పని దొంగ అనిపించుకోకుండా..

మార్కెటింగ్‌ విభాగంలో చేస్తున్నా. అలసిపోతున్నా.. నాదే కాదు బృందంలోని ఎనిమిది మందిదీ ఇదే మాట. సెలవు సంగతేమోకానీ భోజనమూ నింపాదిగా చేయలేకపోతున్నాం. మాది పెద్ద సంస్థ. రెండేళ్లలో ఎంతోమంది లేఆఫ్‌ ఎదుర్కొన్నారు.

Published : 22 Mar 2023 00:13 IST

మార్కెటింగ్‌ విభాగంలో చేస్తున్నా. అలసిపోతున్నా.. నాదే కాదు బృందంలోని ఎనిమిది మందిదీ ఇదే మాట. సెలవు సంగతేమోకానీ భోజనమూ నింపాదిగా చేయలేకపోతున్నాం. మాది పెద్ద సంస్థ. రెండేళ్లలో ఎంతోమంది లేఆఫ్‌ ఎదుర్కొన్నారు. ఆ భయంతోనేమో రోజుకు 10-12 గంటలు కష్టపడుతున్నాం. మాపైవాళ్లూ 10 నిమిషాల్లో భోజనం ముగిస్తుండటంతో మేమూ అనుసరించక తప్పట్లేదు. ఎప్పుడైనా వీలు దొరికితే కొద్దిసేపు పక్కకెళతా. ఆ చిన్న విరామంతో ఒత్తిడి తగ్గి, ఆరోజు ఇంకాస్త మెరుగ్గా పనిచేస్తున్నా. కనీసం లంచ్‌ సమయమన్నా సరిగ్గా తీసుకుంటే అందరిలో కాస్త ఒత్తిడి తగ్గుతుందని నా అభిప్రాయం. పని దొంగ అనిపించుకోకుండా ఈ సలహా మా బాస్‌కి ఇచ్చేదెలా?

- శిఖా

అరగంట విరామానికి ఇంతలా భయపడటం విచారకరం. మీరే కాదు చాలామందిదీ ఇదే పరిస్థితి. కానీ రోజు మధ్యలో తీసుకునే విరామం ఇంకాస్త హుషారుగా పనిచేసేలా చేయగలదు. యూఎస్‌లో ఎనర్జీ ప్రాజెక్ట్‌ అనే సంస్థ దీన్ని గుర్తించే ‘టేక్‌ బ్యాక్‌ యువర్‌ లంచ్‌’ ప్రోగ్రామ్‌ని ప్రారంభించింది. టీమ్‌ మొత్తాన్నీ భోజన సమయంలో కాసేపు బయటకు తీసుకెళతారట. దీన్నోసారి మీ బాస్‌ దగ్గర ప్రస్తావించండి. మన దగ్గర చాలామందికి 24 గంటలూ కంప్యూటర్‌ ముందు కూర్చొంటేనే పనిచేస్తున్నట్టనే అపోహ ఉంటుంది. యంత్రంలా పనిచేస్తోంటే కొత్త ఆలోచనలు ఎలా పుడతాయి? ఇంట్లో కారు ఉందనుకోండి. పెట్రోల్‌ పోయించడం, మెరుగ్గా పనిచేయాలని మెయింటెనెన్స్‌ కూడా చేయిస్తుంటాం. మన విషయంలో మాత్రం ఈ విషయాన్ని మర్చిపోతాం. అవసరం పేరుతో శక్తికి మించి పనిచేస్తోంటే ఉత్పాదకత పెరగకపోగా తగ్గుతుంది. ఎనర్జీ ప్రాజెక్ట్‌ వ్యవస్థాపకుడు ష్వార్ట్జ్‌ అతని బృందంతో దీనిపై పరిశోధన చేసి.. ఎన్ని గంటలు చేస్తున్నారన్నది కాదు.. ఎంత విలువ చేకూరుస్తున్నారన్నది ముఖ్యమని తేల్చారు. సమయం కాదు.. శక్తి ప్రధానమంటారాయన. శక్తిని సరిగా వినియోగిస్తే తక్కువ సమయంలో ఎక్కువ పని సాధ్యమని నమ్ముతారు. ముందు దీన్నోసారి చదవండి. ఆపై విరామాలు పనిపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతాయో పరిశోధించి, బాస్‌తో మాట్లాడండి. రుజువులు ఉంటాయి కాబట్టి, ఆయనా ఆ దిశగా ఆలోచిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్