నలభైకు చేరువయ్యారా!

నలభైకు చేరువయ్యే కొద్దీ జుట్టు తెల్లబడటం మాత్రమే కాదు శరీరంలో కూడా చిన్న చిన్న మార్పులు చోటుచేసుకుంటాయి.

Published : 08 Feb 2023 00:17 IST

నలభైకు చేరువయ్యే కొద్దీ జుట్టు తెల్లబడటం మాత్రమే కాదు శరీరంలో కూడా చిన్న చిన్న మార్పులు చోటుచేసుకుంటాయి. అవే మన భవిష్యత్‌ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నలభైల్లో ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోడానికి   నిపుణుల సలహాలేమిటో తెలుసుకుందాం!

అల్పాహారం మరవద్దు..  ఏళ్లు గడిచేకొద్దీ మన శరీరంలో మెటబాలిజం రేటు తగ్గుతుంటుంది. ఉదయాన్నే అల్పాహారం సమయానికి తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య ఉండదు.

వ్యాయామం.. రోజుకి అరగంట వ్యాయామం మెటబాలిజాన్ని పెంచుతుంది. దానికోసం జిమ్‌కే వెళ్లక్కరలేదు. ఇంట్లోనే చిన్న చిన్న స్క్వాట్స్‌ చేయొచ్చు. ఇవి నరాలకు బలాన్ని ఇవ్వడమేగాక శరీరాన్ని అదుపు తప్పకుండా నియంత్రించుకునే శక్తిని అందిస్తాయి.

కాల్షియం, విటమిన్‌ డి.. నలభైల తర్వాత శరీరంలో కాల్షియం స్థాయులు తగ్గిపోతాయి. ఈ వయసులో మహిళలకు రోజుకి 1000మిల్లీ గ్రాముల కాల్షియం, 800ఐయూ విటమిన్‌ డి తప్పక అందాలి. కాబట్టి కాల్షియం, విటమిన్‌ డి ఎక్కువగా ఉండే పాలు, సాల్మన్‌ చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్‌ డి సప్లిమెంట్స్‌ కూడా  తీసుకోవచ్చు.

ఒత్తిడిని అదుపులో.. ఇంటిపనీ, ఉద్యోగ బాధ్యతలతో సహజంగానే ఒత్తిడి ఎదుర్కొంటాం. అధిక ఒత్తిడితో బీపీ, లైంగిక వాంఛ తగ్గటం, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు వస్తాయి. దానికి పరిష్కారం ధ్యానం. రోజూ ధ్యానం చేయడం వల్ల కండరాలు, రక్తనాళాలు ఉపశమనం పొంది ఒత్తిడి తగ్గుతుంది.

ప్రొటీనుతో.. ఉల్లాసం తగ్గినప్పుడు ప్రొటీన్లు అధికంగా ఉండే చేపలు, గుడ్లు, క్వినోవా వంటివి తీసుకోవాలి. అవి మనలో ఉల్లాసాన్ని నింపి డిప్రెషన్‌, మతిమరుపు వంటి సమస్యలు దరిచేరనీయవు.

భాగస్వామితో.. బంధం ప్రారంభంలో ఉండే లైంగిక ఆసక్తి వయసు పైబడే కొద్దీ తగ్గుతుంది. భాగస్వామితో బయటకు వెళ్లడం, సంతోషకరమైన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, తక్కువ సమయాన్ని కూడా నాణ్యంగా, ఆనందంగా గడపాలి. తద్వారా మెదడులో డొపమైన్‌ ఉత్పత్తి అయ్యి ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉండగలుగుతాం.

పరీక్షలు తప్పనిసరి.... ఏ సమస్యలూ లేవని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కంటి సంబంధిత, బీపీ, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్‌, మామోగ్రామ్‌, సర్వైకల్‌ స్మెర్‌ వంటి ముఖ్యమైన ఆరోగ్య పరిక్షలన్నింటినీ క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్