ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

మాఘమాసం బహుళ చతుర్దశినాడు హిందువులంతా ఎంతో పవిత్రంగా జరుపుకొనే పర్వదినమే మహా శివరాత్రి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. చాలామందికి ఈ పర్వదినం రోజున శివుడికి అభిషేకం నిర్వహించి, ఉపవాసం చేసి, రాత్రంతా జాగరణ చేయడం....

Updated : 18 Feb 2023 15:21 IST

మాఘమాసం బహుళ చతుర్దశినాడు హిందువులంతా ఎంతో పవిత్రంగా జరుపుకొనే పర్వదినమే మహా శివరాత్రి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. చాలామందికి ఈ పర్వదినం రోజున శివుడికి అభిషేకం నిర్వహించి, ఉపవాసం చేసి, రాత్రంతా జాగరణ చేయడం ఆనవాయితీ. ఇలా ఆ భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకొని మనసారా కొలిస్తే.. భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంలా ఆ స్వామి విలసిల్లుతాడని భావిస్తుంటారు భక్తులు. అందుకే ఈ పవిత్రమైన రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు తమకు దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రాల్ని దర్శించుకొంటారు. మహా శివరాత్రి పర్వదినం నాడు ఆ ఈశ్వరుడిని సేవించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల పాపాలు, దారిద్య్రం తొలగిపోయి, భోగభాగ్యాలతో తులతూగుతారని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం..

శ్రీ భ్రమరాంబికామల్లికార్జున దేవస్థానం, శ్రీశైలం,నంద్యాల

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున మహాలింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి పీఠం రెండింటికీ నెలవు శ్రీశైల మహాక్షేత్రం. ఇక్కడ శివపార్వతులిద్దరూ ఎన్నో ఏళ్లుగా పూజలందుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల గిరులకు సిరిధన్, శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వత, శ్రీనగం అనే పేర్లు కూడా ఉన్నాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం ప్రతి సోమవారం చేసే ప్రత్యేక పూజలతో మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఇక కార్తీకమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో అయితే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకొని కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, శివపార్వతులను దర్శించుకుంటారు. 'దీపోత్సవం' పేరుతో ఆలయ ప్రాంగణంలో లక్షల సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీకపౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించే 'జ్వాలాతోరణం' కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఇందులో పాల్గొంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం. శ్రీశైలం చుట్టుపక్కల పర్యటకులను అమితంగా ఆకర్షించే మరెన్నో ఇతర ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి.


శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీకాళహస్తి, తిరుపతి

శ్రీ(సాలీడు), కాళము(పాము), హస్తి(ఏనుగు).. ఈ మూడు భోళాశంకరుణ్ని దర్శించి ముక్తి పొందాయని, వారికి శివుడు ఇచ్చిన వరం ఆధారంగానే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టారని ప్రతీతి. దీనికే 'దక్షిణ కైలాసం' అని కూడా పేరు. పంచభూత లింగాల్లో పృథ్వి, జలం, తేజస్సు, ఆకాశానికి సంబంధించిన నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటే తెలుగు ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక రూపం ఇక్కడి వాయులింగం. 'శ్రీశైలంలో పుణ్యదర్శనం చేసుకోవాలి.. కాశీలో మరణం పొందాలి..' అని తెలిపే పురాణాలు శ్రీకాళహస్తిలో కేవలం కాలుమోపినా చాలు ముక్తిని పొందచ్చని చెబుతున్నాయి. భక్తకన్నప్ప తన రెండు కళ్లను శివుడికి సమర్పించిన స్థలం ఇదే. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీకాళహస్తి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి రోజున భక్తులు ఇక్కడి స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానమాచరించి శివుడికి దీపాల వెలుగుల మధ్య ప్రత్యేక పూజలందిస్తారు. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రైలు, బస్సు సౌకర్యం ఉంది.


రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, వేములవాడ-రాజన్న సిరిసిల్ల

'దక్షిణకాశీ'గా ప్రాచుర్యం పొందిన శివాలయం ఇది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వర్ ప్రాంతాలను పావనం చేసిన తర్వాత పరమశివుడు వేములవాడ వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కార్తీకమాసం మొదటిరోజున స్వామికి ఏకరుద్రాభిషేకం పూజ నిర్వహిస్తారు. ఈ నెల మొత్తం వేలసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అక్కడి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ మాసంలో తొలి సోమవారం నాడు రాజన్నకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. భోళాశంకరుడు తాము కోరిన కోరికలు తీర్చాలని భక్తులు కోడె మొక్కులు సమర్పిస్తారు. వీటితో పాటు ఈ ఆలయంలో కార్తీకమాసంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహారుద్రాభిషేకం, మహాలింగార్చన చూసి తీరాల్సిందే. అలాగే పౌర్ణమిరోజు జ్వాలాతోరణం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకాలు నిర్వహించి.. చల్లగా చూడమని ఆయన్ను వేడుకుంటారు.


కాళేశ్వర-ముక్తీశ్వరాలయం-కాళేశ్వరం, భూపాలపల్లి

కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం.. ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశంగా పురాణాలు వర్ణించాయి. అలాంటి పుణ్యభూముల్లో ఓ భాగమై, శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాళేశ్వరం. ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడి పానపట్టంపై ఒకేసారి శివుడు, యముడు వెలిసినందుకు దీనికా పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి ముక్తీశ్వర లింగంపై రెండు నాసికారంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్వామిపై అభిషేకించిన పంచామృతాలు నేరుగా ఈ నాసికారంధ్రాల ద్వారా త్రివేణీ సంగమానికి చేరతాయి. పుణ్య గోదావరి, పవిత్రమైన ప్రాణహిత, అంతర్వాహిణిగా పేరొందిన సరస్వతి.. నదుల దివ్య సంగమం కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రంలో కనిపిస్తుంది. అందుకే కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి, మహాశివరాత్రి పర్వదినం రోజున చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ నదీస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుందీ ఆలయం. గోదావరి తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో కార్తీకమాసంలో ప్రజలు నదీస్నానాలు ఆచరించి, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు.


రామలింగేశ్వరస్వామి ఆలయం- కీసర, మేడ్చల్-మల్కాజ్‌గిరి

తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల జాబితాలో కీసరగుట్ట శివాలయం ఒకటి. ఇక్కడి శివుడు రామలింగేశ్వరస్వామిగా నీరాజనాలందుకుంటున్నాడు. ఈ క్షేత్రాన్ని పూర్వం కేసరగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా అది కీసరగుట్టగా రూపాంతరం చెందింది. ఇక్కడ శ్రీరామలింగేశ్వరస్వామి లింగం ప్రతిష్ఠాపన వెనుక ఒక పురాణకథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో సీతారాములు, హనుమంతుడు ఇక్కడకు వనవిహారానికి వచ్చినప్పుడు ప్రకృతి సంపదకు ఎంతగానో పరవశించిపోయిన శ్రీరాముడు లింగ ప్రతిష్ఠాపన చేసేందుకు రుషులను సంప్రదించాడు. అప్పుడు రుషులు శ్రీరాముడితో ఇక్కడ లింగస్థాపన చేస్తే రావణుణ్ని చంపిన బ్రహ్మహత్యాపాపం నుంచి విముక్తి పొందచ్చని సలహా ఇచ్చి, అందుకు ముహూర్తాన్ని సైతం నిర్ణయించారట. దీంతో కాశీకి వెళ్లి శివలింగాలను తేవాల్సిందిగా రాముడు హనుమంతునికి ఆదేశాలిచ్చాడు. అయితే హనుమంతుడు కాశీ నుంచి 101 లింగాలను తెచ్చేలోపు ముహూర్తం దాటిపోవడంతో శ్రీరాముడు శివుణ్ని ప్రార్థించగా, లింగరూపంలోకి మారిన శివుణ్ని అక్కడ ప్రతిష్ఠించాడట. విషయం తెలుసుకున్న హనుమంతుడు ఆందోళనకు గురై, తాను తెచ్చిన 101 లింగాలను తోకతో విసిరేశాడట. అలా విసిరిన శివలింగాలు ఈ క్షేత్రంలో అక్కడక్కడా పడ్డాయట. అప్పుడు రాముడు హనుమంతుణ్ని ఓదారుస్తూ జరిగిన దానికి చింతించవద్దని, ఈ క్షేత్రం హనుమంతుని పేరు మీదనే కేసరగిరిగా వర్థిల్లుతుందని వరమిచ్చాడట. శివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణమాసంలో పూజలు, దేవీనవరాత్రుల్లో ఉత్సవాలతో పాటు కార్తీకమాసంలో దీపారాధన కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి శివుడు పశ్చిమ ముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. హైదరాబాద్ నుంచి రోడ్డు ద్వారా గంటన్నర ప్రయాణిస్తే ఇక్కడకు చేరుకోవచ్చు.


సోమేశ్వరాలయం- పాలకుర్తి, వరంగల్

పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం ఇదే ప్రదేశంలోని వేర్వేరు గుహల్లో శివుడు, విష్ణువు కొలువై ఉండేవారట. లోకకళ్యాణార్థం కొండపై వెలసి, భక్తులకు దర్శనమివ్వాలని సప్తరుషులు వీరిని వేడుకుంటే శివుడు సోమేశ్వరస్వామిగా, విష్ణువు లక్ష్మీనరసింహస్వామిగా వెలిశారట. కొండపైకి వెళ్లే భక్తులు ఎవరైనా శుచి, శుభ్రత లేకుండా దైవదర్శనానికి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడి తేనెటీగలు కొండ కింది వరకు వారిని తరిమి, వెనక్కు పంపించేస్తాయని భక్తులు చెబుతారు. ఈ ఆలయంలో అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీకమాసంలో నిర్వహించే లక్షదీపార్చన, గోపూజకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు.


వేయిస్తంభాల గుడి - హన్మకొండ, వరంగల్

వరంగల్ జిల్లా వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి, కార్తీకమాసం తొలిరోజున తెల్లవారు జామున 3 గంటల నుంచే పూజలు మొదలవుతాయి. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ నిర్వహించే లక్షబిల్వార్చనలో పాల్గొంటే సకల సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కార్తీకంలో రోజూ నిర్వహించే రుద్రాభిషేకంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడి శివలింగాన్ని స్థానికులు మారేడు పత్రాలతో పూజిస్తారు.

వీటితో పాటు వరంగల్‌లోని రామప్ప గుడి, తాండూర్ భావిగి భద్రేశ్వరాలయం, కల్బగూర్ కాశీవిశ్వేశ్వరాలయం, ఎల్లంకొండ శివాలయం, ముర్తోటలోని శ్రీగంగా పార్వతీ ముక్తీశ్వరాలయం.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆ శంకరుడు కొలువుదీరిన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ మహాశివరాత్రి, కార్తీకమాసం పర్వదినాల్లో భక్తులతో కిటకిటలాడుతూ, శివనామస్మరణతో మార్మోగిపోతూ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్