పెళ్లికూతురి గెటప్‌లోనే పరీక్ష రాసేసింది..!

మన అకేషన్స్‌ కోసం పరీక్షలు వాయిదా పడవు.. అందుకే పరీక్షలున్నప్పుడు పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్తపడతాం. మరి, అనుకోకుండా పెళ్లి ముహూర్త సమయానికి పరీక్ష రాయాల్సి వస్తే.. చాలామంది సప్లిమెంటరీలో చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ వధువు....

Updated : 31 Oct 2023 14:27 IST

(Photos: Instagram)

మన అకేషన్స్‌ కోసం పరీక్షలు వాయిదా పడవు.. అందుకే పరీక్షలున్నప్పుడు పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్తపడతాం. మరి, అనుకోకుండా పెళ్లి ముహూర్త సమయానికి పరీక్ష రాయాల్సి వస్తే.. చాలామంది సప్లిమెంటరీలో చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ‘పెళ్లి ముహూర్తం కాస్త ఆలస్యమైనా పర్లేదు.. కానీ పరీక్ష మాత్రం మిస్‌ కావద్దు’ అనుకున్నట్లుంది.. అందుకే పెళ్లి కూతురిలా ముస్తాబై ఇంటి నుంచి నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది. ఎంచక్కా పరీక్ష రాసేసి అటునుంచి అటే పెళ్లి మండపానికి బయల్దేరింది. అటు అందం, ఇటు తెలివితేటలు కలగలిసిన ఈ అందాల పెళ్లికూతురుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఎవరా పెళ్లికూతురు? రండి.. తెలుసుకుందాం..!

కేరళకు చెందిన శ్రీలక్ష్మి అనే వధువు అక్కడి బేథానీ నవజీవన్‌ ఫిజియోథెరపీ కాలేజీలో ఫిజియోథెరపీ కోర్సు చదువుతోంది. ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. తన పెళ్లితో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు కారణం.. పెళ్లికూతురిగా ముస్తాబై మరీ పరీక్ష రాయడమే!

వధువుగా పరీక్షా హాల్లో..!

శ్రీలక్ష్మి పెళ్లి, ఆమె ల్యాబ్‌ పరీక్ష ఒకే రోజు, ఒకే ముహూర్తానికి ఫిక్సయ్యాయి. దీంతో పెళ్లి కాస్త ఆలస్యమైనా పర్లేదు.. కానీ పరీక్ష మాత్రం మిస్సవ్వద్దనుకుందామె. అందుకే పెళ్లి కూతురిగా ముస్తాబై ఇంటి నుంచి బయల్దేరింది. నేరుగా కాలేజీకి చేరుకుంది. కార్లో కూర్చొని వచ్చేటప్పుడూ పుస్తకాలతోనే కుస్తీ పట్టింది. ఇక ఇలా పెళ్లి కూతురు గెటప్‌లో శ్రీలక్ష్మిని చూసిన ఆమె స్నేహితులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆమెతో ఫొటోలు, వీడియోలు దిగుతూ, ఆమెను ఫొటోల్లో బంధిస్తూ మురిసిపోయారు. ఇక అది ఫిజియోథెరపీకి సంబంధించిన ల్యాబ్‌ పరీక్ష కావడంతో తన బ్రైడల్‌ అటైర్‌పై నుంచి ఆప్రాన్‌, స్టెతస్కోప్‌ ధరించి.. మరింతగా ఆకట్టుకుందీ అందాల పెళ్లికూతురు. ఇక పరీక్ష ఆద్యంతం సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన ఆమె.. పరీక్ష ముగిశాక.. కళాశాల ఆవరణలో ఎదురుచూస్తోన్న తన తల్లి దగ్గరకు చేరుకొని ఆనందంతో హత్తుకుంది. ఆపై కార్లో నేరుగా పెళ్లి మండపానికి చేరుకొని తన ఇష్టసఖుడితో తాళి కట్టించుకుంది. ఇలా పెళ్లి కంటే తన కెరీర్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చిన శ్రీలక్ష్మి.. బ్రైడల్‌ అటైర్‌ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

రెంటినీ బ్యాలన్స్‌ చేయాలి!

ఇక మరోవైపు.. ‘మెడికో జీవితం ఇలాగే ఉంటుంది.. ఒకే రోజు పెళ్లి, ఫిజియోథెరపీ పరీక్ష.. అయినా వ్యక్తిగత విషయాలకు, కెరీర్‌కు సమప్రాధాన్యమివ్వాలి..’ అంటూ తానూ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోల్ని, వీడియోల్ని పోస్ట్‌ చేసిందీ కేరళ వధువు. ప్రస్తుతం లక్షల కొద్దీ లైక్స్‌ని సొంతం చేసుకున్న ఈ ఫొటోలు, వీడియోలు చూసిన చాలామంది.. ‘ఆమె అంకిత భావానికి సెల్యూట్‌!’ అంటూ సానుకూలంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. తమ జీవితంలో ఎదురైన ఇలాంటి అనుభవాల్ని పంచుకుంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. అన్నట్లు.. మరో విషయం ఏంటంటే.. శ్రీలక్ష్మి మంచి డ్యాన్సర్‌ కూడా! తాను డ్యాన్స్‌ చేసిన వీడియోల్ని ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటూ ఎంతోమందిని ఆకట్టుకుంటుంటుంది! ఇక తన సంగీత్‌ ఫంక్షన్‌లో తాను డ్యాన్స్‌ చేసిన వీడియో కూడా పోస్ట్‌ చేస్తూ.. తన డ్యాన్సింగ్‌ నైపుణ్యాల్ని మరోసారి చాటుకుందామె.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్