గొబ్బిళ్లూ... భోగిపళ్లూ... ఇవే సందళ్లు!

పండగలంటే పూజలూ, పిండివంటలే కాదు... మన సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం కూడా. అలా సంక్రాంతి రోజుల్లో జరిగే గొబ్బిళ్లూ, భోగిపళ్ల వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Published : 14 Jan 2023 00:52 IST

పండగలంటే పూజలూ, పిండివంటలే కాదు... మన సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం కూడా. అలా సంక్రాంతి రోజుల్లో జరిగే గొబ్బిళ్లూ, భోగిపళ్ల వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ధనుర్మాస ప్రారంభంతోనే సంక్రాంతి శోభ మొదలవుతుంది. ఈ నెలరోజులూ నెలపట్టిన ముగ్గులో రంగులు అద్ది... మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మల్ని చేసి పెడతారు. గోధూళి వేళ బుడిబుడి నడకలు నేర్చే బుజ్జాయి నుంచి పెళ్లీడుకొచ్చిన ఆడపిల్ల వరకూ అంతా కలిసి...గొబ్బెమ్మల్ని, గుమ్మడి, బంతి, చామంతి వంటి పూలతో అలంకరించి, పసుపూ, కుంకుమలతో గౌరమ్మని కొలుస్తారు. ఆ సమయంలో ‘సుబ్బి గొబ్బెమ్మ- సుఖములీయవే’, ‘గొబ్బీయళ్లో- గొబ్బీయళ్లో’ అంటూ అలనాటి జానపదాలను పాడుతూ ఆడతారు. వీటిల్లో చాలావరకూ దేవీ దేవతలను ప్రస్తుతిస్తూనే మానవసంబంధాల విలువల్ని చాటి చెబుతుంటాయి. చివర్లో నానబెట్టిన అటుకులూ, బెల్లం, కొబ్బరికోరు, యాలకులూ...కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది ఒంట్లో వేడిని పుట్టించి... చలి గాలుల నుంచి రక్షించే పోషకాలను శరీరానికి అందిస్తుంది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.

రేగి...భోగి పళ్లుగా మారే రోజు...

భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి వేడుకలో భోగిపళ్లది ప్రత్యేక స్థానం. ఈ రోజు సందడంతా చిన్నారులదే. ఈ రోజున రేగు పళ్లని భోగిపళ్లుగా పిలుస్తారు. ముద్దులొలికే బుజ్జాయిలను చూసి మురిసిపోయినప్పుడు వారికి దిష్టితగలకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు అంటారు. అలా పోయడం వల్ల తల పైభాగంలో ఉండే బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందని చెబుతారు ఇంకొందరు. సూర్యుడి కరుణాకటాక్షాలు చిన్నారులకు అందేందుకూ భోగిపళ్లు పోస్తారంటారు మరికొందరు. ఏదేమైనా ఈ సంప్రదాయం సరదాల్నీ, సంతోషాల్నీ అందిస్తుంది. అందుకే... ఐదేళ్లలోపు పిల్లలను తల్లి ఒళ్లో కూర్చోబెట్టి....రేగుపండ్లలో బంతి పూల రేకులూ, చిల్లర నాణేలూ, చెరకు గడల ముక్కలూ కలిపి మహిళలంతా కలిసి వాటిని దోసిళ్లతో తలపై పోస్తారు. చుట్టూ చేరిన పిల్లలు... ఆ భోగిపళ్లనూ, వాటిలో ఉండే నాణేలనూ పట్టుకోవడానికి పోటీపడుతుంటారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందులోనూ ఊపిరితిత్తులూ, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటాయి. ఈ సమస్యలకు రేగు పళ్లు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిల్లో విటమిన్‌ సి ఎక్కువగా ఉండి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్