కిచెన్‌ను సరిగా శుభ్రం చేస్తున్నారా?

కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌.. ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో.. అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఈ సీజన్‌లో మరింత....

Published : 30 Jun 2022 20:47 IST

కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌.. ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో.. అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో చూద్దాం రండి..

* కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ.. వంటివి రోజూ నీళ్లు, డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి.

* ఆహారం వండిన ప్రతిసారీ ప్లాట్‌ఫామ్‌, స్టౌ శుభ్రంగా కడగాలి.

* వంట కోసం వాడిన పాత్రలన్నీ ప్రతిసారీ సబ్బు, నీటితో కడగాలి.

మూలమూలల్లోనూ శుభ్రం చేయాల్సిందే!

* కాయగూరలు కట్‌ చేసుకోవడానికి ఉపయోగించే చాపింగ్‌ బోర్డును, కత్తుల్ని వాడిన ప్రతిసారీ శుభ్రంగా కడిగేయాలి. అలాగే కాయగూరలకు, మాంసాహారానికి వేర్వేరు కటింగ్‌ బోర్డులు, కత్తులు వాడడం ఉత్తమం.

* ఎక్కడైతే కాయగూరలు కట్‌ చేశామో పని పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. లేదంటే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి.

* స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్‌ వైప్స్‌ని ఉపయోగించచ్చు. తరచూ వాడే రిఫ్రిజిరేటర్‌, ఒవెన్‌.. వంటి వస్తువులను వారానికోసారైనా క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి.

* కిచెన్‌ అంటే డైనింగ్‌ టేబుల్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. డైనింగ్‌ టేబుల్‌ని ఉపయోగించిన ప్రతిసారీ క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి. లేదంటే ఆహారపు అవశేషాలు దానిపైనే ఉండిపోయి వాతావరణంలోని క్రిముల్ని త్వరగా ఆకర్షించే అవకాశం ఉంటుంది.

* ఇక మాంసాహారం కడిగిన తర్వాత సింక్‌ లేదా ఆ ప్రదేశాన్ని సోప్‌ వాటర్‌తో ఒకసారి, ఆపై క్రిమి సంహారక ద్రావణంతో మరోసారి శుభ్రం చేసుకుంటే అటు దుర్వాసన రాకుండా ఉంటుంది.. ఇటు ఆ ప్రదేశంలో వైరస్‌, బ్యాక్టీరియాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పని పూర్తయ్యాక చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇతర వస్తువుల్ని తాకాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

* వంట కోసం మనం ఉపయోగించిన పాత్రలు, గిన్నెలు.. వంటివి సింక్‌లో పడేసి ఏ సాయంత్రమో లేదంటే మరునాడు ఉదయమో కడిగేసుకుంటాం. కానీ అలాంటి పాత్రల్లో ఉండే వ్యర్థాలు, జిడ్డుదనం, తేమ.. కారణంగా వాటి వాడకం పూర్తయిన రెండు గంటల తర్వాత బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కాబట్టి రెండు గంటల్లోపే వాటిని కడిగేసుకోవడం ఉత్తమం. ఆరేంత వరకు ఇలా ఎప్పటికప్పుడు పాత్రల్ని శుభ్రం చేసుకోవడం వల్ల శ్రమా తగ్గుతుంది.. ఆరోగ్యంగానూ ఉండచ్చు. అలాగే ఈ పాత్రల్ని పూర్తిగా ఆరబెట్టడమూ ముఖ్యమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్