ఉన్ని దుస్తులు.. ఇలా శుభ్రం చేద్దాం!

చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వార్డ్‌రోబ్‌లో నుంచి స్వెట్టర్లు, ఇతర ఉన్ని దుస్తులు బయటికి తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఉన్ని దుస్తులు ఉపయోగించేటప్పుడు వాటికి ఏమాత్రం మరకలైనా లేదా మాసినట్లు కనిపించినా వెంటనే వాటిని ఉతికేస్తుంటాం.

Published : 26 Nov 2023 12:22 IST

చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వార్డ్‌రోబ్‌లో నుంచి స్వెట్టర్లు, ఇతర ఉన్ని దుస్తులు బయటికి తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఉన్ని దుస్తులు ఉపయోగించేటప్పుడు వాటికి ఏమాత్రం మరకలైనా లేదా మాసినట్లు కనిపించినా వెంటనే వాటిని ఉతికేస్తుంటాం. అయితే వాటిని అన్ని దుస్తులతో కలిపి కాకుండా విడిగా శుభ్రపరచాల్సి ఉంటుంది. అలాగే ఉతికే విధానం కూడా వేరుగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఎండలో వేయాలి...

మిగిలిన దుస్తులతో పోలిస్తే.. ఉన్ని దుస్తులను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎక్కువ రోజులు వాడకుండా పక్కన ఉంచడం వల్ల వాటి నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది. అయితే ఉన్ని దుస్తులను భద్రపరిచే ముందే ఉతుకుతాం కాబట్టి.. వాటిని ఒకసారి ఎండలో వేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన పోతుంది. అలాగే వాటిలో ఏమైనా క్రిములు చేరినా అవి కూడా నశించే అవకాశం ఉంటుంది.

విడిగా ఉతకాలి...

ఉన్ని దుస్తులను మిగిలిన వాటితో కలిపి ఉతకడం సరికాదు. ఎందుకంటే అవి ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని విడిగా శుభ్రం చేయాలి. దీనికోసం ఉన్ని దుస్తులను చన్నీళ్లలో పూర్తిగా మునిగేలా ఉంచాలి. కొంతమంది బాగా శుభ్రపడతాయనే ఉద్దేశంతో ఉన్ని దుస్తులను గంటల తరబడి డిటర్జెంట్‌ పౌడర్‌లో నానబెడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఉన్ని త్వరగా పాడైపోతుంది. డిటర్జెంట్‌ పౌడర్‌ కలపని నీటిలో మాత్రమే వాటిని కొద్దిసేపు నాననివ్వాలి.

ఎక్కువ రుద్దకూడదు..

ఉన్ని దుస్తులపై ఏవైనా మరకలు ఉన్నట్లైతే కొంతమంది వాటిని బలంగా రుద్దుతుంటారు. దీనివల్ల మరక పోవడం సంగతి పక్కన పెడితే దుస్తులు పాడైపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఉన్ని దుస్తులు పూర్తిగా నానిన తర్వాత ఉప్పు, డిష్‌వాష్‌ లిక్విడ్‌, వెనిగర్‌.. మొదలైనవి ఉపయోగించి రుద్దితే సరిపోతుంది. ఇలా రుద్దిన తర్వాత ఒకసారి నీటిలో ముంచి తీస్తే సరి.

ఆ డిటర్జెంట్‌ వద్దు..

చాలామంది సాధారణ వస్త్రాలను ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్‌నే ఉన్ని దుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ వాటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి ఉపయోగిస్తే.. ఉన్ని నాణ్యత తగ్గకుండా ఉంటుంది. ఒకవేళ అవి అందుబాటులో లేనట్లయితే బేబీ షాంపూని సైతం ఉపయోగించవచ్చు. చల్లటి నీటిలో కొద్దిగా బేబీ షాంపూ కలిపి వాటితో ఉన్ని దుస్తులు ఉతికితే అవి శుభ్రపడడంతో పాటు.. వాటి నాణ్యత కూడా దెబ్బతినకుండా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్