంటే..

⚛ ముందుగా ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

⚛ పేరు, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి.

⚛ యాప్‌ ఓపెన్‌ కాగానే ‘Verify HUID’ అని కనిపించే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

⚛ ఆపై బంగారు ఆభరణం మీద ఉన్న HUID నంబర్‌ని అందులో ఎంటర్‌ చేయాలి.

తద్వారా నగకు సంబంధించిన హాల్‌మార్కింగ్‌ వివరాలన్నీ ఓ షీట్‌ రూపంలో కనిపిస్తాయి. ఇందులో భాగంగా.. హాల్‌మార్క్‌ చేయించిన దుకాణం, హాల్‌మార్క్‌ చేసిన కేంద్రం, ఆభరణం, క్యారట్లలో దాని స్వచ్ఛత.. తదితర విషయాలన్నీ ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. దుకాణదారుడు ఇచ్చే బిల్లుతో ఈ వివరాల్ని సరిపోల్చుకోవచ్చు. ఇలా ఈ మూడు సంకేతాల ద్వారా మనం కొనుగోలు చేసే ఆభరణానికి సంబంధించిన స్వచ్ఛతను సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా మనకు అతి ప్రియమైన బంగారం విషయంలో మోసపోకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్