భర్త చనిపోతే వారికి బాధ్యత ఉండదా!

మావారు చనిపోయి రెండేళ్లవుతోంది. మాకో బాబు. ఇంకా చదువుకుంటున్నాడు. ఆయన చనిపోయాక ఇల్లు గడవడం కష్టమైంది.

Published : 31 Jan 2023 00:37 IST

మావారు చనిపోయి రెండేళ్లవుతోంది. మాకో బాబు. ఇంకా చదువుకుంటున్నాడు. ఆయన చనిపోయాక ఇల్లు గడవడం కష్టమైంది. అద్దె ఇంట్లో ఉండలేక అత్తింటికి వచ్చేశా. ఇక్కడ భర్త నుంచి విడాకులు తీసుకున్న మా ఆడపడుచు కూడా ఉంటుంది. తనకి ఇబ్బంది కలగకూడదని...ఆ ఇంట్లో నేను ఉండటానికి వీల్లేదన్నారు. ఆస్తి రాసివ్వాలన్నా, ఆ ఇంట్లో ఉండాలన్నా వారి తదనంతరమే అని వాదించారు. తర్వాత పెద్ద మనుషుల జోక్యంతో వెనక్కి తగ్గారు. పంట పొలాల నుంచి ఆదాయం వస్తుంది. నెల నెలా అందులో నుంచి నాకు కొంత దక్కే అవకాశం ఉందా? కూతురికే అంతా రాసిచ్చేస్తారేమో అని భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు?

- ఓ సోదరి

గృహహింస నిరోధకచట్టం ద్వారా మీకు కావలసిన జీవనభృతిని పొందవచ్చు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉన్నందుకు వారేమైనా  బాధ పెడుతున్నారా? హిందూ వారసత్వ, భరణ పోషణముల చట్టంలోని సెక్షన్‌ 21 క్లాజ్‌ (4)... చనిపోయిన కొడుకు పిల్లలూ లేదా కూతురు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత ఆ ఇంటి పెద్దకు ఉందని చెబుతోంది. అలానే క్లాజ్‌ (7)... భర్త చనిపోయిన కొడుకు భార్య(కోడలు)...తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడూ, వేరే పెళ్లి చేసుకోనంత వరకూ ఆమెను పోషించాల్సిన బాధ్యత మామగారిదే అంటోంది.  ఒకవేళ అత్తింటి వారు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బాధ పెడుతున్నట్లయితే వారి మీద గృహ హింస చట్టం కింద ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేసి ముందు కౌన్సెలింగ్‌కి పిలిపించండి. వారు మీ తరఫున మాట్లాడి...  సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అది సాధ్యం కాకపోతే కోర్టుకు పంపుతారు. అక్కడ మీరు గృహ హింస చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం... ఇంటిలో భాగస్వామ్యం, 18 ప్రకారం రక్షణ , సెక్షన్‌ 20 ప్రకారం ఇతర ఆర్థికపరమైన ప్రయోజనాలను కోరవచ్చు. మీ అబ్బాయి చేత పిత్రార్జితంలో భాగస్వామ్య దావా కూడా వేయించొచ్చు. అయితే, అందుకు మీ మామగారు తన పిత్రార్జితపు ఆస్తిని అనుభవిస్తున్నారని న్యాయస్థానానికి నిరూపించగలగాలి.  ముందు మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నం చేయండి. సామరస్యంగా పరిష్కారం కాదనుకున్నప్పుడు కోర్టుకి వెళ్లండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్